![]() |
![]() |

గతేడాది అక్టోబర్ లో జరిగిన 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)' ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ నడుమ జరిగిన ఈ పోరులో విష్ణు గెలిచి మా ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే మా ఎన్నికల సమయంలో పలువురు సినీ ప్రముఖులు వ్యక్తిగత విమర్శలకు దిగారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు.. విష్ణుని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, విష్ణుకి మద్దతు తెలిపిన కోట శ్రీనివాసరావుని అయితే ఆయనకి వయసు అయిపోయింది, ఎప్పుడు పోతాడో తెలీదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఇంతకాలం ఈ వివాదాలపై స్పందించకుండా సైలెంట్ గా ఉన్న మంచు మనోజ్.. తాజాగా నాగబాబుని టార్గెట్ చేస్తూ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
శ్రీ విద్యానికేతన్ 30 వ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. " ఉన్నత విలువలు ఉన్నవాళ్లే జీవితంలో ముందుకెళ్తారు. లేనివాళ్లు వారి జీవితాన్ని నాశనం చేసుకోవమే కాకుండా.. పక్కవాళ్ళని ఇబ్బందులకు గురిచేస్తారు. ఉదాహరణకు మా ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి మా విష్ణు అన్నయ్యని టార్గెట్ చేసి, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూశాడు. మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని కూడా వయసుతో సంబంధం లేకుండా ఎన్నో మాటలు అన్నాడు. ఆయన అలా ఎందుకు మాట్లాడుతున్నాడా అని ఆలోచించాను. అప్పుడు మా నాన్న ఒక్కటే చెప్పారు. 'ఆ వ్యక్తికి జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. అతని మాటలు పట్టించుకోను' అని నాన్న చెప్పిన మాటలు విన్నాక అదే నిజం అనిపించింది. ఎందుకంటే ఆ వ్యక్తి చుట్టూ ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు. జనాలకు ఏదైనా మంచి చేయాలనుకునేవారున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అలాంటిది ఏం లేకుండా జీవిస్తున్నాడు" అంటూ మనోజ్ పరోక్షంగా చురకలు అంటించాడు.
ప్రస్తుతం మనోజ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనోజ్ కి మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా కొందరు కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |