![]() |
![]() |

బుధవారం కంగనా రనౌత్ ఆఫీస్‌లోకి అడుగు పెట్టింది బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బృందం. నిన్న ముంబైలోని ఆమె ఆఫీస్ బయట 'స్టాప్ వర్క్' నోటీస్‌ను బీఎంసీ అంటించింది. నిబంధనలకు విరుద్ధంగా, సరైన అనుమతులు లేకుండా ఆ ఆఫీస్ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారంటూ నిన్న నోటీస్ ఇచ్చిన బీఎంసీ, ఈ రోజు ఆ నిర్మాణాన్ని కూల్చివేయనున్నామని నోటీస్ ఇచ్చింది. ఆ వెంటనే జేసీబీ, ఇతర కూల్చివేత సామగ్రితో వచ్చిన బృందం కూల్చివేత పనిని ప్రారంభించింది.
ముంబై గురించి పాక్ ఆక్రమిత కశ్మీర్ లాగా ఉందనీ, తాలిబన్లు దాన్ని పాలిస్తున్నట్లు ఉందనీ కంగన చేసిన వ్యాఖ్యలు, దానిపై మహారాష్ట్ర పాలక పార్టీ శివసేన కౌంటర్‌తో వాళ్లిద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. లాక్‌డౌన్ విధించినప్పట్నుంచీ మనాలిలో ఉంటున్న కంగన ముంబైకి తిరిగి రావడానికి చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సమయంలోనే ఆమె ఆఫీస్ కూల్చివేత పనులు మొదలయ్యాయి.
అంతకుముందు బీఎంసీ ఇచ్చిన స్టాప్ వర్క్ నోటీస్‌కు కంగన లాయర్ రిజ్వాన్ సిద్దిఖి సమాధానమిచ్చారు. అసలు కంగన ఆఫీస్ దగ్గర ఎలాంటి పనులూ జరగడం లేదనీ, అటాంటప్పుడు 'స్టాప్ వర్క్' నోటీస్ ఇవ్వడం అనేది చట్టాన్ని దుర్వినియోగం చేయడమేననీ చెప్పారు. ఈ మేరకు ఆయన బీఎంసీకి కౌంటర్ నోటీస్ ఇచ్చారు. అయినప్పటికీ, తాజా నోటీస్‌లో కంగన లాయర్ ఇచ్చిన సమాధానం నిరాధారంగా ఉందని బీఎంసీ పేర్కొంది. "మేం నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి నోటీస్‌లో పేర్కొన్న నిర్మాణ ఖర్చు, కూల్చివేత పరిణామాలకు మీదే బాధ్యత" అని బీఎంసీ తెలిపింది.
కాగా, తన ఆఫీస్‌ను బీఎంసీ అధికారులు కూల్చివేస్తున్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసిన కంగన, "నేనెప్పుడూ రాంగ్ కాదని నా శత్రువులు ప్రతిసారీ నిరూపిస్తూనే ఉన్నారు. నేను ముంబైని పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) అని చెప్పింది ఇందుకే." అని పోస్ట్ చేసింది.

దానికి కొనసాగింపుగా మరిన్ని పిక్చర్స్ షేర్ చేస్తూ "బాబర్ అండ్ హిజ్ ఆర్మీ" అని తీవ్ర వ్యాఖ్యతో ట్వీట్ చేసింది.

![]() |
![]() |