![]() |
![]() |

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30 రాత్రి బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లును పెళ్లాడిన విషయం విదితమే. అనామికా ఖన్నా డిజైన్ చేసిన గోల్డెన్ ఎంబ్రాయిడరీ లెహంగా, ఆనియన్ పింక్ దుపట్టాతో కాజల్ మెరిసిపోగా, అనితా డోంగ్రే డిజైన్ చేసిన వైట్ షేర్వాణీలో గౌతమ్ ఆకట్టుకున్నాడు. కాగా పంజాబీ అయిన కాజల్, కశ్మీరీ అయిన గౌతమ్ తెలుగు సంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లంతో పెళ్లి చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.
శనివారం కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా కొన్ని బ్యూటిఫుల్ వెడ్డింగ్ పిక్చర్లను షేర్ చేసింది. పెళ్లి మండపంలో తన జీవిత భాగస్వామి చేతిని తన చేతుల్లోకి తీసుకొని కాజల్ ముద్దు పెట్టుకుంటున్న ఫస్ట్ పిక్చర్ ముచ్చట గొలిపింది. "And just like that, from ms to mrs! I married my confidante, companion, best friend and soulmate. So glad I found all of this and my home in you @kitchlug #kajgautkitched." అని దానికి క్యాప్షన్ జోడించింది కాజల్. గౌతమ్‌ను ఆమె తన నమ్మకం, తన తోడు, బెస్ట్ ఫ్రెండ్, సోల్‌మేట్ అని అభివర్ణించింది.

మరో పిక్చర్‌లో వధూవరులిద్దరూ పెళ్లి సంప్రదాయాలను పాటిస్తూ కనిపించారు. దాని క్యాప్షన్‌లో 'పంజాబీ మీట్ కశ్మీరీ' వెడ్డింగ్ అని పేర్కొంది. "మా పంజాబీ మీట్స్ కశ్మీరీ వెడ్డింగ్‌లో, మేం కేవలం జీలకర్ర, బెల్లం జోడించాం. సౌత్ ఇండియాతో మా ఇద్దరి వ్యక్తిగత బంధాలకు ఇది ఒక నీరాజనం. తెలుగు పెళ్లిలో, వధూవరుల కలయికను జీలకర్ర, బెల్లం తెలియజేస్తాయి. జీలకర్ర, బెల్లంను పేస్ట్‌లా చేసి, దాన్ని తమలపాకులో పెడతారు. పురోహితుడు వేద మంత్రాలను పఠిస్తుండగా, వధూవరులు దానిని పరస్పరం తమ తలలపై పెడతారు. ఈ తంతు పూర్తయ్యాకే వధూవరులు ఒకరినొకరు చూసుకుంటారు. కష్టసుఖాలన్నింటిలోనూ ఆ దంపతులు కలిసి మెలిసి ఉంటారని ఇది తెలియజేస్తుంది" అని ఆమె రాయడం విశేషం. తెలుగువారి పెళ్లి తంతు ఆమెకు అంతగా నచ్చిందన్న మాట!

![]() |
![]() |