![]() |
![]() |
.webp)
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకుడు. సోనీ పిక్చర్స్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు, హిందీ,మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీ మేకర్స్ తాజాగా సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

సినిమా విడుదలకి ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం అనేది సాధారణంగా చూస్తుంటాం. అయితే మేజర్ సినిమా మేకర్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏకంగా విడుదలకు పది రోజుల ముందు సినిమాని ప్రదర్శించాలని నిర్ణయించారు. ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా మొత్తం ఎనిమిది ప్రధాన నగరాల్లో.. ఎంపిక చేసిన థియేటర్స్ లో మే 24 నుంచి ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులో ఉంటాయని కూడా తెలిపారు. హైదరాబాద్ లో మేజర్ నిర్మాతల్లో ఒకరైన మహేష్ కి చెందిన AMB సినిమాస్ లో మే 24 నుంచి ప్రదర్శించనున్నారు.

ఇండియన్ సినిమా చరిత్రలోనే విడుదలకు పదిరోజుల ముందు ప్రదర్శించబడుతున్న సినిమా మేజర్ అని చెప్పొచ్చు. ఒకట్రెండు రోజుల ముందు కాకుండా ఏకంగా ఇలా పదిరోజుల ముందు స్క్రీనింగ్ కి సిద్ధమవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమా అవుట్ పుట్ పట్ల మేకర్స్ కి ఉన్న నమ్మకమే వారు ఈ డేరింగ్ డెసిషన్ తీసుకోవడానికి కారణమై ఉండొచ్చు. మరి ఈ సంచలన నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
![]() |
![]() |