Home  »  News  »  దాశరథి మధుర గీతాలు.. చిత్ర సీమకు మణిహారాలు!

Updated : Jul 22, 2020

 

దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణా ఆధునిక సాహిత్య లోకంలో అద్భుతమైన రచనలు చేశారు. ఆనాటి యువతను, పోరాట యోధులను తన కవిత్వంతో రుద్రవీణ మీటి చైతన్యవంతులుగా చేసిన మహాకవి. ఆనాడు కొనసాగుతున్న నిజాం నిరంకుశత్వాన్ని ధిక్కరించడంలో, ఆయనకున్న అకుంఠిత పోరాట శక్తి, దాశరథి కవితల్లో ప్రజ్వలిస్తూ ప్రజల్ని ర‌జాకార్ల‌పై తిరుగుబాటు దిశగా నడిపించిది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ కీర్తించిన మహాకవి తెలంగాణ  గడ్డ మీద  పుట్టడం మనందరి అదృష్టం.

దాశ‌ర‌థి వరంగల్ జిల్లా మానుకోట తాలుకాలోని చిన్న గూడూరు గ్రామంలో వెంకటమ్మ వెంకటాచార్యుల దంపతులకు 1925 జూలై 22న జన్మించారు. వీరిది విశిష్టాద్వైత వైష్ణవ సాంప్రదాయ కుటుంబం కావడం వల్ల చిన్నతనం నుండి, భగవద్గీతలోని వేదాల్ని, ఇతిహాసాలను ఔపోస‌న‌ పట్టారు. దాశరథి ఆశువుగా పద్యాలూ చెప్పేవారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు.

నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గోని, నిజామాబాద్ జైలులో బంధింప పడ్డారు. బొగ్గుతో జైలు గోడల మీద విప్లవ గీతాలు నిజాంకు వ్యతిరేకంగా పద్యాలూ, కవితలు రాసి దెబ్బలు తిన్నారు. తెలంగాణ 1948 సెప్టెంబర్ 17 వ తేదిన నిజాం పాలన నుండి హైద్రాబాద్ సంస్థానం విముక్తి పొందేవరకు జైలు జీవితాన్ని అనుభవించారు. అప్పటికే బహుముఖ ప్ర‌జ్ఞాశాలిగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులయ్యారు. వారు అనేక సాహిత్య ప్రక్రియల్లో లబ్ధ ప్ర‌తిష్ఠితునిగా పేరుగాంచారు.

దాశరథి “అగ్నిధార”, “మహాంధ్రోద‌యం”,  “రుద్రవీణ”,  “తిమిరంతో సమరం” లాంటి కావ్య ఖండికలను వెలువరించారు. “తిమిరంతో సమరం” కావ్య సంపుటికి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. “కవితా పుష్పకం” రచనకు గాను అంధ్రప్రదేశ్ సాహిత్య  అకాడమి అవార్డ్ ను అందుకున్నారు. మీర్జా గాలీబ్ ఉర్దూ గజళ్ళను గాలీబ్ గీతాల పేరుతో తెలుగులోకి అనువదించారు.

తెలంగాణ సాహిత్యంలో నవయుగ వైతాళికుడుగా ముద్ర వేసుకొన్న దాశరధి కృష్ణమాచార్యులు, మరో పార్శ్యంలో గీత రచయితగా చిత్ర సీమలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకొన్నారు. తెలుగు సినిమా చరిత్ర‌ మీద చెరగని సంతకంలా, ఉన్నత శిఖరాల నుంచి, సినిమాల్లోకి దూకేశారాయ‌న‌. సినిమా చిట్టడవిలో చిక్కుకున్న మహాకవి అని కొందరు వాపోయినా, ఆ చిట్టడవిలో ఎన్నెన్నో సుమధుర గీతాలతో వసంతాన్ని పూయించారు.

దాశరథి సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందే సముద్రాల, పింగళి, మల్లాది, ఆత్రేయ, కొసరాజు, శ్రీ శ్రీ, సి.నా.రే లాంటి లబ్ద ప్రతిష్టులైన రచయితలు ఉన్నారు. వీరందరి మధ్య తనదైన ప్రత్యేకత నిలుపుకోవడమే కాదు.. ఒక వెలుగు వెలిగారు.
అక్కినేని నాగేశ్వరరావు 1961లో కథానాయకుడిగా నటించిన “ఇద్దరు మిత్రులు” చిత్రంలో గేయ రచయితగా ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో “ఖుషీ ఖుషీగానవ్వుతూ.." గీతంలో  ప్రేక్షకుల మనసులని దోచుకున్నారు. ఖుషి ...ఖుషీ ..అనే ఉర్దూ పదాల పొందికతో పాట ఒక కొత్త ఒరవడితో సాగింది. ప్రేమ సన్నివేశానికి, భక్తి సన్నివేశానికి పాటలు వ్రాయడానికి దాశరథికి ప్రాధాన్యత నిచ్చారు. సన్నివేశానికి రక్తి కట్టించడమే పాట పరమోద్దేశంగా భావించేవారు.

హీరో హీరోయిన్ల ప్రణయోద్వేగాల్ని, అవ్యక్త భావనల్ని తనదైన శైలిలో వ్యావహారిక భాషలో పాట‌ల రూపంలో అనువ‌దించారు. ద్వంద్వర్థాలు లేకుండా స్వచ్ఛ‌మైన తెలుగులో దాశరథి రచించిన పాటలు ప్రేక్షకుల మనోఫలకాలపై చిరస్థాయిగా నిలచిపోయాయి. "గోదారి గట్టుంది... గట్టుమీద చెట్టుంది.. చెట్టుమీద పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది?" అంటూ అపూర్వ బాణీలో సాగిన పాట తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి, ఆ సినిమాను ఈ ఒక్క పాట కోసం ప్రజలు మళ్ళీ మళ్ళీ చూసే ఘనత దక్కించుకున్నారు.

“ఏ దివిలో విరిసిన‌ పారిజాతమో” అంటూ కన్నె వయసు చిత్రంలో కథానాయకుడు పాడుకునే ఈ ప్రేమ గీతం ఎందరో యువకుల్ని ఇప్పటికి ఉహాలోకల్లో విహరించేలా చేస్తుంది. "వినిపించని రాగాలే" (చదువుకున్న అమ్మాయిలు), "ఎన్నెన్నో జన్మల బంధం" (పూజ), మంచిమనుషులు లోని “నన్ను వదిలి నీవు వెళ్లి పోవులే” పాట‌లు గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. “నా కంటి పాపలో నిలచిపోరా” అంటూ 'వాగ్దానం'లో రాసి మనసు కవి ఆత్రేయకు ధీటుగా నిలిచారు. అలాగే 'మంచి మనిషి' చిత్రంలో “ఓ  గులాబి బాల” పాట గాయ‌కునిగా పి.బి.శ్రీనివాస్ కి ఎనలేని కీర్తి తెచ్చి పెట్టింది. 'మాతృ దేవత' చిత్రం కోసం వీరి కలంలో నుండి జాలువారిన గీతం “మనసే కోవెలగా..” పాట వీనుల విందుగా సాగింది.

యవ్వనంలో తీవ్రవాద భావజాలంతో నైజాంను ఎదిరించిన దాశరథి, తన వ్యక్తిగత అభిప్రాయాలు ఏవైనా, సినిమా కవిగా మాత్రం సన్నివేశాన్ని రక్తికట్టించడమే లక్ష్యంగా నిర్మాత, దర్శకులు కోరిన రీతిన భక్తి పాటలు కూడా అందించారు. “రారా కృష్ణయ్యా ....రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా" అంటూ ఆర్తితో కృష్ణున్ని వేడుతూ గీత రచన చేశారు. ఇలాంటిదే మరోపాట రంగుల రాట్నంలోని “నడిరేయి ఏ జాములో” . ఇలాంటి భక్తి గీతాలెన్నో తెలుగు ప్రేక్షకులకు అందించారు. వారి పాటలను ఉదహరిస్తూ పోతుంటే, అవన్నీ వందల సంఖ్యలోకి చేరతాయి.

దాశరథి రాసిన ఉర్దూ గజళ్ళను ప్రస్తావించకుంటే,ఆయన పాటలకు పరిపూర్ణత్వం రాదనిపిస్తుంది. అందుకే ఈ ఒక్క పాటనైన పేర్కొంటున్నాను. భాషలోని లలిత పదాలని భావజాలానికి తగినట్టుగా ఎంచ‌కోవడమే గజల్ ప్రక్రియలోని ప్రతిభ. ప్రేయసి మీద విరహంతో తిరుగాడే ప్రేమికుల్ని గురించి ఒకే అక్షరాన్ని సైతం పదును పెట్టి విరి బాణంలో వదలగలిగిన భాషా దురంధరుడు దాశరథి. 'మా ఇంటి దేవత' సినిమా కోసం రచించిన ఈ పాటలో పల్లవితోనే అడుగడుగునా మీర్జా గాలిబ్ కళ్ళల్లో మెదలుతాడు.
“విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి” అంటూనే "నీ లేత గులాబి పెదవులతో కమ్మని మ‌ధువుని తాకాలి” అంటాడు కాని “తాగాలి” అనడు. అదే దాశరథి సున్నితమైన దృక్కోణం. “చంద్రుని ముందర తారవలే నా సందిట నీవే వుండాలి ఈ మధువంతా నీకోసం, పెదవుల మధువే నాకోసం” అంటూ సున్నితంగా మధువును మగువను ఏక దృష్టితో సంబోధిస్తూ వ్రాయడం దాశరథికే సాధ్యపడింది.

సాంప్రదాయ కవిగా, ఆధునిక కవిగా, ప్రజాకవిగా తెలుగు ప్రజల నిండు హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందిన మహాకవి దాశరథి.     

(జూలై 22 దాశ‌ర‌థి జ‌యంతి)

- రావుల పుల్లాచారి (విశ్రాంత పర్యవేక్షకులు)
                                                                CELL: 9949208476
                                నంది అవార్డు గ్రహీత
                               






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.