![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'గని'. అల్లు అరవింద్ సమర్పణలో రినైసెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎన్నో ఏళ్ల అనుభవమున్న కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 8 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కిరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన 'మిస్టర్' సినిమాకి కోడైరెక్టర్ గా వర్క్ చేశానని, అప్పటి నుంచి వరుణ్ తో మంచి అనుబంధం ఏర్పడిందని, మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉంటుందని కిరణ్ చెప్పారు. ఆ సమయంలోనే కిరణ్ తో సినిమా చేస్తానని వరుణ్ అన్నారని, ఇచ్చిన మాట ప్రకారం డైరెక్టర్ గా అవకాశమిచ్చారని తెలిపారు. వరుణ్ నటించిన 'తొలిప్రేమ' టైంలో ఈ స్టోరీ ఓకే అయిందని, కానీ కరోనా కారణంగా సినిమా ఆలస్యమవుతూ వచ్చిందని అన్నారు. సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడ్డారని, కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడినా, షూటింగ్ టైంలో హ్యాండ్ ఫ్యాక్చర్ అయినా రెండు మూడేళ్ల పాటు సిక్స్ ప్యాక్ బాడీని మైంటైన్ చేశారని చెప్పుకొచ్చారు.
తాను వినాయక్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల ఇలా ఎందరో డైరెక్టర్స్ దగ్గర పనిచేశానని.. వారి దగ్గర నుంచి హీరోని ప్రెజెంట్ చేసే విధానం నేర్చుకున్నానని అన్నారు. 'గని' స్పోర్ట్స్ మూవీ అయినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. సినిమా రిజల్ట్ పై నమ్మకంగా ఉన్నామని.. అల్లు అరవింద్, అల్లు అర్జున్ సినిమా చూసి మెచ్చుకున్నారని తెలిపారు. కరోనా కారణంగా సినిమా పదేపదే వాయిదా పడుతుండటంతో ఓటీటీలో రిలీజ్ చేద్దామా అని తాను అడగగా.. ప్రొడ్యూసర్స్ వద్దు అన్నారని, ఇది థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అంటూ వారు ప్రొడక్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు.
తాను డైరెక్టర్ గా ఏదో ఒక జోనర్ కి పరిమితం కావాలి అనుకోవట్లేదని, డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు తీసి మెప్పించాలి అనుకుంటున్నానని కిరణ్ తెలిపారు. తన తదుపరి సినిమాకి సంబంధించి త్వరలో వివరాలు వెల్లడిస్తానని, ఇప్పటికే నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు మరో ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చారని చెప్పారు. అలాగే గని షూటింగ్ సమయంలో వరుణ్ కూడా నిర్మాతగా అడ్వాన్స్ ఇచ్చారని కిరణ్ అన్నారు. మరి వరుణ్ తనే హీరోగా నటిస్తూ నిర్మిస్తాడో లేక కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తాడో చూడాలి.
![]() |