![]() |
![]() |

వెబ్ సిరీస్: మిస్ పర్ ఫెక్ట్
నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్, అభిజ్ఞ, ఝాన్సీ,
హర్ష వర్ధన్ , సునైనా, మహేశ్ విట్టా తదితరులు
కథ, స్క్రీన్ ప్లే : ఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
నిర్మాతలు : సుప్రియ యార్లగడ్డ
దర్శకత్వం: విశ్వక్ కండేరావ్
ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
వివాహం తర్వాత లావణ్య చేసిన తొలి వెబ్ సిరీస్ ' మిస్ పర్ ఫెక్ట్ '. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ తో కలిసి చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం...
కథ:
ఢిల్లీలో ఉంటున్న లావణ్య.. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. అయితే తనకి హైదరాబాద్ లో పోస్టింగ్ రావడంతో వాళ్ళ నాన్న(హర్ష వర్ధన్) కి కాల్ చేసి చెప్తుంది. అది విని అతను షాక్ అవుతాడు. లావణ్య మొదటి నుండి ఇంట్లో ప్రతీది క్లీనింగ్ ఉండాలని చూస్తుంటుంది. ప్రతీది పర్ ఫెక్ట్ గా ఉండాలనుకునే మనస్తత్వం గల లావణ్య ఇంట్లో పనిమనిషిగా జ్యోతి ( అభిజ్ఞ) వస్తుంది. జ్యోతి సింగర్ అవ్వాలనే డ్రీమ్ తో గజ్వేల్ నుండి హైదరాబాద్ కి వస్తుంది. అయితే సింగర్ అయ్యేంతవరకు ఇలా అపార్ట్మెంట్ లలో క్లీనింగ్ అండ్ వంట పనులు చేస్తుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ లావణ్య, జ్యోతిల మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. అయితే అనుకోకుండా కరోనా లాక్ డౌన్ రావడంతో జ్యోతి వాళ్ళ ఏరియాలో కంటోన్మెంట్ జోన్ విధిస్తారు. దాంతో తను పనికిరాదు. ఇక లావణ్యకి జ్యోతి కాల్ చేసి.. డీ బ్లాక్ లో ఉండే రోహిత్ (అభిజిత్) ఉంటాడు. ఒకసారి వెళ్ళి వర్క్ చేయండి అని చెప్పగా.. లావణ్య వెళ్ళి చెప్పేలోపే తనని పనిమనిషి అనుకొని పనిచేసి డోర్ గట్టిగా వేసి వెళ్ళమని చెప్పేసి వెళ్ళి తన రూమ్ లో పడుకుంటాడు రోహిత్. అయితే లావణ్య ఇక వెళ్ళిపోదామనుకునే టైమ్ లో.. రోహిత్ రూమ్ అంతా గందరగోళంగా ఉండటం చూసి ఉండలేక మొత్తం నీట్ గా క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత
కొన్నిరోజులకి ఇద్దరికి పరిచయం ఏర్పడుతుంది. అయితే రోహిత్ వాళ్ళ అమ్మ.. తార అనే అమ్మాయిని రోహిత్ కి పెళ్ళి చేయాలని చూస్తుంది. మరి రోహిత్, లావణ్యల పరిచయం ఎలా మారింది? వాళ్ళ అమ్మ చెప్పిన అమ్మాయినే రోహిత్ పెళ్ళి చేసుకున్నాడా తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోని ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే...
విశ్లేషణ:
కరోనా లాక్ డౌన్ టైమ్ లో తీసిందే ఈ స్టోరీ.. అన్నీ పర్ ఫెక్ట్ గా ఉండాలనుకునే అమ్మాయికి, ఏదీ పర్ ఫెక్ట్ గా లేకపోయిన నాకేం పర్లేదనే అబ్బాయికి మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల వారిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నదే కథ. సింపుల్ కథని అంతే సింపుల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ విశ్వక్ కండేరావు.
లెంతీ డైలాగ్స్ లేవు.. భారీ ఫైట్స్ లేవు.. రొమాంటిక్ సాంగ్స్ లేవు.. అడల్ట్ సీన్స్ లేవు.. బూతులు లేవు.. ఈ మధ్యకాలంలో బూతులు లేకుండా వచ్చిన తొలి వెబ్ సిరీస్ ఇదే .. ఫ్యామిలీతో కలిసి చూసే ఈ సిరీస్ లో అందరికి నచ్చే సింపుల్ లైఫ్ రూల్స్ తో అలా సాగుతూ ఉంటుంది.
మొదటి ఎపిసోడ్ .. లావణ్య ప్రాబ్లమ్.. ఇందులో లావణ్య ప్రతీదీ శుభ్రంగా ఉండాలనుకుంటూ ఎక్కువగా క్లీనింగ్ మీద ఆధారపడటం చూసి తన ఫ్రెండ్ ఓ సైకాలజిస్ట్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత తను ఢిల్లీ నుండి హైదరాబాద్ కి రావడం.. జ్యోతి, రోహిత్ ల పరిచయంతో పాటు వాళ్ళు చేసే పనులు అన్నీ పరిచయం అయిపోతాయి. సెకెండ్ ఎపిసోడ్.. ఏ వైట్ లై. ఇందులో కొందరు మనుషులు నిజాలు చెప్పి ఇరుక్కుపోతుంటారు. కానీ అబద్ధం చెప్పి తప్పించుకుంటే సరిపోతుంది కదా అని లావణ్య చెప్తుంటుంది. మూడవది.. అన్ యూజ్ వల్ క్రష్..ఇది పర్వాలేదనిపిస్తుంది. నాల్గవది.. ది త్రీ స్పీస్.. ముగ్గురు కలిసి రోహిత్ ఇంట్లో పనిచేసే లక్ష్మి ఎవరో తెలుసుకోవాలనే పనిలో ఉంటారు. ఇదంతా వినోదాత్మకంగా సాగుతుంది. అయిదు.. ఏ సీక్రెట్ రొమాన్స్. ఇందులో ఇద్దరి మధ్య తెలియని బాండింగ్ ఎలా ఏర్పడిందని చూపిస్తారు మేకర్స్.
ఈ సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్ లు ఉండగా.. ఒక్కో ఎపిసోడ్ ఇరవై నుండి ఇరవై ఆరు నిమిషాల నిడివి ఉంటుంది. ఏ ఎపిసోడ్ లోను అడల్ట్ సీన్స్ లేవు.. అశ్లీల పదాలు లేవు. ఎమోషనల్ సాగే కొన్ని సీన్స్ ప్రేక్షకులని హత్తుకుంటాయి. ముఖ్యంగా ఏడు, ఎనిమిది ఎపిసోడ్ లలో వచ్చే డైలాగ్స్ ఆలోచింపజేసేవిలా ఉంటాయి. మనకి నచ్చినవాళ్ళ దగ్గరైనా.. వాళ్ళకి నచ్చినట్టు ఉండటం తప్పేనా అనే డైలాగ్స్ వెబ్ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచాయి. సింపుల్ మ్యూజిక్ ప్రతీ ఎపిసోడ్ ని ఎలవేట్ చేసేదిలా ఉంది. ప్రతీ పాట ఆ సిచువేషన్ కి తగ్గట్టుగా ఉన్నాయి. రవితేజ గిరిజాల ఎడిటింగ్ నీట్ గా ఉంది. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ ఆకట్టుకుంది. ఆదిత్య జవ్వాది తన సినిమాటోగ్రఫీతో సిరీస్ ని మరింత అందంగా మలిచాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
లక్ష్మీ మరియు లావణ్య పాత్రల్లో లావణ్య త్రిపాఠి చక్కగా నటించింది. జ్యోతి పాత్రలో పనిమనిషిగా అభిజ్ఞ బాగా చేసింది. రోహిత్ పాత్రలో అభిజిత్ ఆకట్టున్నాడు. ఝాన్సీ, హర్ష వర్దన్ ఉన్నంతలో బాగా చేశారు. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా :
మిస్టర్ అండ్ మిస్సెస్ కలిసి చూసే క్లీన్ వెబ్ సిరీస్ ' మిస్ పర్ ఫెక్ట్ '.
రేటింగ్ : 3
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |