![]() |
![]() |

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అశోకవనంలో అర్జున కళ్యాణం' మే 6న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందు ఓ న్యూస్ ఛానల్ యాంకర్ కి, విశ్వక్ సేన్ కి మధ్య జరిగిన వివాదంతో ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. దానికితోడు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని భావించారంతా. కానీ చివరికి ఈ సినిమా బయ్యర్లకు నష్టాలను మిగిల్చి కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది.
'అశోకవనంలో అర్జున కళ్యాణం' కమర్షియల్ ఫెయిల్యూర్ అవ్వడానికి రాంగ్ రిలీజ్ కారణమని చెప్పొచ్చు. మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య(ఏప్రిల్ 29) విడుదలైన వారానికి 'అశోకవనంలో అర్జున కళ్యాణం' విడుదలైంది. అయితే ఆచార్య మొదటి షోకే ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ప్రభావం అర్జున కళ్యాణంపై పడలేదు. కానీ ఈ సినిమా.. మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' దెబ్బ నుంచి తప్పించుకోలేకపోయింది. అర్జున కళ్యాణం విడుదలైన ఆరు రోజులకు అంటే మే 12 న 'సర్కారు వారి పాట' విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో అర్జున కళ్యాణం జోరు మే 11 కే ముగిసినట్లు అయింది.
ట్రేడ్ వర్గాల ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.5.8 కోట్ల బిజినెస్ చేసిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం'.. ఐదు రోజుల్లో 4 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. అయితే సర్కారు వారి పాట రాకతో అర్జున కళ్యాణం స్పీడ్ కి బ్రేక్ లు పడ్డాయి. దీంతో ఫుల్ రన్ ముగిసేసరికి రూ.4.47 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. బయ్యర్లకు కోటిన్నర నష్టాలను మిగిల్చింది. ఓ వైపు సర్కారు వారి పాట జోరు, మరోవైపు అదే సమయంలో ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో.. హిట్ టాక్ తెచుకున్నప్పటికీ అర్జున కళ్యాణం కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. సరైన సమయంలో విడుదల అయ్యుంటే ఈ సినిమా ఖచ్చితంగా మంచి వసూళ్లు రాబట్టి ఉండేది.
![]() |
![]() |