Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 3

 

     బాత్ రూమ్ తలుపు వెయ్యకుండానే ఆమె రెడ్డిని ముద్దు పెట్టుకుని "నువ్వు నాతో వుండిపో సాయంత్రం బీచ్ కి వెళ్దాం. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం" అంది. ఆమె వెళ్ళు అతని వెన్నుముక క్రింద భాగాన నాట్యం చేస్తున్నాయి.
    ఇద్దరూ బైటకొచ్చారు. "కామిని నన్ను ఇక్కడే వుండమంది. మీరిక వెళ్ళొచ్చు" అన్నాడు రెడ్డి. పెద్ద మనుషులు తెల్లమొహం వేశారు. కామిని ఏడుస్తుందనుకున్నారు లేదా పెద్ద గొడవ జరిగితే మధ్యవర్తిత్వం జరపొచ్చుననుకున్నారు. కనీసం ఓ లక్ష దొరుకుతుందనుకున్నారు. ఇది వాళ్ళు వూహించని మలుపు. తలవంచుకుని వెళ్ళిపోయారు.    
    ఆ రాత్రి కామినిని దగ్గరకు తీసుకోబోయాడు రెడ్డి. "నా కిలాటివి ఇష్టం వుండవ్. స్ట్రక్చర్ పాడైపోతుంది" అంది. సాయంత్రపు 'లాలన' ఇప్పుడామె కంఠంలో లేదు.    
    "మరెందుకు వుండిపొమ్మన్నావ్?"    
    "నాకు నమ్మకమైన సెక్రట్రీలు దొరకటం లేదు. నా డేట్సు చూడటానికీ, నా పారితోషికాల విషయం మాట్లాడటానికీ ఒక మనిషి వుంటే బావుండునని ఎప్పటినుంచో అనుకుంటున్నాను."    
    "అంటే నేన్నీకు మొగుణ్ణి కాదా?"    
    "ప్రస్తుతానికి నాతో వుండు. అవసరం వచ్చినప్పుడు డిక్లేర్ చేస్తాను. పెళ్ళయినట్టు ఇప్పుడే చెప్తే హీరోయిన్ కి దెబ్బ."    
    "మధ్యలో నువ్వు నన్ను తన్ని తగలేస్తే"    
    "కావాలనుకుంటే ఆ పని ఇప్పుడే చెయ్యగలనుగా-"    
    "మన పెళ్ళయినట్టు నా దగ్గర సాక్ష్యాలున్నాయి."    
    "సాయంత్రం సముద్రంలోకి నువ్వు లాయరు శవాన్ని విసిరేసినట్టు నా దగ్గిర ఫోటోలున్నాయి-" రెడ్డి అదిరిపడ్డాడు. ఆమె నవ్వింది.    
    "నువ్వూ ఓ కుర్ర లాయరూ నా దగ్గిరకు వచ్చి బ్లాక్ మెయిల్ చేశారు. నేను ఓ రెండు లక్షలిచ్చాను. అది పంచుకోవటంలో ఇద్దరికీ గొడవొచ్చింది. నువ్వు వాడిని చంపి సముద్రంలో పడేసేవు. ఎలా వుందీ కథ?"    
    చేతిలో నాగుపాముని పట్టుకున్నట్టు భయపడి అతడామెని వదిలేశాడు. ఆ తరువాత మరెప్పుడూ ఆమెని చేరుకోవటానికి అతడు సాహసించలేదు.    
    ఆ విధంగా ఆమె కాణీ ఖర్చు లేకుండా ఒక సెక్రటరీని సంపాదించుకుంది.    
    సినిమా రంగంలో టాప్ పొజిషన్ లో వుండగానే ఆమె దృష్టి రాజకీయాల మీదకి మళ్ళింది. ఆమె మైకు పట్టుకుని మాట్లాడుతూంటే ప్రజలు మంత్రముగ్ధులై వినసాగారు. అన్ని పార్టీలూ ఆమెని తమలో కలుపుకోవటానికి ప్రయత్నించాయి.    
    ఆమె ఆలోచించింది.    
    పెరుగుతున్న ధరలు, కష్టమవుతున్న జీవన విధానం ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని కలుగజేస్తోంది. అయిదు సంవత్సరాలు అధికారంలోనున్న పార్టీని దింపటం ఒకటే వాళ్ళ అసంతృప్తినీ, కసినీ తగ్గించగలిగేది. అదొక్కటే వాళ్ళు చేయగలిగింది కూడా! అదే చేస్తారని ఆమె వూహించి ప్రతిపక్షంలోని ముఖ్య పార్టీలో చేరింది. అయితే తను నిలబడలేదు, భర్తని నిలబెట్టింది! ఆమె వూహించినట్టే ప్రతిపక్షం అధికారంలోకి వచ్చింది. రెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత మినిస్ట్రీ కావాలని కోరింది. వప్పుకోలేదు. ఏ మాత్రం రాజకీయ జ్ఞానం లేనివాడికి మంత్రిపదవి ఏమటని అన్నారు. ఆమె నిరాశచెందలేదు. ఢిల్లీలో ఆమె ఎవరెవర్ని కలిసిందో, ఏం చేసిందోగానీ అనుకున్నది సాధించింది.    
    హైద్రాబాద్ వచ్చేసరికి రెడ్డికి మినిస్ట్రీ ఇచ్చారు. ఢిల్లీ వర్గాలతో ఆమెకున్న పరిచయం ఆ విధంగా నిరూపణ అయింది. ఆమె మరింత పెరిగింది.    
    కామిని సెక్స్ లైఫ్ గురించి పుకార్లేమీ పెద్దగా లేవు. సాధారణంగా ఇన్ని పనులు ఇంత అవలీలగా చేసినామె శృంగారజీవితం గురించి రకరకాల కథలు ప్రచారంలో వుండాలి. కానీ అంతగా ప్రచారం కాలేదు. కేవలం పెద్దవాళ్ళతోనే గడుపుతుందని కొందరంటే, ఆమెని చేరుకోవటం కష్టం అని కొందరంటారు. కొంతమంది "నిజంగా" పెద్దవాళ్ళు ఆమె కోసం ప్రయత్నించి భంగపోయారు కూడా! ఆమె మనసులో పురుషవాంఛ ఎలావుందో ఎవరికీ తెలీదు. ఆమె భర్తకి కూడా.    
    తను రాజకీయాల్లోకి రాకుండా భర్తని నిలబెట్టడం కామిని తెలివితేటలకి పరాకాష్ట. వెండితెర మీద ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. రాజకీయాల్లో ఆమె చెయ్యి వుండనే వుంది.
      పోలీసు అధికారులందరూ ట్రావెలర్స్ బంగ్లాలో సమావేశమయ్యారు. హోంమినిష్టర్ చెప్పడం ప్ర్రారంభించాడు. "ఇదో - ఈడకి నేనందుకొచ్చానో మీ అందరికీ తెలుసు కదా. ఢిల్లీ ప్రభుత్వం సరిగ్గా పని చెయ్యడంలే అందుకు వ్యతిరేకంగా మా పార్టీ రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తోంది. ఈ బంద్ ని ఎట్టాగయిన పాడుచెయ్యాలని ఢిల్లీ ప్రభుత్వం కంకణం కట్టుకుందట. రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో వుండటం ఢిల్లీకి కన్నెర్రగా వుంది. ఈ వూర్లో చిన్నసైజు రేడియో స్టేషనుంది. అది ఢిల్లీ ప్రభుత్వానిది. అక్కన్నుంచి మొదలెట్టాల బందు."
        రాణా కన్నార్పకుండా టి.కె. రెడ్డి వైపే చూస్తున్నాడు. రెడ్డి మధ్య పాపిడి అతడికి నవ్వు తెప్పిస్తూంది. రెడ్డిగాని రోడ్డు మీద కనపడితే హోంమినిష్టర్ అనుకోరు. 'చిల్లరలేదోయ్' అంటారు. చదువు, విజ్ఞానం, సంస్కారం లాంటి పెద్ద పదాలు కాదుకదా- కనీసం చిరునవ్వు, ధైర్యం, ధీమాల్లాంటివి కూడా అతడిలో కనబడలేదు. ఎప్పుడూ ఏదో కంగారులో వున్నట్టు భయంగా చూస్తూ వున్నాడు.
    "ఈ బంద్ సరిగ్గా జరిగేలా చూడమని మన ముఖ్యమంత్రి గారు మంత్రులందర్నీ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కర్ని పంపినారు. అందుకే నేనీ జిల్లా కొచ్చినానన్నమాట. అర్ధమైందా? మీ పోలీసోళ్ళకి ఏం చెప్పినా సరీగ్గా అర్ధంకాదని మా ముఖ్యమంత్రి చెప్పాడు. "వెనకాల వున్న ఎమ్మెల్యేలందరూ ఆ జోక్ కి నవ్వేరు.    
    రాణాకి విచారమేసింది. తన గురించి కాదు. ఎవరిమీదో తెలియని విచారం. అతడికి ముసలమ్మ మాటలు గుర్తొచ్చాయి. 'రెండు పెభుత్వాలు ఒకటి కాదా బాబూ' అన్న అమాయకమైన ప్రశ్న! ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుకాణాలు మూయిస్తాయింది. ట్రాఫిక్ బంద్ చేయిస్తూంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చెయ్యవద్దని తన సిబ్బందినే ఆదేశిస్తూంది.    
    రాణాకి తండ్రి గుర్తొచ్చాడు. గాంధీగారు తనింటికి వచ్చాడా? అనుకున్నాడు. మళ్ళీ ఏమిటి ఈ అర్ధం పర్ధం లేని ఆలోచన్లు? ఇక్కడ హోంమినిష్టర్ గారు బంద్ గురించి మాట్లాడుతూ వుంటే తనెక్కడో ఆలోచించడం ఏమిటి అనుకున్నాడు.    
    హోంమినిష్టర్ తిరిగి చెప్పడం ప్రారంభించాడు. "ఇప్పుడు మిమ్మల్నందర్నీ ఇక్కడికి పిల్చిందెందుకంటే, ఈ జిల్లా నా కప్పగించారు. కాబట్టి ఈ జిల్లాలో బంద్ బాగా జరిగేలా, మీరంతా సాయం చెయ్యాలి."    
    డి.ఐ.జి. నరహరి గొంతు సవరించుకున్నాడు. రాణా అతడివైపు చూశాడు. అయిదడుగుల నాలుగంగుళాల ఎత్తుతో పొట్టిగా, ఇరవై ఎనిమిది అంగుళాల ఛాతీతో సన్నగా వుండే ఈ వ్యక్తి డి.ఐ.జి. ఎలా అయ్యాడా అన్నది సమాధానం తెలియని ప్రశ్న.    
    నరహరి నమ్రతగా అన్నాడు. "సార్! ఈ బంద్ లో ఏ గొడవా జరక్కుండా చూసే బాధ్యత నాది. మా కొదిలెయ్యండి"    
    "అందుకేనయ్యా మీ పోలీసులకి తెలివిలేదంటాడు మా చీఫ్ మినిష్టరు. గొడవలు జరక్కపోతే బంద్ ఏటి? బాగా గొడవలు జరగాల. ఇదంతా ఢిల్లీ ప్రభుత్వమే చేయించిందని మేం చెప్పుకోవాల. అందుకే మా వాళ్ళని ఓ లారీ నిండా తెప్పించినా వాళ్ళు చేస్తార్లే గొడవలు. ఇప్పుడు ఈడకి మిమ్మల్నందర్నీ పిలిపించిన దానికి కారణమేమిటంటే- మీరంతా దీన్నిచూసి చూడనట్టు ఊరుకోవాల. జిల్లాలోని ఏ మాత్రం శాంతి ఎక్కువయినా నా మినిస్ట్రీ పోద్ది."    
    జిల్లాకి సంబంధించిన పోలీసు అధికారులందరూ మొహాలు చూసుకున్నారు.    
                                           *    *    *    
    మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగిందా సంఘటన.    
    పన్నెండింటి వరకూ అంతా ప్రశాంతంగానే వుంది. ఉప్పెన వచ్చేముందు ప్రశాంతత..... ఒంటిగంట ప్రాంతంలో ఒక రేడియో షాపు తెరచి వుందని వర్తమానం తెలిసి నలుగురు మనుష్యులు అక్కడికి వెళ్ళారు. అందులో ఒకడు ఒక ట్రాన్సిస్టర్ తీసుకోవడంతో గొడవ ప్రారంభమైంది. క్షణాల్లో ఆ బజారు లూటీ చేయబడింది. ఎక్కన్నుంచి పుట్టుకొచ్చారో - సంఘ వ్యతిరేక శక్తులకి ప్రతీకలు నేలలోంచి పుట్టినట్టు పుట్టుకొచ్చారో - సంఘ వ్యతిరేక శక్తులకి ప్రతీకలు నేలలోంచి పుట్టినట్టు పుట్టుకొచ్చారు. మరో అరగంటలో గృహ దహనాలు మొదలయ్యాయి.    
    'ఏం జరిగినా చూసీ చూడనట్టు ఊరుకోమ'న్న సూచన్లు అందిన పోలీసులు ప్రేక్షకులే అయ్యారు. డి.ఐ.జి. నరహరి మామ ముఖ్యమంత్రికి సన్నిహితుడు. నరహరికి తన పర్సనాలిటీకీ, గత రికార్డుకీ తాను డిప్యూటీ కాదు కదా, నైట్ వాచ్ మన్ గా కూడా పనికి రాననీ, అంతా తన మామగారి చలవ అనీ తెలుసు.    
    మెయిన్ బజారుని ఆనుకుని వున్న సందులోంచి రాణా పరుగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ నిలబడి వున్న పోలీసులు అతడికి సెల్యూట్ చేసి, "సార్, చెంగయ్య దుకాణం తాళాలు బ్రద్దలుకొడుతున్నారు" అన్నారు. చెంగయ్య దుకాణం ఆ ఊర్లో కెల్లా పెద్ద బట్టలషాపు.    
    "కమాన్, ఫాలో మీ" అంటూ వేగంగా మెయిన్ బజారులోకి వచ్చాడు. చెంగయ్య దుకాణం ముందు రౌడీలు గుంపులుగా వున్నారు. కొద్ది దూరంలో ఏదో పాక తగలబడుతూంది. ఎక్కన్నుంచో ఫైర్ ఇంజన్ మోత వినపడుతూంది. రోడ్డు మీదంతా రాళ్ళు, కాగితం పాకెట్లు, గాజు పెంకులు చెల్లాచెదురుగా పడివున్నాయి. షాపు లూటీ జరిగితే, దొరికినన్ని వస్తువులు తీసుకుపోదామని అమాయక (?) జనం దూరంగా నిలబడి చూస్తున్నారు. పక్కవీధిలోంచి జనం గోల వినిపిస్తోంది. పరిస్థితి ఎప్పుడో చేజారిపోయింది. వీధి మొదట్లో సినిమాహాలు నామరూపాలు లేకుండా నాశనమైంది. దూరంగా ఎవరో హృదయవిదారకంగా ఏడుస్తున్నారు. "ఛార్జ్" అన్నాడు రాణా.    
    అతని వెంటవున్న పోలీసులు ఒక సైన్యంలా ముందుకు దూకారు. అప్పటికే వాళ్ళ కడుపు మండిపోతోంది. తమ కళ్ళ ముందు ఇంత దారుణం జరుగుతున్నా చేతులు కట్టేసినట్టయింది ఇప్పటివరకూ! తమ పై అధికారి నుంచి ఆజ్ఞ వచ్చేసరికి వాళ్ళు కసితో గూండాల మీదకు దూకారు.    
    ఇంతలో రోడ్డుకి అవతలి పక్కనుంచి ఆర్తనాదాలు వినిపించాయి. రాణా అటు వెళ్ళాడు. అక్కడంతా చిన్న చిన్న పాకలు, కొట్లు వున్నాయి. వాటినెవరో తగులబెట్టారు. రోజుకి పది, ఇరవై సంపాదించుకునే చిన్న చిన్న దుకాణాదారులు వాళ్ళు ఇక జీవితంలో పైకి లేవకుండా వాళ్ళ జీవనాధారాలు తగలబడిపోతున్నాయి. రాణా మొహం ఆ మంటలకన్నా ఎర్రగా మారింది. 'గవర్నమెంట్ - బ్లడీ గవర్నమెంట్' అనుకున్నాడు.    
    చెంగయ్య దుకాణం దగ్గర పరిస్థితి మరీ దారుణంగా వుంది. పోలీసులు మామూలు జనాన్ని లాఠీ చెయ్యగలరు. చెదరగొట్టగలరు. కానీ ఒక పోలీసు తన ఉద్యోగరీత్యా పొందే ట్రైనింగ్ కన్నా, ఒక ప్రొఫెషనల్ గూండా ఇటువంటి పనుల్లో ఎక్కువ ఆరితేరి వుంటాడు. వాళ్ళ దగ్గరవున్న బరిసెలు, కత్తుల ముందు-పోలీసుల బోయినెట్స్ ఆగలేవు. ఫైరింగ్ కి పైనుంచి ఆదేశాలు లేవు. గూండాలదే పైచెయ్యి అయింది. విజయవిహారం చేసి వాళ్ళ జీపు ఎక్కారు. కొందరు జనంలో కలిసిపోయి మరో బజారు వైపు సాగిపోవడానికి ఉద్యుక్తులవుతున్నారు.    
    ఆ సమయానికి పాకల మధ్యనుంచి నడుస్తూన్న రాణా కాళ్ళకింద తడి పైకి లేచింది. తెల్లగా వుండడంతో రాణా ఆగాడు.    
    మజ్జిగ!    
    అతడు తల తిప్పి చూశాడు.    
    కుండ పగిలి మజ్జిగ ధారగ ప్రవహిస్తోంది. ఆ తెల్లటి మజ్జిగతో పాటు ఎర్రగా చారలు చారలుగా- రక్తం.   
    ముసలవ్వ ముందుకు కూలిపోయి వుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS