![]() |
![]() |

బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. టాలీవుడ్‌కు సంబంధించి ఆమె కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లే అనిపిస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాలు 'ఆనంద్', 'గోదావరి'తో తెలుగు ప్రేక్షకులకు బాగా సన్నిహితమైన ఆమె 'స్టైల్', 'గమ్యం', 'గోపి గోపిక గోదావరి' వంటి సినిమాలతో ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. వాటిలో 'పోలీస్ పోలీస్', 'మా అన్నయ్య బంగారం', 'నాగవల్లి', 'విరోధి', 'షిరిడీ సాయి', 'రామాచారి', 'జగద్గురు ఆదిశంకర' వంటివున్నాయి.
అందంకంటే అభినయాన్నే ఎక్కువ నమ్ముకున్న ఆమెకి టాప్ హీరోలతో చేసే అవకాశాలు రాలేదు. వెంకటేశ్ సినిమా 'నాగవల్లి' చేసినా అది ఆయన సరసన హీరోయిన్ పాత్ర కాదు. నీలకంఠ డైరెక్ట్ చేసిన 'విరోధి'లో ఆమెది పేరుకు హీరోయిన్ పాత్రయినప్పటికీ మరీ చిన్న పాత్ర కావడం, పైగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలవడం వల్ల ఆమెకి ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. భక్తి చిత్రాలు 'షిరిడీ సాయి' కానీ, 'జగద్గురు ఆదిశంకర' కానీ ఆమెకు గట్టెంక్కించలేకపోయాయి. కృష్ణవంశీ సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' (2014)లో శ్రీకాంత్ జోడీగా కనిపించాక మళ్లీ ఆమె టాలీవుడ్‌లో కనిపించలేదు.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆమె చివరి సారిగా నటించిన మలయాళ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడం. అది మోహన్ లాల్ సరసన నటించిన 'పులి మురుగన్'. అలాంటి హిట్ సినిమాలో నటించాక కమలిని హఠాత్తుగా సినిమా ఇండస్ట్రీలో కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. ఇప్పుడామె ఎక్కడుందో, ఏం చేస్తోందో!?
![]() |
![]() |