![]() |
![]() |

బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రచించిన `దేవదాస్`నవలకి తెరరూపమైన `దేవదాసు`(1953) చిత్రంతో.. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సెంటిమెంట్ తోనే శరత్ చంద్ర రచించిన మరో నవల `దత్త` ఆధారంగా ఏయన్నార్ చేసిన మరో సినిమా `వాగ్దానం`. చిత్ర విచిత్ర మనస్తత్వాల సమాహారంగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుకి జంటగా కృష్ణకుమారి నటించగా గుమ్మడి, చలం, చిత్తూరు వి. నాగయ్య, రేలంగి, పద్మనాభం, సూర్యకాంతం, గిరిజ, సురభి కమలాబాయి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
పెండ్యాల నాగేశ్వరరావు స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి శ్రీ శ్రీ, దాశరథి, ఆచార్య ఆత్రేయ, నార్ల చిరంజీవి సాహిత్యమందించారు. ఇందులోని ``నా కంటి పాపలో నిలిచిపోరా`` (ఘంటసాల, సుశీల గానం - దాశరథి సాహిత్యం) అంటూ సాగే గీతం ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ``కాశీపట్నం చూడరాబాబు``, ``బంగారు నావ``, ``మా కిట్టయ్య పుట్టిన దినం``, ``వన్నె చిన్నెలన్ని``, ``వెలుగు చూపవయ్యా`` వంటి పాటలు కూడా రంజింపజేశాయి. కవితా చిత్ర వారి పతాకంపై కె. సత్యనారాయణ, డి. శ్రీరామ మూర్తి నిర్మించిన `వాగ్దానం` కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది. 1961 అక్టోబర్ 5న విడుదలైన `వాగ్దానం`.. నేటితో 60 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |