![]() |
![]() |

టీవీ సీరియల్స్ వచ్చే అత్తాకోడళ్ల సీరియల్స్ చూసేవాళ్లకు వాళ్లు సహజంగానే బద్ధ శత్రువులనీ, కోడలు పాలిట అత్త పెద్ద రాక్షసి అనీ అభిప్రాయం కలగకుండా ఉండదు. నిజ జీవితంలో జరిగేవాటినే సీరియల్స్‌లో చూపిస్తున్నామని వాళ్లంటూ ఉండటమూ తెలుసు. అయితే నిజ జీవితంలో తల్లీకూతుళ్ల లాగా కలిసిపోయే అత్తాకోడళ్లూ ఉంటారు. బచ్చన్ ఫ్యామిలీ అందుకు చక్కని ఉదాహరణ. జయా బచ్చన్, ఐశ్వర్యా రాయ్ మధ్య బంధం చూస్తే.. వారిద్దరూ తల్లీకూతుళ్లేమో అనేంత సన్నిహితంగా కనిపిస్తారు.
నీలికళ్ల మెరుపుతీగగా ఐశ్వర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో తెలిసిందే. ఆమె ఆరాధకుల సంఖ్యలో కోట్లలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. తన కెరీర్‌లో ఎన్నో టైటిల్స్, అవార్డులు అందుకున్నప్పటికీ బచ్చన్ కోడలు అనిపించుకోవడాన్ని ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. వినమ్రంగా, హుందాగా నడుచుకొనే ఆమెను బచ్చన్ ఫ్యామిలీ ఎంతగానో ప్రేమిస్తుంటుంది.
నవంబర్ 1న ఐశ్వర్య 47వ పుట్టినరోజును జరుపుకుంది. ఫ్యాన్స్, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఐశ్వర్యను శుభాకాంక్షల వర్షంలో తడిసి ముద్దయ్యేట్లు చేశారు. కాగా అత్తయ్య జయా బచ్చన్‌పై తనకున్న ప్రేమను ఓ సందర్భంగా వ్యక్తం చేసిన ఐశ్వర్య.. ఆమె బయోపిక్‌లో ఆమె క్యారెక్టర్‌ను పోషించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. చదవడానికి, వినడానికి అది ఎంతో బాగుంది కదూ! ఆమె ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందేమో చూడాలి. ఎంతోమంది ఔత్సాహిక తారకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్న ఐశ్వర్య తన సొంత అత్తయ్య నుంచి ఇన్‌స్పిరేషన్ పొందుతోంది అన్నమాట!

![]() |
![]() |