![]() |
![]() |

మైథలాజికల్, ఫోక్‌లోర్, హిస్టారికల్, సోషల్ మూవీస్‌తో తనదైన ముద్ర వేసిన హీరో నందమూరి బాలకృష్ణ. తన తరం, తర్వాతి తరం హీరోల్లో ఇది బాలకృష్ణ ఒక్కడికే సాధ్యం. ఈ ప్రత్యేక ప్రతిభ తండ్రి నటసార్వభౌమ ఎన్టీ రామారావు నుంచి ఆయనకు ఒక వరంగా లభించింది! సౌత్ ఇండియాలో అంతకుముందు ఎంతమంది నటీనటులు తమ వారసులను పరిచయం చేసినా వారెవరూ తర్వాతి రోజుల్లో స్టార్లుగా రాణించలేదు. ఆ క్రమంలో స్టార్ అనిపించుకున్న తొలి హీరో బాలకృష్ణ!
1960 జూన్ 10న ఎన్టీఆర్ ఇంట మద్రాస్ (నేటి చెన్నై)లో ఐదో కుమారునిగా జన్మించారు. అంటే నేటికి సరిగ్గా 60 సంవత్సరాల క్రితం అన్నమాట. తారకరాముడు తనయునికి బాలకృష్ణ అని నామకరణం చేసినా, ఆయనతో సహా అందరూ బాలయ్యా అని అప్పట్నుంచే పిలుస్తూ వచ్చారు. బహు సంతానవంతుడైన ఎన్టీఆర్ తన ఐదో పుత్రుడ్ని ప్రత్యేకంగా చూసేవాళ్లు. ఎన్టీఆర్ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేయడంతో ఇక్కడి లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో బాలకృష్ణ చదువుకున్నారు. టీనేజ్‌లో అడుగుపెట్టారో లేదో తండ్రి ఎన్టీఆర్ నటిస్తూ, స్వయంగా డైరెక్ట్ చేసిన 'తాతమ్మ కల' సినిమాలో ఆయన చిన్నకొడుకుగా నటించడం ద్వారా సినిమాల్లో అడుగుపెట్టారు. ఆయన నటనకు ముచ్చటపడిన తాతమ్మ పాత్రధారి భానుమతి "అబ్బాయి చక్కగా నటించాడు. మీ పేరు నిలబెడతాడు" అని ఎన్టీఆర్‌తో అన్నారు. ఆమె వాక్కు వృథా పోలేదని వేరే చెప్పాలా!!
ఆ తర్వాత అప్పటి సుప్రసిద్ధ దర్శకుడు బి.ఎ. సుబ్బారావు డైరెక్షన్‌లో అన్న హరికృష్ణతో కలిసి 'రామ్ రహీమ్' సినిమాలో నటించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ నట వారసులు ఇద్దరు కలిసి టైటిల్ రోల్స్‌లో నటించడం అప్పట్లో జనానికి పెద్ద ముచ్చట. అన్నకంటే మిన్నగా బాలయ్య నటించాడని అంతా చెప్పుకున్నారు. తన మూడో సినిమాలోనే తండ్రి ఎన్టీఆర్‌కు తెరపై తమ్మునిగా నటించే అవకాశం బాలయ్యకు దక్కింది. అది.. హిందీ హిట్ ఫిల్మ్ 'యాదోంకీ బారాత్'కు తెలుగు రీమేక్ అయిన 'అన్నదమ్ముల అనుబంధం' చిత్రం. ఈ సినిమా శత దినోత్సవానికి అప్పటి తమిళ సూపర్ స్టార్ ఎమ్జీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా తన తొలి వంద రోజుల షీల్డును అందుకున్నారు బాలకృష్ణ.
ఎన్టీఆర్ నట జీవితంలో ఓ కలికితురాయి 'దానవీరశూర కర్ణ'. ఇందులో ఆయన కృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు మూడింటినీ చేసి ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు. ప్రధానంగా దుర్యోధన పాత్రలో ఎన్టీఆర్ నటన 'న భూతో న భవిష్యతి'. బాక్సాఫీస్ పరంగానూ చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో కేవలం పది నిమిషాల సేపు కనిపించే అభిమన్యుని పాత్రలో బాలకృష్ణ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం విశేషం. పద్మవ్యూహాన్ని ఛేదించే సమయంలో బాలయ్య నటన చూసి మురిసిన జనం "సింహం కడుపున సింహమే పుడుతుంది కదా" అని చెప్పుకున్నారు. ఆ తర్వాత కాలంలో తండ్రి చేసిన సినిమాల్లో సలీమ్, నారదుడు, ఆంజనేయుడు వంటి అరుదైన పాత్రల్లో బాలయ్య మెప్పించారు.
ఇక బాలకృష్ణ సోలో హీరోగా మొదట ప్రారంభమైన చిత్రం 'డిస్కో కింగ్' కాగా, మొదటగా విడుదలైంది మాత్రం 'సాహసమే జీవితం'. 1984 జూన్ 1న ఈ సినిమా విడుదలైతే, అదే నెల 7న 'డిస్కో కింగ్' వచ్చింది. అంటే కేవలం ఆరు రోజుల వ్యవధిలో బాలయ్య సోలో హీరోగా నటించిన తొలి, మలి చిత్రాలు వచ్చాయి. ఓపెనింగ్స్ వండర్ఫుల్‌గా వచ్చినా, తర్వాత బాక్సాఫీస్ దగ్గర రెండూ పల్టీ కొట్టాయి. కె. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన బాలయ్య మూడో సినిమా 'జననీ జన్మభూమి' సైతం ఫ్లాపవడంతో బాలకృష్ణ పనైపోయిందని గిట్టనివారు ప్రచారం చేశారు. ఎన్టీఆర్‌కు తగ్గ వారసుడు కాడన్నారు.
కానీ వాళ్లకు దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది బాలయ్య నాలుగో సినిమా 'మంగమ్మగారి మనవడు'. కోడి రామకృష్ణ డైరెక్ చేసిన ఈ మూవీలో మహానటి భానుమతికి మనవడిగా అద్వితీయ నటన ప్రదర్శించిన బాలయ్యకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా నుంచీ బాలకృష్ణ క్రేజ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో బాలకృష్ణ నిలిచిపోయారు. "ట్రెండ్‌ను ఫాలో కాను, ట్రెండ్‌ను సృష్టిస్తాను" అన్నట్లుగానే బాలకృష్ణ కెరీర్ కొనసాగుతూ వచ్చింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్ ఆయన ఖాతాలో చేరాయి.
తండ్రి తరహాలోనే బాలకృష్ణ సైతం ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించారు. 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం', 'శ్రీరామరాజ్యం' లాంటివి అందుకు నిదర్శనం. నట వారసుల్లో బాలకృష్ణకు ఉన్న లాంగ్ కెరీర్ మన దేశంలోనే మరెవ్వరికీ లేదనేది నిజం. నలభై ఆరేళ్ల నుంచీ గ్యాప్ లేకుండా ఆయన నటిస్తూనే ఉన్నారు. నట వారసుల్లో బాలయ్య ఇచ్చిన బ్లాక్‌బస్టర్లను, ఆయన పోషించిన డిఫరెంట్ క్యారెక్టర్లను ఇప్పట్లో మరో నట వారసుడు పోషించడం అసాధ్యమనేది కాదనలేని వాస్తవం. వందో చిత్రంగా వచ్చిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఆయనకు తీపి జ్ఞాపకాన్నివ్వగా, ఆ తర్వాత చేసిన రెండు భాగాల తండ్రి బయోపిక్ 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'మహానాయకుడు' ఆయనకు చేదు మాత్రగా మిగిలింది. తనకు 'సింహా', 'లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అభిమానులే తన ఆస్తి అని చెప్పే బాలయ్య భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మైలురాళ్లను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |