![]() |
![]() |

`సై` (2004) తరువాత వరుసగా డజను అపజయాలను మూటగట్టుకున్న యూత్ స్టార్ నితిన్ ని.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన చిత్రం `ఇష్క్` (2012). విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ కి జంటగా నిత్యా మీనన్ నటించింది. అనూహ్య పరిస్థితుల్లో ప్రేమికులయ్యే రాహుల్ (నితిన్), ప్రియ (నిత్య).. తమకు ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి చివరికి ఎలా ఒక్కటయ్యారు? అనేదే ఈ చిత్ర కథాంశం. అజయ్, సింధు తులాని, నాగినీడు, రోహిణి, సుధ, అలీ, శ్రీనివాస రెడ్డి, రవి ప్రకాశ్, సత్య కృష్ణన్, మధునందన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దిగ్గజ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: సెట్స్‌పై 'గాడ్‌ఫాదర్', 'భీమ్లా నాయక్' కలిశారు.. చెర్రీ వీడియో షేర్ చేశాడు!
అరవింద్ - శంకర్, అనూప్ రూబెన్స్ బాణీలు అందించిన ఈ సినిమాకి అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, నితిన్ సాహిత్యమందించారు. ``సూటిగా చూడకు``, ``ఏదో ఏదో``, ``ప్రియా ప్రియా``, ``చిన్నదాన నీ కోసం``, ``లచ్చమ్మ``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. `బెస్ట్ హోమ్ - వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్` (అజయ్) విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకున్న `ఇష్క్`.. బంగ్లాదేశీ బెంగాలీలో `లవ్ స్టేషన్` (2014), ఒడియాలో `ఆఖిరే ఆఖిరే` (2014), బెంగాలీలో `ఆషిఖి` (2015), తమిళంలో `ఉయిరే ఉయిరే` పేర్లతో రీమేక్ అయింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్ నిర్మించిన `ఇష్క్`.. 2012 ఫిబ్రవరి 24న జనం ముందు నిలిచింది. నేటితో ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 10 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |