Home  »  News  »  'ఆచార్య' ట్రైలర్.. 'పాదఘట్టం' కోసం చిరుత పులుల పోరాటం

Updated : Apr 12, 2022

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి జోడిగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటించారు. ఈ మెగా మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో పాటు.. 'ఆర్ఆర్ఆర్' వంటి సంచలన విజయం తర్వాత వస్తున్న చరణ్ నటించిన సినిమా కావడంతో 'ఆచార్య'పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలకు మరింత పెంచుతోంది.

'ఆచార్య' ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. "దివ్య వనం ఒక వైపు.. తీర్థ జలం ఒక వైపు.. నడుమ పాదఘట్టం" అంటూ చరణ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. అందమైన ప్రకృతి మధ్య అమ్మవారి గుడిలోని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. గుడి దగ్గర చూపించిన సన్నివేశాల్లో చరణ్ తో పాటు పూజా హెగ్డే కూడా కనిపిస్తోంది. ప్రజలతో కలిసి గుడిలో పూజలు చేసుకుంటూ ప్రశాంతంగా కనిపించే చరణ్.. పాదఘట్టం ప్రజల జోలికి వస్తే ఎంతవారితోనైనా తలపడే వ్యక్తిగా ట్రైలర్ లో కనిపిస్తున్నాడు. 

రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ లో నిమిషం తర్వాత చిరంజీవి ఎంటర్ అవుతాడు. "పాదఘట్టం ప్రజల గుండెలపై కాలేస్తే.. ఆ కాలు తీసేయాలంట" అంటూ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో దుమ్ముదులిపాడు మెగాస్టార్. "నేను వచ్చానని చెప్పాలనుకున్నాను.. కానీ చేయడం మొదలుపెడితే" అంటూ సోనూసూద్ కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. అంతకుమించిన యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరగొట్టాడు. లుక్స్ పరంగా చిరంజీవి చరణ్ కి అన్నలా ఉండటం విశేషం. మెగాస్టార్ అంత యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇక ట్రైలర్ చివరిలో నక్సల్స్ గెటప్ లో చిరంజీవి, చరణ్ కలిసి చిరుత పులుల్లా చెలరేగిపోయారు.

ట్రైలర్ ని బట్టి చూస్తే నక్సల్స్ గా తుపాకులు పట్టి అడవిలో పోరాడే సమయంలో చిరంజీవి, చరణ్ మంచి స్నేహితులు. ఆ తర్వాత తన వాళ్ళ కోసం పాదఘట్టం బాధ్యతలు తీసుకున్న చరణ్ ఓ ఆశయం కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. స్నేహితుడి ఆశయాన్ని నెరవేర్చడం కోసం పాదఘట్టంలో అడుగుపెట్టిన చిరంజీవి.. సోనూసూద్ తో తలపడి చరణ్ ఆశయాన్ని నెరవేరుస్తాడు. 

యాక్షన్, ఎమోషన్ కలగలిపి కట్ చేసిన 'ఆచార్య' ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మణిశర్మ సంగీతం, తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్ తో ఆకట్టుకున్న కొరటాల శివ ఈ మెగా మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.