![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్'తో మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళితో సినిమా అంటే వేరే సినిమా చేయకుండా కనీసం మూడు నాలుగేళ్ళ పాటు దానికే టైం కేటాయించాల్సి ఉంటుంది. స్టార్స్ హీరోలకి ఇన్నేళ్ళ గ్యాప్ రావడం అనేది ఫ్యాన్స్ ని నిరాశపరిచే అంశం. తాజాగా దీనిపై స్పందించిన మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహేష్ హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన మహేష్.. రాజమౌళితో చేయబోయే సినిమా గురించి మాట్లాడారు. రాజమౌళితో సినిమా కారణంగా లాంగ్ గ్యాప్ వస్తే ఫ్యాన్స్ ఫీలవుతారన్న దానిపై స్పందించిన మహేష్.. రాజమౌళితో సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్లేనని అన్నారు. 'సర్కారు వారి పాట'ను పాన్ ఇండియా మూవీగా చేయాలన్న ఆలోచన లేదని, ముందు నుంచి తెలుగు సినిమాగా చేయాలనుకున్నాం, అలాగే చేశామని తెలిపారు. రాజమౌళితో చేయబోయే సినిమా పాన్ ఇండియా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని మహేష్ అన్నారు.
'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సినిమా గురించి కూడా మహేష్ స్పందించారు. సినిమా చాలా కొత్తగా ఉంటుందని, త్రివిక్రమ్ గారితో సినిమా అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉందని తెలిపారు. ఆయన టెర్రిఫిక్ డైలాగ్ రైటర్ అని, ఆయన రాసిన డైలాగ్స్ కి పెర్ఫార్మ్ చేయడం అనేది మాటల్లో చెప్పలేని అనుభూతి అని అన్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ నేరేట్ చేసేటప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యానని మహేష్ చెప్పుకొచ్చారు.
![]() |
![]() |