![]() |
![]() |
.webp)
పవన్ కల్యాణ్ సినిమా 'భీమ్లా నాయక్' రేపు బిగ్ రేంజ్‌లో రిలీజవుతున్న సందర్భంలో రామ్‌చరణ్ షేర్ చేసిన ఒక వీడియో మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారింది. ఆ వీడియోలో 'భీమ్లా నాయక్' సెట్స్‌కి గాడ్‌ఫాదర్ వేషంలో ఉన్న చిరంజీవి వెళ్లడం, ఆ తర్వాత 'గాడ్‌ఫాదర్' సెట్స్‌కు త్రివిక్రమ్‌తో కలిసి పవన్ కల్యాణ్ వెళ్లడం మనం చూడొచ్చు. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దరూ సరదాగా కొంతసేపు గడిపారని తెలుస్తోంది. ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్‌ను చూడటం ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ అన్నమాటేగా!
ఈ వీడియోను తన సోషల్ మీడియ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన రామ్‌చరణ్, "#GODFATHER and #BHEEMLANAYAK visit each other’s film sets!." అంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు. ఒక సినిమా ట్రైలర్‌కు తగ్గని రీతిలో ఆ వీడియోను కట్ చేసిన ఎడిటర్‌ను అభినందించి తీరాల్సిందే. ఆ వీడియో ప్రకారం మొదట 'భీమ్లా నాయక్' సెట్స్‌కు జైలు ఖైదీ వేషంలో ఉన్నా గాడ్‌ఫాదర్ చిరంజీవి వెళ్లారు. పవన్‌తో పాటు త్రివిక్రమ్, డైరెక్టర్ సాగర్‌చంద్ర, నిర్మాత రాధాకృష్ణలతో కొద్దిసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన సరదా సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. గమనించాల్సిన విషయం ఏమంటే, చిరంజీవి ఖైదీ వేషంలో ఉంటే, పవన్ కల్యాణ్ పోలీస్ సబ్ఇన్‌స్పెక్టర్ వేషంలో ఉండటం!
ఆ తర్వాత 'గాడ్‌ఫాదర్' సెట్స్‌ను త్రివిక్రమ్‌తో కలిసి విజిట్ చేశారు పవన్ కల్యాణ్. వైట్ అండ్ వైట్ లాల్చీ, కుర్తా ధరించి వచ్చారు పవన్. అప్పటికే అక్కడ ఆర్. నారాయణమూర్తి, 'బాహుబలి' రైటర్ వి. విజయేంద్రప్రసాద్ ఉన్నారు. పవన్ రావడంతో ఆ ఇద్దరూ లేచి నిల్చొని ఆయనకు నమస్కారం చేయగా, పవన్ ప్రతినమస్కారం చేశారు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. చిరంజీవి ఏదో చెప్తూ నవ్వి తమ్ముడి వీపుపై చేత్తో తట్టగా, పవన్ కూడా చిరునవ్వులు చిందించారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో శరవేగంతో వైరల్‌గా మారింది.

ఫిబ్రవరి 25న విడుదలవుతున్న 'భీమ్లా నాయక్'కు శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియోను రిలీజ్ చేశాడు రామ్‌చరణ్. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా, వేలాదిమంది మెగా ఫ్యాన్స్ సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే.
మలయాళం హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ అయిన 'భీమ్లా నాయక్'ను సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేయగా, త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. పవన్ సరసన నిత్యా మీనన్, రానా జోడీగా సంయుక్తా మీనన్ నటించారు. తమన్ స్వరాలు కూర్చిన పాటలు ఇప్పటికే జనం నోళ్లలో నానుతున్నాయి. 'గాడ్‌ఫాదర్' సైతం మరో మలయాళ హిట్‌కు రీమేక్. ఆ సినిమా.. మోహన్‌లాల్ టైటిల్ రోల్ చేసిన 'లూసిఫర్'. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో నయనతార కీలక పాత్రలో కనిపించనుంది.

![]() |
![]() |