Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 4

  

      ఆమె దగ్గర పది రూపాయల చిల్లర కోసం ఏ రౌడీ తలమీద మోది ప్రాణాలు తీశాడో తెలీదుగానీ జాతీయ జెండా తెలుపు ఎరుపుల మధ్య చిక్కుపడిన నిస్సహాయమైన అశోక చక్రంలా ఆ ముసలి శరీరం నిర్జీవంగా పడివుంది.    
    ముందుకు వొరిగిన ఆమె ఆకృతి విరిగిన రాట్నంలా వుంది. శుష్కించిన ఆమె శరీరం సోషలిజాన్ని ప్రశ్నిస్తూన్నట్టు వుంది. కారిన రక్తం భోక్తల పళ్ళేల్లో పాయసంలా వుంది. 'నాకు డబ్బులిచ్చిన మొదటి పోలీసువి నువ్వే నాయినా' అన్నమాట రక్షణ వ్యవస్థకే ప్రశ్నలా వుంది.

      రాణా కదిలేడు. అతడిది ఫోటో గ్రాఫిక్ మెమరీ, ప్రతీ గూండా అతడికి గుర్తున్నాడు. జనంలోకి చొచ్చుకుపోయాడు. అతడి చెయ్యి మెరుపుకన్నా వేగంగా కదుల్తోంది. పిస్తోలు అవసరమే రాలేదు. ఎదుటివాళ్ళూ సామాన్యులు కాదు. అయినా పూనకం వచ్చినవాడిలా విజ్రుంభించే ఆ ఇన్ స్పెక్టర్ ముందు ఆగలేక పోయారు. చట్టం, చట్ట పరిధి- ఏమీ చూసుకోలేదు అతడు. కనపడిన వాడిని కనపడ్డట్టు కొట్టాడు. వాళ్ళని వ్యాన్ లో పడేసుకోవడమే మిగతా పోలీసుల పని అయింది.  
    ఇరవై మంది గూండాలు శవాకారాల్లో తేలారు. అరగంటలో పరిస్థితి సాధారణ స్థితికొచ్చింది.                                             *    *    *

    ఆ ఊరి ఎమ్మెల్యే నర్సింహులునాయుడు చాలా ఆనందంగా, ఆరో రౌండ్ లో వున్నాడు. మధ్యాహ్నం సమయానికి బంద్ విజయవంతమైందని తెలిసింది. అప్పట్నుంచి తాగుతూనే వున్నాడు.    
    నర్సింహులునాయుడు అంత ఆనందంగా వుండడానికి కారణం వుంది. ముఖ్యమంత్రి భక్తుడు అతడు. ఆయన ఆశీర్వాదం కోసం నిరంతరం చూస్తూ వుంటాడు. తన జిల్లాలో బంద్ పూర్తిగా సక్సెస్ అయ్యే బాధ్యత తనమీద వేసుకున్నాడు. అందులోనూ ఆ జిల్లాకి హోమ్ మినిష్టర్ అబ్జర్వేటర్ గా వస్తున్నాడంటే మరింత రెచ్చిపోయాడు. తన ఊళ్ళో తనకెంత పలుకుబడి వుందో పై నాయకులకి చూపించడం కోసం లారీనిండా పేరొందిన గూండాల్ని దింపాడు.    
    సాయంత్రం నాలుగింటికి తెలిసింది- గూండాలు చావు దెబ్బతిని అరెస్ట్ అయిన సంగతి. కల్లు తాగిన కోతిలా లేచాడు. జీపేసుకుని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ట్రావెలర్స్ బంగ్లావైపు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. అతడి రౌద్రాకారం చూసి అనుచరులే బెదిరిపోతున్నారు. ఇది తన పరపతికి సంబంధించిన సమస్యగా అతడు భావించి ఉడికిపోతున్నాడు. అధికారంలో వున్న పార్టీ 'బంద్' పిలుపునిస్తే, స్వయంగా హోం మినిస్టర్ వచ్చి మకాంవేస్తే, తన ఏరియాలోనే అది ఫెయిలైందంటే-    
    తన పరిస్థితి ఏమిటి?    
    రేపు ముఖ్యమంత్రికి తను మొహం ఎలా చూపించుకోగలడు?    
    గూండాలకీ, బాంబులకీ పేరుమోసిన తన ఏరియాలోనే ఇలా జరిగినట్టు పేపర్లో వస్తే, రేపు తితి ఎమ్మెల్యేలు నవ్వరూ?    
    అతడి కాలు బలంగా ఆక్సిలరేటర్ ని నొక్కింది. జీపు బాణంలా ట్రావెలర్స్ బంగ్లాలోకి చొచ్చుకుపోయింది. అప్పుడో అనుకోని సంఘటన జరిగింది.    
    ప్రొద్దుటినించీ డ్యూటీ చేసి అలసిపోయిన పోలీసులు తిరిగి తిరిగి వచ్చిన హోంగార్డులూ ఆ ఆవరణలో రెస్ట్ తీసుకుంటున్నారు! నాయుడి జీపు ఒకరిద్దర్ని ఢీకొని, సర్రున తిరిగి మెట్ల ముందు ఆగింది. వాళ్ళ ఆర్తనాదాలు బ్రేకు శబ్దాల్లో కలిసి వికృతంగా ధ్వనించాయి.    
    జీపు దిగుతూనే నాయుడు రంకె వేశాడు. "ఎవడ్రా వాడు? ఎవడు అరెస్టులు చేసింది?"    
    ఆ టైమ్ కి రాణా లోపల్నుంచి బైటకు వస్తున్నాడు. అప్పటికే అతను గూండాల్ని వదిలిపెట్టే విషయమై అరగంటసేపు హోం మినిష్టర్ తో వాదించి వస్తున్నాడు. నాయుడి మాటలకు ఆగి, "నేనే, ఏం?" అన్నాడు విసుగ్గా.    
    "వాళ్ళని వెంటనే వదల్రా లం.....కొడకా, లేకపోతే నీ అంతు తేలుస్తాను" అని అరిచాడు నాయుడు.    
    రాణా అప్పటికే చిరాగ్గా వున్నాడు. వాదించి వాదించి అలసిపోయి వున్నాడు. నాయుడి మాటలు గాయంమీద కారం జల్లినట్టు అనిపించాయి. అప్పుడే అతని దృష్టి గాయపడిన పోలీసుల మీద పడింది. అతడి సహనపు ఆనకట్ట తెగింది. ఎంతకాలం ఇలా? ఎప్పటికయినా దీనికో ముగింపు వుండాలి. ఆ ముగింపుకి ఎక్కడో ఒకచోట ప్రారంభం వుండాలి. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల్లా వున్నారు.    
    చటుక్కున బేడీలు తీసి నాయుడి చేతులకి వేసి "నిర్లక్ష్యంగా జీపు తొలి ఆక్సిడెంట్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను" అన్నాడు.    
    అనుకోని ఈ సంఘటనకి నాయుడు బిత్తరపోయాడు.    
    డి.ఐ.జి. నరసింహం ఫ్రీజ్ అయ్యాడు.    
    పోలీసుల మొహంలో ఆనందం పొంగింది.    
    ఒక పెద్ద విస్ఫోటనానికి ప్రారంభంగా వత్తి వెలిగింది. అది పేలుతుందో చప్పబడిపోతుందో కాలమే నిర్ణయించాలి.    
    ఆ విధంగా ఒక వినూత్న చరిత్రకి ప్రథమాధ్యాయం ప్రారంభమైంది.    
    పోలీస్- వర్సెస్- పాలిటిక్స్.    
                                             *    *    *    
    చాలా కొద్ది టైమ్ లో అక్కడ పరిస్థితి దారుణంగా విషమించింది. నర్సింహులునాయుడు అయిదు నిముషాల్లో బెయిల్ మీద విడుదలయ్యాడు. అక్కడ సమస్య అదికాదు. రాజకీయాల్లో పాతుకుపోయి, ఆ జిల్లాకే పెట్టని కోటగా నిలబడిన మనిషి నాయుడు! అతడు ఏ పార్టీని అపార్ట్ చేస్తే అది అధికారంలోకి రావడం తథ్యం అటువంటి వాడిని అరెస్ట్ చేయడమంటే-    
    రాజకీయ నాయకులందరూ ఇది తమకే జరిగిన అవమానంగా భావించారు. హైదరాబాద్ కు ఫోన్లు వెళ్ళాయి. రాణాని వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి మీద వత్తిడి తీసుకొచ్చారు.    
    ముఖ్యమంత్రి అది చేసేవాడే. ఒక చిన్న ఇన్ స్పెక్టర్ కోసం నాయకుల్ని దూరం చేసుకోలేడు అతడు. కానీ పోలీసు బలగాల్నుంచి అంత గట్టిగానూ వత్తిడి వచ్చింది. జీప్ ఆక్సిడెంట్ లో దెబ్బలు తిన్న పోలీసులు పరిస్థితి అంత ప్రమాదకరంగా లేకపోయినా- ఆ దృశ్యాన్ని చూసిన సాక్షులు చాలామంది వుండటంతో రాణాకి సపోర్ట్ ఎక్కువైంది.    
    తమ జీపు స్పీడుగా నడపలేదనీ, పోలీసులే అడ్డొచ్చారనీ నాయుడు వాదించాడు. క్షణాల్లో దానికి సాక్షులు తయారయ్యారు.    
    పోలీసుల మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే తప్పించుకోవడానికి వీల్లేదని అసలు కోర్టు వరకూ వెళ్ళకుండా ఈ వ్యవహారం తామే తేల్చుకుంటామనీ పోలీసులు మూకుమ్మడిగా వసతిగృహం మీదకు దాడిచేశారు. ప్రవాహంలా వచ్చిన పోలీసుల్ని చూసి రాజకీయ నాయకులు లోపలి రూముల్లోకి పరుగెత్తారు.    
    మెట్ల దగ్గరే రాణా వాళ్ళని ఆపుచేశాడు. పిస్టల్ తీసి కణతకి గురి పెట్టుకుని "మీరు లోపలికి వెళ్తానంటే నేనిది పేల్చుకుని ఇక్కడే చచ్చిపోతాను. నా మీదా చట్టం మీదా ఏమాత్రం నమ్మకమున్నా వెనక్కి తప్పుకోండి" అన్నాడు. అతడిమీద వారికి గౌరవం వుంది. నిస్సహాయుల్లా వెనక్కి తగ్గారు.    
    ఒక్కసారి పోలీసులు తగ్గారని తెలిసేసరికి నాయకులు మళ్ళీ పెట్రేగిపోయారు. సమాజాన్ని రక్షించవలసిన పోలీసులే ఇలా దాడి చేయడం భయంకరమైన విషయంగా వాళ్ళు అభివర్ణించారు. సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన రేడియో స్టేషన్ ముందు శాంతియుతమైన ధర్నా నిర్వహించబోతుంటే పోలీసులు అడ్డుకున్నారని వాదించడం మొదలుపెట్టారు.    
    ముఖ్యమంత్రికి ఏం చెయ్యాలో పాలుబోలేదు. ఇటు తన పార్టీ సహచరుల్ని వదులుకోలేడు. అటు పోలీసుల్తో గొడవపెట్టుకుని ప్రజాభిమానం పోగొట్టుకోలేడు. ఈ సమస్యని అక్కడికక్కడే పరిష్కరించమని హోం మినిష్టర్ ని ఆదేశించాడు.   
    హోం మినిష్టర్ పని ఇరుకున పడ్డట్టయింది. ఇటువంటి పరిస్థితుల్లో అతడు చేయగలిగిందీ ఎప్పుడూ చేసేదీ ఒకటే.    
    భార్య చేతులు పట్టుకోవడం.    
    ఆ పనే చేసి, "నువ్వే ఎలాగయినా దీన్ని సాల్వ్ చెయ్యాలి" అన్నాడు. కామిని మనోహరంగా నవ్వి, "నాయుడిని పిలిపించండి. మాట్లాడదాం" అంది.    
    నాయుడు వప్పుకోలేదు. "గాయపడిన ఒక్కో పోలీసుకీ లక్షరూపాయలు నష్టపరిహారం ఇస్తాను. వాళ్ళని కేసు ఉపసంహరించుకొమ్మనండి. పోతే ఆ రాణాగాడు మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ సస్పెండ్ కావాల్సిందే."    
    "అతను సస్పెండ్ అయిన పక్షంలో పోలీసులు సంధికి వప్పుకోరు" అన్నారు హోమ్ మంత్రి.    
    కామిని అంది "లక్షరూపాయలిచ్చినా సంధికి వప్పుకోరంటే పోలీసులకి అతడిమీద అంత గౌరవాభిమానాలున్నాయన్నమాట."    
    "అవును అతడు చాలా సిన్సియర్" రెడ్డి అన్నాడు.    
    "ఎంత సిన్సియర్ అన్నా కానీ ఆడి రక్తం కళ్ళ చూడాల్సిందే" అన్నాడు నాయుడు.    
    "పాపం ఆ ఇన్ స్పెక్టరేగా పిస్టల్ కణతకి గురిపెట్టుకుని మిమ్మల్ని రక్షించింది- లేకపోతే పోలీసులు మీ మీద దాడిచేసి వుండేవారు."    
    "అవును అందుకేగా మన పరాభవం సంగతి ప్రజలకి తెలిసిపోయింది! ఎంత సెన్సార్ చేసినా వార్త పేపర్లో వచ్చింది! నా చేతులకి సంకెళ్ళేసినోడు బ్రతకటానికి వీల్లేదు."    
    "మీ కోరిక ఏమిటో సరీగ్గా చెప్పండి. ఆ రాణా చావడమా? సస్పెండ్ కావడమా? ఏది కావాలి మీకు."    
    కామిని అడిగిన ప్రశ్నకు నాయుడు వెంటనే సమాధానం చెప్పలేక తబ్బిబ్బు అయ్యాడు. నిశ్శబ్దాన్ని తనకి అనుకూలంగా వాడుకోగలగడమే తెలివైన వాళ్ళ లక్షణం. కామిని అంది-    
    "మీరతన్ని సస్పెండ్ చేయించారనుకోండి. అక్కడితో అందరూ మీ పగ చల్లారిపోయింది అనుకుంటారు. పోలీసులు గొడవ చేస్తే అతడి సస్పెన్షన్ కొన్నాళ్ళకి తీసేస్తారు. మిమ్మల్ని చూసి అందరూ నవ్వుకుంటారు. ఆ తరువాత అతన్ని చంపించారనుకోండి. ఆ మర్డర్ మీరే చేయించారనీ, మీ పగ తీర్చుకున్నారానీ ఎవరూ అనుకోరు. దానివల్ల మీ ప్రిస్టేజి కొద్దిగా కూడా పెరగదు. దీనికన్నా మంచి మార్గం వొకటుంది. మీరతన్ని ఇక్కన్నుంచి ట్రాన్స్ ఫర్ చేయించారనుకోండి. అతను సస్పెండ్ కాలేదు కాబట్టి మీరు ఓడిపోయారనుకుంటారు. ఒక రెండు నెలలు పోయిన తరువాత అతనిని మీరు మర్డర్ చేయించారనుకోండి. నాయుడి గారి పగంటే అలా వుంటుంది" అని అందరూ అనుకుంటారు. మీ వాళ్ళమధ్య మీ పరువు పెరుగుతుంది. పోలీసులకి అసలు సంగతి తెలిసినా మీ మీద ఏ కేసూ పెట్టలేరు. ఎలా వుందీ ఆలోచన."    
    'అమ్మ నా పెళ్ళావో' అనుకున్నాడు టి.కె. రెడ్డి భార్యని చూస్తూ నాయుడు లేచి 'సరే- అట్టాగే చేయిద్దాం. కానీ ఆన్ని నెల రోజులకన్నా ఎక్కువ బ్రతకనివ్వను' అన్నాడు. ఈ నెల రోజులు కూడా ఆడు సుఖంగా బ్రతకడానికి వీల్లేదు. దొంగలూ, గూండాలూ దండిగా వుండే వూరికి ట్రాన్స్ ఫర్ చెయ్యాలి" అన్నాడు.    
    "స్టూవర్ట్ పురం చేద్దాం" అన్నాడు హోమ్ మినిష్టర్.    
    "స్టూవర్ట్ పురంలో పోలీస్ స్టేషన్ లేదు" అంది కామిని. రెడ్డి నాలుక్కర్చుకున్నాడు. తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి "ఏమిటీ? అటువంటి వూళ్ళో పోలీస్ స్టేషన్ లేదా?" అన్నాడు ఆశ్చర్యంగా.    
    గుంటూరు దగ్గర చీరాల ప్రాంతంలో చిన్నవూరు స్టూవర్ట్ పురం జైలునుంచి విడుదలైన వాళ్ళ పునరావాసం కోసం ఏర్పర్చిన ఆ ఊరుని సెటిల్ మెంట్ ఏరియా అంటారు. పెద్ద గూండానిగానీ, దొంగతనాల్లో ఆరితేరిన వాడి గురించి గానీ మాట్లాడవలసి వస్తే "స్టూవర్ట్ పురం కేసా?" అనడం ఆనవాయితీ. దొంగలకి నిలయంగా ఆ ఊరుకి అంత పేరొందింది అని బయటవాళ్ళు అనుకుంటూ వుంటారు. అటువంటి ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదంటే రెడ్డికి ఆశ్చర్యం కలగడంలో వింతలేదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS