![]() |
![]() |

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా నడుస్తోంది. 'బాహుబలి'తో ప్రభాస్, 'పుష్ప'తో అల్లు అర్జున్, 'ఆర్ఆర్ఆర్' జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో తెలుగు హీరోలకు బాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్స్ వస్తున్నాయని వార్తలొస్తున్నాయి. అయితే మహేష్ బాబు అసలు మనకి హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ సినిమాలను మించి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' హిందీలో రూ.200 కోట్ల నెట్ , ఓవరాల్ గా 1000 కోట్ల గ్రాస్ రాబట్టి దూసుకుపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మహేష్ హిందీ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా క్వికాన్ పేమెంట్స్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కి మీడియా నుంచి బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం పలువురు హీరోలు హిందీ సినిమాలు చేస్తున్నారు. మరి మీరెప్పుడు డైరెక్ట్ హిందీ సినిమా చేస్తారు? అని అడగ్గా.. "బాలీవుడ్ జనాలను మెప్పించాలంటే హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో సినిమాలు తీసినా చాలు. ఇప్పుడు తెలుగు సినిమాలను ప్రపంచమంతా చూస్తున్నారు. అలాంటప్పుడు నువ్వైనా సరే తెలుగు సినిమాలు చేస్తే చాలనుకుంటావు" అంటూ మహేష్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తాను హిందీ నటుడినని, డబ్బుల కోసం తెలుగుతో సహా ఏ ఇతర ప్రాంతీయ భాషల్లోనూ సినిమాలు చేయనని కామెంట్స్ చేశాడు. తాజాగా మహేష్ చేసిన వ్యాఖ్యలు వాటికి కౌంటర్ లా ఉన్నాయి.
![]() |
![]() |