![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కృతజ్ఞత సభ పేరుతో ఈవెంట్ ని నిర్వహించారు. అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వేడుకకు మూవీ టీమ్ అంతా హాజరైంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. వంద రోజుల ఫంక్షన్స్ ని మర్చిపోయిన ఈ రోజుల్లో అఖండ వంద రోజుల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
ఓ నమో శివాయ అంటూ తన స్పీచ్ ని ప్రారంభించిన బాలయ్య తన తల్లిదండ్రులను స్మరించుకున్నారు. మళ్ళీ హైందవ సనాతన ధర్మాన్ని గుర్తుచేసిన చిత్రంగా 'అఖండ' నిలిచిందని అన్నారు. ధర్మం జోలికి, పసిపాపల జోలికి వెళ్లరాదనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించామని చెప్పారు. డైరెక్టర్ బోయపాటిపై బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. మా సినిమాలే మాకు పోటీ. సింహాకి పోటీ లెజెండ్, లెజెండ్ అఖండ అని అన్నారు. మా కాంబినేషన్ ఓ కుటీర పరిశ్రమ అని, ముందు మరిన్ని మంచి సినిమాలు వస్తాయని బాలయ్య తెలిపారు.
తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడని, తన సంగీతంతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళాడని బాలకృష్ణ కొనియాడారు. అమెరికాలో ఒక థియేటర్లో అయితే స్పీకర్స్ బద్దలయ్యాయని, ఆ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడని అన్నారు. సినిమాలో నటించిన నటీనటులను పేరుపేరునా ప్రశంసించారు. హీరోగా చాక్లెట్ బాయ్ లా కనిపించిన శ్రీకాంత్.. ఇప్పుడు నెగటివ్ పాత్రలో జీవించారని అన్నారు. జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ, నితిన్ మెహతా ఇలా అందరూ అద్భుతంగా నటించారని పొగిడారు. చమ్మక్ చంద్ర, బేబీ దేష్ణ పేర్లను బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ప్రొడక్షన్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి బాలకృష్ణ కృతఙ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |