![]() |
![]() |

బాలకృష్ణ ఏ కార్యక్రమంలో ప్రసంగించాల్సి వచ్చినా, ఆయన ఏం చెబుతారో అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. కొత్త కొత్త విషయాలతో ఫ్యాన్స్‌ను అలరించడం బాలయ్యకు అలవాటు. ఇప్పుడు కూడా ఓ కొత్త విషయంతో అభిమానులను అలరించారు బాలయ్య! అవును. 'సెహరి' అనే ఓ చిన్న సినిమా కార్యక్రమానికి వెళ్లి దాని ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన బాలయ్య చాలాసేపు మాట్లాడారు. అందులో ఓ కొత్త విషయం ఉంది. తనకు బయటివాళ్లు సినిమాలు చూపించరనీ, కారణం.. వాటిని చూసేటప్పుడు తను మధ్యలో లేచి వెళ్లిపోతాననే భయంతోనని ఆయన తెలిపారు. అయితే అలా వెళ్లిపోయి తాను ఎంత బాధపడతానో ఎవడికీ తెలీదని ఆయన అంటున్నారు.
బాలయ్య ఏమన్నారంటే.. "బయటివాళ్లు చాలామంది నాకు సినిమాలు చూపించరు. ఎందుకంటే భయపడతారు, నేను మధ్యలో లేచి వెళ్లిపోతానని. ఎందుకెళ్తానంటే.. సంతోషం కాదు, సర్కాజమ్ కాదు, శాడిజం కాదు. వెళ్లిపోయి ఎంత బాధపడతానో ఎవడికీ తెలీదు. కొంతమందికి సలహాలు కూడా ఇస్తాను, ఉచితంగానే. నేనేమీ ఐటీ లాగా కన్సల్టెన్సీ పెట్టుకోలేదు. సలహాలిస్తా.. వాళ్లు పాటిస్తే ఓకే. లేకపోతే వాళ్ల ఖర్మ. నాలో నేను మథనపడతాను.. ఎందుకురా ఇంత ఖర్చుపెట్టి ఇంత చిన్న తప్పు ఎందుకు చేశారా అని. నా సలహా ఎందుకు వినలేదు అని బాధపడతా. అంటే నేనిచ్చిన ప్రతి సలహా మంచిదని కాదు. నేనిచ్చినా కూడా ఆడకపోవచ్చు, ఇవ్వకపోయినా సినిమాలు ఆడొచ్చు. నాలోని క్రియేటివిటీ అలా చెప్పిస్తుంది." అదీ విషయం.
![]() |
![]() |