![]() |
![]() |
.jpg)
మలయాళ చిత్రం ‘గీతాంజలి’(2013)తో కథానాయికగా తెరంగేట్రం చేసింది కీర్తి సురేశ్. మొదటి సినిమాలోనే మోహన్ లాల్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించిన ఈ మలయాళీ కుట్టి.. ఆపై అడపాదడపా భాషాతీతంగా అగ్ర కథానాయకుల కాంబినేషన్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తమిళంలో ఇప్పటికే విజయ్ (భైరవ, సర్కార్), సూర్య (తానా సేరంద కూట్టం), విక్రమ్ (సామి స్క్వేర్) వంటి స్టార్ హీరోలతో జోడికట్టిన కీర్తి.. తెలుగులో ఆ మధ్య పవన్ కళ్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’లో ఆడిపాడింది. అయితే వీటిలో ఏ సినిమా కూడా కీర్తికి నటిగా గుర్తింపును తీసుకురాలేదు. యువ కథానాయకుల చిత్రాలతోనూ, ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్‌తోనూ ఈ టాలెంటెడ్ బ్యూటీ కీర్తి పెరిగింది. కట్ చేస్తే.. ఇప్పుడు కీర్తి చేతిలో ఏకంగా మూడు అగ్ర కథానాయకుల సినిమాలున్నాయి. ఆ ముగ్గురు కూడా వేర్వేరు భాషలకు చెందిన సూపర్ స్టార్స్ కావడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. విడుదలకు సిద్ధమైన మలయాళ చిత్రం ‘మరక్కర్: అరబిక్కడలింటే సింహం’లో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది కీర్తి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివరిలో తెరపైకి వచ్చే అవకాశముంది. అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న ‘అణ్ణాత్తే’లోనూ కీర్తి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో రజనీకి కూతురుగా కీర్తి దర్శనమివ్వనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. అదే విధంగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతోనూ కీర్తి నటిస్తోంది. ‘సర్కారు వారి పాట’ పేరుతో రూపొందనున్న ఈ ఇంటెన్స్ సోషల్ డ్రామా.. త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే అవకాశముంది.
విజయ్, సూర్య, విక్రమ్, పవన్ కళ్యాణ్.. ఇలా స్టార్ హీరోస్‌తో కలిసి నటించిన ప్రతి సందర్భంలోనూ కీర్తికి అనుకున్నంత గుర్తింపు దక్కలేదు. మరి.. సూపర్ స్టార్స్ (మోహన్ లాల్, రజనీకాంత్, మహేశ్ బాబు) కాంబినేషన్స్‌తోనైనా తన ట్రాక్ రికార్డ్ మారుతుందేమో చూడాలి.
![]() |
![]() |