![]() |
![]() |

తెలుగునాట సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన చిత్రాల్లో `శివ` ఒకటి. తెలుగు సినిమా దశని, దిశని మార్చివేసిన ఈ సినిమాతో `ఎవర్ గ్రీన్ సెన్సేషన్` రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. మూస ధోరణికి భిన్నంగా ఈ యాక్షన్ డ్రామాని తెరకెక్కించి.. ప్రేక్షకులను, పరిశ్రమ వర్గాలను విస్మయపరిచారాయన. పోస్టర్స్, ప్రచార చిత్రాలు, మాటలు, పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నటీనటుల అభినయం.. ఇలా ప్రతీ అంశంలోనూ వైవిధ్యానికి పెద్దపీట వేసి భావితరానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు ఆర్జీవీ. అంతేకాదు.. అప్పటివరకు సగటు చిత్రాలకు పరిమితమైన కింగ్ నాగార్జునని, తనలోని హీరోయిజాన్ని మరో స్థాయిలో ఆవిష్కరించిన ఘనత కూడా వర్మకు దక్కుతుంది. `శివ`కు ముందు, తరువాత అన్నట్లుగా నాగ్ కెరీర్ పై ప్రభావం చూపిన ఈ ట్రెండ్ సెట్టర్.. నాగ్ నటజీవితంలో ఓ మైలురాయిగా నిలిచింది. నాగ్ కి జోడీగా అమల నటించిన ఈ సినిమాలో రఘువరన్, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్, గొల్లపూడి, సాయిచంద్, చిన్నా, శుభలేఖ సుధాకర్, జేడీ చక్రవర్తి, నిర్మలమ్మ, ఉత్తేజ్, బ్రహ్మాజీ, రామ్ జగన్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు, నేపథ్య సంగీతం `శివ`కి ప్రధాన బలంగా నిలిచింది. పాటల్లో ``బోటనీ పాఠముంది`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``సరసాలు చాలు``, ``ఆనందో బ్రహ్మ``, ``ఎన్నియల్లో``, ``కిస్ మి హలో రాంగ్ నంబర్`` కూడా రంజింపజేశాయి. `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ నూతన దర్శకుడు`, `ఉత్తమ సంభాషణల రచయిత` (తనికెళ్ళ భరణి) విభాగాల్లో `నంది` పురస్కారాలను, `ఉత్తమ చిత్రం`గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని అందుకుందీ చిత్రం. హిందీలో `షివ` పేరుతో నాగ్ హీరోగా రీమేక్ చేసి అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. 1989 అక్టోబర్ 5న విడుదలైన `శివ`.. నేటితో 32 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |