![]() |
![]() |

తెలుగునాట కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాంబినేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ ఫలితాలతో సంబంధం లేకుండా మ్యూజికల్ గా మెప్పించడం విశేషం. అలాంటి చిత్రాల్లో `రుద్రనేత్ర` ఒకటి. స్పై డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన ఏజెంట్ నేత్రగా తనదైన అభినయంతో అలరించారు చిరు. అతనికి జోడీగా విజయశాంతి, రాధ నటించిన ఈ సినిమాలో రేఖ, రావుగోపాలరావు, రఘువరన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``ఏక్ దో తీన్``, ``అందమివ్వు ఆదివారము``, ``ఎల్ అంటే ఓ అంటే``, ``ఖజురహోలో``, ``జెట్ స్పీడ్``, ``అబ్బబ్బబ్బ``.. ఇలా ఇందులోని గీతాలన్ని అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. యండమూరి వీరేంద్రనాథ్ రచన చేసిన ఈ చిత్రాన్ని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై బి.హెచ్. వరహనరసింహరాజు నిర్మించారు. 1989 జూన్ 16న విడుదలై మ్యూజికల్ గా ఎంటర్టైన్ చేసిన `రుద్రనేత్ర`.. నేటితో 32 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |