Home  »  News  »  బ్యూటీ మూవీ రివ్యూ 

Updated : Sep 18, 2025

సినిమా పేరు: బ్యూటీ  
తారాగణం:  అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, సీనియర్ నరేష్, నితిన్ ప్రసన్న, వాసుకి, ప్రసాద్ బెహ్రా, నాగేంద్ర మేడిద తదితరులు 
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్ 
రచన, దర్శకత్వం: జె ఎస్ ఎస్ వర్ధన్ 
సినిమాటోగ్రాఫర్: శ్రీ సాయికుమార్ దార
బ్యానర్:  మారుతీ టీం వర్క్స్, వానర స్టూడియోస్ 
నిర్మాత: అడిదాల విజయపాల్ రెడ్డి 
విడుదల తేదీ: సెప్టెంబర్ 19 ,2025 

రాజా సాబ్(The Raja saab)మారుతీ' టీం సమర్పణలో 'ఆయ్' మూవీ ఫేమ్ అంకిత్ కొయ్య(Ankith Koyya),నూతన కథానాయిక 'నీలఖి పాత్ర'(Nilakhi Patra) జంటగా తెరకెక్కిన మూవీ 'బ్యూటీ'(Beauty). ప్రచార చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకోగా, రేపు థియేటర్స్ లో సందడి చేయనుంది. సినిమాపై నమ్మకంతో మేకర్స్ ఒక రోజు ముందుగానే చాలా ఏరియాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ 
అలేఖ్య (నీలఖి పాత్ర) మధ్యతరగతికి చెందిన అందమైన అమ్మాయి. తాను ఏంజెల్' ని అని తన నమ్మకం. అమాయకత్వం,కోపం, సంతోషాన్ని ఒకేసారి ప్రదర్శించే అలేఖ్య, 'వైజాగ్' లో  ఇంటర్ మీడియట్ చదువుతుంటుంది. అలేఖ్య తండ్రి నారాయణ(నరేష్) క్యాబ్ డ్రైవర్. కూతురు అంటే పంచ ప్రాణాలు. ఎన్ని కష్టాలు పడైనా తన తాహతకి మించి అలేఖ్య అడిగింది ఇస్తుంటాడు. అర్జున్ ( అంకిత్ కొయ్య) పెట్ లవర్ తో పాటు వాటికి ట్రైనర్. ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉంటారు. అలేఖ్య, అంకిత్ కి పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమగా మారుతుంది. ఇంకో వైపు అమ్మాయిల్ని మంచి మాటలతో, మాయలో పడేలా చేసి, శారీరకంగా అనుభవించే ఒక బ్యాచ్ తిరుగుతుంటుంది. తమ కోరిక తీరాక డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడంలో సదరు బ్యాచ్ స్పెషల్. అలేఖ్య, అంకిత్ చేసిన తప్పు వల్ల ఆ ఇద్దరు వైజాగ్ వదిలి 'హైదరాబాద్' వస్తారు. ఆ ఇద్దరి కోసం నారాయణ హైదరాబాద్ వస్తాడు. అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేసే ముఠా కూడా హైదరాబాద్ వస్తుంది. అలేఖ్య, అంకిత్ లకి పరిచయం ఎలా జరిగింది? ఆ ఇద్దరు  చేసిన తప్పేంటి?  హైదరాబాద్ ఎందుకు వచ్చారు? బ్లాక్ మెయిల్ ముఠా హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అలేఖ్య ని నారాయణ కలిశాడా? అలేఖ్య, అర్జున్ ప్రేమలో హైదరాబాద్ పోలీస్ పాత్ర ఏంటి?  అలేఖ్య, అంకిత్ ప్రేమ చివరకి ఏమైంది అనేదే 'బ్యూటీ' చిత్ర కథ.

ఎనాలసిస్ 
ఇలాంటి కథలు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో 'సెల్యులాయిడ్' పైకి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఒక అమ్మాయి ప్రేమ ఎలాంటి కలుషితం లేకుండా ఎంత నిర్మలంగా ఉంటుందో చెప్పడం బాగుంది. ప్రేమించిన వాడికోసం కుటుంబాన్ని సైతం వదిలి ఎలా  వస్తుందో  చెప్పే ప్రయత్నం చేసారు. అదే విధంగా సోషల్ మీడియా అనేది  మరో కోణంలో ఎంత ప్రమాదకరమో కూడా చక్కగా చూపించారు. కాకపోతే రొటీన్ స్క్రీన్ పై అవ్వడమే కొంచం మైనస్ గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా చిత్రాలు ఇంచు మించు ఈ కోవలోనే వచ్చాయి. కాబట్టి ఈ కథకి సంబంధించిన మెయిన్ పాయింట్ కి లింక్ అయ్యేలా, బ్యాక్ గ్రౌండ్ వేరేలా సెట్ చేసుకొని ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అలేఖ్య ఎంట్రీ సీన్ తో పాటు ఫ్యామిలీ సీన్స్  బాగున్నాయి. అలేఖ్య యాటిట్యూడ్ కూడా కథ కి సెట్ అయ్యింది. కాకపోతే  నాలుగు మంచి మాటలకే ఒక అబ్బాయి ప్రేమలో పడటం అనేది కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా అతన్ని పలు కోణాల్లో చెక్ చేసిన తర్వాత ప్రేమిస్తే బాగుండేది. పైగా అలేఖ్య క్యారక్టరయిజేషన్  కి  సూటయ్యేది. అంకిత్ కూడా అలేఖ్య ని  చెక్ చేసుకున్న తర్వాతే ప్రేమించి ఉండాల్సింది. ఈ విధంగా చేసుంటే ఈ కథ ఇంకా కట్టిపడేసేది. పరిచయమైన రెండు రోజులకే ఒకరికొకరు కన్న, కన్నమ్మ అని పిలుచుకోవడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. దర్శకుడు తాను అనుకున్న పాయింట్ కి అలా పిలవడం కరెక్ట్ అనుకున్నాడేమో. కానీ ప్రతిసారి అలా పిలవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎట్ లీస్ట్  ఈ పేర్లని తాము ఫిక్స్ చేసినట్టుగా ఒకరికి ఒకరు చెప్పుకుని ఆ తర్వాత పిలుచుకున్నా బాగుండేది. అలేఖ్య,అంకిత్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగున్నాయి. ఇంకో పక్క పారలల్ గా నారాయణ సీన్స్ నడుస్తుండటంతో అలేఖ్య పై మనకి తెలియకుండానే  కోపం వస్తుంది. అందమైన అమ్మాయిలని సోషల్ మీడియాతో పాటు, మంచి మాటలతో ట్రాప్ చేసే సన్నివేశాలని కూడా చూపిస్తూ ఉండాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. సెకండ్ హాఫ్ చాలా వేగంగా కదిలింది. కూతురు ఉన్న ప్రతి తండ్రి కన్నీళ్లు పెట్టుకునే విధంగా సీన్స్ ఉన్నాయి. పోలీస్ లు కూడా ఎంట్రీ ఇవ్వడంతో కధనంలో  వేగం పెరిగింది. కాకపోతే డబ్బు కోసం ఆశపడి,హెడ్ కానిస్టేబుల్ అలేఖ్య,అర్జున్ ని అసాంఘిక కార్యక్రమాలు జరిగే లాడ్జీకి పంపించడం బాగోలేదు. బయట ప్రపంచం ఎలా ఉంటుందో  కూడా చూపించారు. చివరి పదిహేను నిముషాలు ఎక్సలెంట్.  క్లైమాక్స్  సీన్ ని అలేఖ్య పై వేరేలా ప్లాన్ చేసుండాల్సింది. ముఖ్యంగా అలేఖ్య, అర్జున్ రొమాన్స్ చేస్తుంటే, అలేఖ్య ఏమైపోయిందనే ఆలోచనలో ఉన్న నారాయణ, చిన్నపాపగా ఉన్న అలేఖ్య ని  స్నానం చేయిస్తున్నట్టు ఊహించుకునే  సన్నివేశం  ఒళ్ళు జలదిరిస్తుంది. మనకి తెలియకుండానే  కన్నీళ్లు వచ్చేస్తాయి. 

నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు 

'అలేఖ్య' గా  'నీలఖి పాత్ర' ఎంతో పరిణితి చెందిన నటనని ప్రదర్శించింది. అన్ని వేరియేషన్స్ లోను ఎంతో అనుభవమున్న నటిలా చేసింది. తెలుగు సినిమాకి ఇంకో మంచి యువ కథానాయిక దొరికినట్టే. అర్జున్ క్యారక్టర్ లో అంకిత్ కొయ్య  మరో సారి తనదైన ఎనర్జీ తో నటించాడు. తన మునుపటి చిత్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఇతర హీరోల ఇన్స్పిరేషన్ తో డైలాగ్ డెలివరి లేకుండా తన కంటూ ఓన్ మేనరిజం ని సెట్ చేసుకుంటే బెటర్. ఇక నారాయణగా చేసిన నరేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరోసారి తనకి మాత్రమే సాధ్యమయ్యే నటనతో ప్రేక్షకులని కట్టిపడేసాడు. నరేష్ గారి కోసమైనా సినిమాకి వెళ్ళాలి అనేలా తన నట  జైత్రయాత్ర కొనసాగింది. తల్లిగా చేసిన వాసుకి తన అద్భుతమైన నటనతో తెలుగు సినిమాకి రెగ్యులర్ తల్లి నేనే అని మరో సారి చెప్పినట్టయింది. సిఐ 'అన్వర్' గా పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో చేసిన మలయాళ నటుడు 'నితిన్ ప్రసన్న'(Nithin Prasanna)నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ క్యారక్టర్ లో అయినా మెస్మరైజ్ చేస్తాడని మరోసారి నిరూపించాడు. ఫ్యూచర్ లో తెలుగులో బిజీ నటుడుగా మారవచ్చు. దర్శకుడిగా  వర్ధన్(Jss Vardhan)సక్సెస్ అయ్యాడు. ప్రతి షాట్ ని ఎంతో అందంగా మలిచాడు. కథనాల విషయంలో  రచయితగా మాత్రం తడబడ్డాడని చెప్పవచ్చు.  డైలాగ్స్ బాగున్నాయి.  విజయ్ బుల్గానిన్ పాటలు  , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాయికుమార్ ఫొటోగ్రఫీ,  ప్లస్ పాయింట్. విజయపాల్ రెడ్డి  నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే కథ బాగున్నా, కథనాల విషయంలో  మేకర్స్ కొంచం తడబడ్డారు. కానీ నటీనటుల అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ఆ లోటు తెలియనీయలేదు. నేటి ఆధునిక తరం అమ్మాయిలు తప్పనిసరిగా చూడాల్సిన మూవీ. నిజమైన 'బ్యూటీ' ఎక్కడ ఉందో తెలుస్తుంది.

 

రేటింగ్ 2 .75 / 5
        
                                                                                                                                                                                                                                                                            అరుణాచలం 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.