![]() |
![]() |

అక్కినేని వారి ఫ్యామిలీ మూవీ ‘మనం’తో నయా ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టింది అందాల తార శ్రియ. ఆ సినిమా రిలీజ్ అయిన ముహూర్తం ఎలాంటిదోగాని ఏడాదికో మల్టీస్టారర్ మూవీలోనైనా కనిపిస్తూ మురిపిస్తోంది. అయితే కథానాయికగానో లేదంటే అతిథి పాత్ర, ప్రత్యేక గీతంలోనో సందడి చేస్తోందీ టాలెంటెడ్ బ్యూటీ. వీటిలో బడా బడ్జెట్ మల్టీస్టారర్స్‌తో పాటు మీడియం బడ్జెట్ మల్టీస్టారర్స్ కూడా ఉండడం గమనార్హం.
ఆ వివరాల్లోకి వెళితే.. 2014లో అక్కినేని వారి మూడు తరాల కథానాయకులు ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ మల్టీస్టారర్ ‘మనం’లో ఓ కథానాయికగా నటించిన శ్రియ.. 2015లో వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన రీమేక్ మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’లో వెంకీకి జోడిగా కనువిందు చేసింది. ఇక 2016 విషయానికొస్తే.. నాగార్జున – కార్తి కాంబినేషన్‌లో వచ్చిన బై-లింగ్వల్ మల్టీస్టారర్ ‘ఊపిరి’లో అతిథి పాత్రలో తళుక్కుమంది. అలాగే 2017లో సందీప్ కిషన్ – సాయితేజ్ కాంబినేషన్‌లో వచ్చిన మీడియం హీరోల మల్టీస్టారర్ ‘నక్షత్రం’లో ప్రత్యేక గీతంలో చిందులేసింది.
అదే విధంగా 2018 విషయానికొస్తే.. శ్రీవిష్ణు, నారా రోహిత్, సుధీర్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన థ్రిల్లింగ్ మల్టీస్టారర్ ‘వీర భోగ వసంత రాయలు’లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక 2019లో వచ్చిన యన్టీఆర్ బయోపిక్ తొలి భాగం ‘యన్టీఆర్ కథానాయకుడు’లో మెరుపులా మెరిసింది. ఇందులో బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటించగా.. కీలకపాత్రల్లో రానా, కళ్యాణ్ రామ్, సుమంత్ వంటి కథానాయకులు సందడి చేశారు. 2020 విషయానికొస్తే.. ఈ జనరేషన్ సిసలైన మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ కీలక పాత్రలో కనిపించనుంది శ్రియ. ఇందులో యన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా నటిస్తోంది శ్రియ. వాస్తవానికి ఈ సినిమా 2020లోనే విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వలన 2021కి వాయిదా పడింది.
మున్ముందు కూడా శ్రియ ఈ మల్టీస్టారర్ పరంపరను కొనసాగిస్తుందేమో చూడాలి మరి.
![]() |
![]() |