![]() |
![]() |

"తెలుగువాళ్లందరూ అందర్నీ బ్రహ్మాండంగా ఆదరిస్తారు. గెస్టులు వచ్చినప్పుడు సకల మర్యాదలూ చేసి, షడ్రసోపేతంగా భోజనం పెడతారు. కానీ ఆ గెస్ట్ 'నీ ఇంట్లో వ్యవహారాలు సరిగా జరగట్లేదు, నేను చూస్తార్రా నీ ఇంటి సంగతి' అంటే మీరు ఒప్పుకుంటారా?" అని ప్రశ్నించారు రాజీవ్ కనకాల. 'మా' ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న కన్నడ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "మేమేమన్నా గాజులు తొడుక్కొని కూర్చున్నామా? నా ఇల్లు నేను సమర్థించుకోలేనా? చక్కదిద్దుకోలేనా? నాకు చేవలేదా? చేతకాదా? ఇప్పుడు అదే జరుగుతోంది" అని ఆయన ఆవేశపడ్డారు.
తెలుగువన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన మద్దతు మంచు విష్ణుకు, ఆయన ప్యానల్కేనని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు. విష్ణు కచ్చితంగా గెలుస్తాడనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. "ప్రకాశ్‌రాజ్ వ్యవహారం మీ ఇంట్లో సరిగా లేదు, నేను వచ్చి చేస్తానన్నట్లు ఉంది" అని ఆయన అన్నారు. "ఇక్కడ చాలామంది హీరోలున్నారు. వారిలో ఓ హీరో మంచు విష్ణు నేను చేస్తానని ముందుకు వచ్చాడు. ఆయనను ఎన్నుకోండి" అని పిలుపునిచ్చారు.
"నటన వరకు ఓకే. ఎవరు ఎక్కడైనా నటించవచ్చు. ఇవాళ పాన్ ఇండియా స్కేల్లో సినిమాలు తీస్తున్నారు. అందువల్ల వేరే భాషల నటులను కూడా తీసుకోవాలి. అయినప్పటికీ వీలైనంత మంది తెలుగునటులకు అవకాశాలు ఇవ్వాలి. మొన్నటి దాకా కన్నడ ఇండస్ట్రీలో వేరే భాషల నుంచి సినిమాలను కన్నడంలో కూడా డబ్బింగ్ చేయడానికి వీల్లేదని రూల్ పెట్టారు. కన్నడ సినిమాల్లో కన్నడ ఆర్టిస్టుల్ని మాత్రమే పెట్టుకోవాలనే రూల్ పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ల ఇండస్ట్రీ డెవలప్ అయ్యింది. మేం అంత స్టుపిడ్ కాదు. ఇవాళ 900 మంది ఆర్టిస్టులున్నారు. వారిలో కనీసం 300 మందైనా పనికిరామా అనే ఉద్దేశం అంతే!" అని ఆయన అన్నారు.
![]() |
![]() |