![]() |
![]() |

గేయ రచయిత డాడీ శ్రీనివాస్ తన కుమారుడు సాజన్ మృతిని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సుమారు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో 24 సంవత్సరాల వయసులో సాజన్ కన్నుమూశాడు. చిరంజీవి సినిమా డాడీ మూవీకి రాసిన పాటలతో వెలుగులోకి వచ్చిన జి. శ్రీనివాస్.. అప్పట్నుంచీ డాడీ శ్రీనివాస్‌గా పేరు తెచ్చుకున్నారు. పలు చిత్రాలకు సూపర్ హిట్ పాటలను రచించిన ఆయన దర్శకుడిగానూ మారి బాలల చిత్రాలు, అర్థవంతమైన చిత్రాలు తీస్తున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తనయుడిని తలచుకుంటూ తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
"24 సంవత్సరాలకే మంచిజ్ఞానాన్ని ఇచ్చావు... సాటిమనిషికి సాయపడే మంచి హృదయాన్నిఇచ్చావు... తల్లీ, తండ్రీ , గురువులను పూజించే మంచి సంస్కారం ఇచ్చావు... మరి ఇన్ని మంచి లక్షణాలను పుణికి పుచ్చుకున్న నా బంగారు తండ్రి సాజన్ ను ఎందుకు దేవుడా ఇంత త్వరగా తీసుకెళ్ళావు ?
నీకు ఇది తప్పు అనిపించలేదా సామీ?...
ప్రతిఏటా "డాడీ" ఈరోజు నీపుట్టినరోజు అంటూ పిలిచే ఆమధుర స్వరం ఈరోజు ఎందుకో మూగపోయింది.. నేనుచేసే ప్రతిపనిలో చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటర్నేషనల్ అవార్డ్, నంది అవార్డ్స్ తో పాటు 5 అవార్డ్స్ సాధించడానికి కారణమైన నా కుడిభుజం ఈరోజు కూలిపోయింది... ప్రతిరోజూ చిరునవ్వులు చిందిస్తూ మాఇంట వెలుగులు పంచే చిన్నిదీపం ఈరోజు ఎందుకో ఆరిపోయింది....
నీవు మాకు దూరమై సుమారు రెండు సంవత్సరాలు కావొస్తుంది నీవు లేని నాపుట్టినరోజు వేడుక ఎలా జరుపుకుంటాను చిట్టి తండ్రీ.... నా బంగారు తండ్రి సాజన్ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తూ అశ్రునయనాలతో మీ అమ్మా నాన్న.." అంటూ ఆయన రాసుకొచ్చారు. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంలో డాడీ శ్రీనివాస్ రాసిన 'కరోనా గూండా' సాంగ్ పాపులర్ అయింది.
![]() |
![]() |