![]() |
![]() |

మద్రాసులో ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు కుర్రాళ్లు అనంతర కాలంలో తెలుగు చిత్రసీమలో తమకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ ముగ్గురు... గుణశేఖర్, వై.వి.ఎస్. చౌదరి, రవితేజ. వీరిలో మొదటి ఇద్దరూ దర్శకులుగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోగా, మూడో వ్యక్తి స్టార్ హీరో హోదాని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ కలిసి ఓ సినిమాకి పనిచేశారు. ఆ సినిమా 'నిప్పు'. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, బొమ్మరిల్లు పతాకంపై వైవీఎస్ చౌదరి నిర్మించారు.
అప్పట్లో నటి అనూరాధ తల్లి సరోజ గారింట్లో గుణశేఖర్ కింది రూములో ఉంటే, రవితేజ, వైవీఎస్ పై రూములో ఉండేవాళ్లు. చిత్రసీమలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఒకే ఇంట్లో ఉన్న ఆ ముగ్గురూ తర్వాత కాలంలో ఒకే సినిమాకి కలిసి పనిచేస్తారని అప్పుడు వారు ఊహించలేదు. తాను విపరీతంగా అభిమానించే ఎన్టీఆర్ జయంతి రోజు 2011 మే 28న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు వైవీఎస్. 2012 ఫిబ్రవరి 2న ఆ సినిమా విడుదలైంది. దురదృష్టవశాత్తూ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతింది. నిర్మాతగా వైవీఎస్ బాగా నష్టపోయారు.
ఈ సినిమాని అనౌన్స్ చేసేటప్పుడు వైవీఎస్, "మా బేనర్‌లో భిన్న భిన్న కథలతో ఇతర దర్శకులతో సినిమాలు చేయాలనే నిర్ణయంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా. నేనభిమానించే దర్శకులతో, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ సినిమాలు నిర్మిస్తా" అని చెప్పారు. అందులో భాగంగా గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు' తీస్తున్నాననన్నారు. కానీ 'నిప్పు' కాలడంతో వైవీఎస్ మళ్లీ వేరే దర్శకుడితో తన బేనర్‌లో సినిమా తీసే సాహసం ఇంతదాకా చేయలేదు. సినిమా ఫీల్డ్ అంతే.. మనం ఒకటి అనుకుంటే.. జరిగేది ఇంకొకటి!
![]() |
![]() |