![]() |
![]() |

యువ కథానాయకుడు శర్వానంద్ కి అచ్చొచ్చిన నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. `రన్ రాజా రన్` (2014), `ఎక్స్ ప్రెస్ రాజా` (2016), `మహానుభావుడు` (2017).. ఇలా శర్వానంద్ - యూవీ క్రియేషన్స్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయం సాధించాయి. కట్ చేస్తే.. త్వరలో ఈ హ్యాట్రిక్ కాంబోలో నాలుగో సినిమా రాబోతుందని టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. దాదాపు 14 ఏళ్ళ క్రితం విడుదలైన తమిళ చిత్రం `ఏగన్` (అజిత్, నయనతార, నవదీప్, పియా బాజ్ పాయ్, సుమన్, జయరామ్ ముఖ్య తారాగణం) కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన నృత్యదర్శకుడు రాజు సుందరం.. త్వరలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తీయబోతున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుందని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, శర్వానంద్ తాజా చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు` మార్చి 4న రిలీజ్ కాబోతోంది. రష్మిక మందన్న నాయికగా నటించిన ఈ సినిమాని కిశోర్ తిరుమల డైరెక్ట్ చేశాడు. మరోవైపు యూవీ క్రియేషన్స్ నిర్మించిన కొత్త చిత్రం `రాధే శ్యామ్` మార్చి 11న తెరపైకి రానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన ఈ పాన్ - ఇండియా మూవీకి `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.
![]() |
![]() |