![]() |
![]() |

రెండు రోజుల క్రితం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తవసి కేన్సర్‌తో బాధపడుతున్నారనే వార్త ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చింది. ఆయన స్వయంగా తనను ఆర్థికంగా ఆదుకోవాలని అర్థిస్తూ ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో ఆన్‌లైన్‌కి రాగానే, అనేకమంది దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాన్ని చూసిన స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి వెంటనే రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఆయన తరపున నటుడు సౌందర రాజా ఆ డబ్బును తవసి ఇంటికి వెళ్లి అందించడమే కాకుండా, తన వంతు రూ. 10 వేలు సాయం అందజేశారు.
అంతకుముందు తన కేన్సర్ చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్న తవసి వీడియో వైరల్ అయ్యింది. కేన్సర్ కారణంగా తవసి రూపం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సాధారణంగా బొద్దుగా, బలంగా ఉండే ఆయన బరువు కోల్పోయి పీలగా అయిపోయారు. "నేను దాదాపుగా 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. కిళక్కు చీమయిలే (1993) నుంచి రజనీకాంత్ లేటేస్ట్ ఫిల్మ్ అన్నాత్తే దాకా నటించాను. ఇలాంటి రోగం వస్తుందని నేనెన్నడూ ఊహించలేదు" అని ఆ వీడియోలో చెప్పిన తవసి, సినిమా ఇండస్ట్రీలోని వారే తనను ఆదుకోవాలని కోరారు. కాగా తవసి మెడికల్ బిల్లులు చెల్లించడానికి నటులు శివ కార్తికేయన్, సూరి ముందుకు వచ్చారని తెలుస్తోంది.
![]() |
![]() |