![]() |
![]() |

వెటరన్ బాలీవుడ్ నటి, మూడు సార్లు జాతీయ అవార్డు విజేత అయిన 75 సంవత్సరాల సురేఖా సిక్రి మంగళవారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండేళ్ల కాలంలో ఆమెకు స్ట్రోక్ రావడం ఇది రెండోసారి. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారనీ, ఆమె ఆరోగ్య స్థితి నిలకడగా ఉందనీ సమాచారం.
తను నటించిన 'బధాయి హో' సినిమా రిలీజయ్యాక 2018 నవంబర్‌లో ఆమె తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దాంతో ఆమె పాక్షిక పక్షవాతానికి గురయ్యారు. దాని నుంచి కోలుకున్నాక కూడా అన్ని వేళలా ఆమెను జాగ్రత్తగా చూసుకొనేందుకు ఒక నర్సును నియమించారు. మంగళవారం ఉదయం జ్యూస్ తాగుతూ పడిపోయిన సురేఖను నర్సు వెంటనే హాస్పిటల్‌కు తరలించింది.

చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ 'ఘోస్ట్ స్టోరీస్'లో జాన్వీ కపూర్‌తో కలిసి నటించారు సురేఖా సిక్రి. 'తమస్' (1988), 'మమ్మో' (1995), 'బధాయి హో' (2018) చిత్రాలలో ప్రదర్శించిన నటనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా జాతీయ అవార్డులను అందుకున్నారు. ఎనిమిది సంవత్సరాల పాటు ప్రసారమైన టీవీ సీరియల్ 'బాలికా వధు' (తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు')లో కుటుంబ పెద్దగా ప్రదర్శించిన అభినయం ఆమెను దేశవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ సన్నిహితం చేసింది.
![]() |
![]() |