Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 6


    "పోనీ ఇంకేదయినా లోన్ ఇస్తారా?"
    "ఏదీ ఇవ్వం"
    "ఐనాగానీ మీసేవ కోసమే మా బ్యాంక్ అని పేపర్లో వేయిస్తారు"
    "ఔను. మేముందందుకే మరి"
    "ఆ విషయం న్యూస్ పేపర్లలోనూ, టీవీలోనూ, రేడియోలోనూ పబ్లిసిటీ చేసేందుకు అయ్యే ఖర్చు మా లాంటివాళ్లు బోలెడుమంది నిజమైన సేవ చేసేందుకు ఉపయోగపడుతుంది కదా?"
    "పడుతుందిగానీ, పబ్లిసిటీ కోసం బడ్జెట్ లో ఎక్కువ మొత్తాన్ని కేటాయించడం వల్ల అవి దానికే ఖర్చుచేయాలిగానీ, ఇంకొక హెడ్ కి ఖర్చు చేయగూడదని స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ ఉన్నాయ్"
    రామ్ గోపాల్, ప్రసూనాంబ లేచి నిలబడ్డారు.
    "పద పోదాం! వీళ్ళు చేసేది సేవకాదు. కస్టమర్ల భరతం పడ్తారు" అన్నాడు రాంగోపాల్.
    "మీకే సహాయం కావాలన్నా ఎప్పుడూ మా బ్యాంక్ ని గుర్తుంచుకోండి. కేవలం ప్రజలను సేవించటమే మా ధ్యేయం" చిర్నవ్వుతో అన్నాడు మేనేజర్.
    "అదేమిటి? ఇప్పుడేగా మాకెలాంటి సహాయమూ చేయలేను అన్నారు?"
    "ఇది కర్టెసీ వీక్ లెండి. కస్టమర్స్ తో చాలా వినయ విధేయతలతో లౌక్యంగా, ప్రేమగా మాట్లాడాలని చాలా స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ వచ్చాయ్ నిన్నే- కర్టసీ వీక్ కోసం రెండొందల కోట్ల బడ్జెట్ కూడా ఇచ్చారు."
    ఇద్దరూ నగలన్నీ తీసుకెళ్లి మార్వాడీ దగ్గర వందకు నెలకు ఐదు రూపాయల వడ్డీకి తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు.
    ఇంటి పని మరికొంత జరిగి మళ్ళీ ఆగిపోయింది. రామ్ గోపాల్ స్నేహితులందర్నీ అప్పు అడిగాడు. అందరూ "నెలరోజుల క్రితం అడిగితే ఇచ్చి వుండేవాళ్ళం" అన్నారు. మరికొంతమంది "నిన్న ఎందుకడగలేదు?" అన్నారు.
    "సాయంత్రమయ్యేసరికి కూలివాళ్ళు కూలీకి వస్తారండీ! ఏమిటి చేయడం?" అంది ప్రసూనాంబ ఆందోళనగా. రామ్ గోపాల్ కేమీ తోచలేదు. ఇద్దరికీ ఆపూట ఆకలి కూడా వేయలేదు. అందుకని భోజనం చెయ్యలేదు.
    "పోనీ మన టీవీని అమ్మేసేద్దామా?" అడిగాడతను.
    ప్రసూనాంబ విరుచుకుపడింది.
    "ఎన్నో అవస్థలుపడి వాయిదాల పద్ధతిలో కొనుక్కున్నాం! ఇప్పుడు దానిని అమ్మేస్తే ఇంకెప్పటికీ కొనలేము. నా శవం మీద నుంచే ఆ టీవీని తీసుకెళ్ళాల్సి ఉంటుంది"  అంది.
    మరో గంట తర్వాత ఆమే అతనికి సాయంపట్టి టీవీని ఆటోలోకి చేర్చింది.
    రెండు రోజులు మరికొంత పని జరిగింది. మూడో రోజు పెళ్ళయిన కొత్తలో ప్రసూనాంబ మీద ప్రేమతో రామ్ గోపాల్ కొనిచ్చిన టేప్ రికార్డర్ అమ్మేశారు. ఆ తరువాతి వారంలో డైనింగ్ టేబిల్ ని పక్కింటి వాళ్ళే కారుచవకగా కొనేసుకున్నారు.
    మర్నాడు ఆ పక్క కాలనీలోని ముసలాళ్ళు ఇద్దరు వచ్చారు వాళ్ళింటికి.
    "మీరు ఇళ్ళు కడుతున్నారని తెలిసింది. సాధారణంగా ఇల్లు కట్టే వాళ్ళ సామాన్లన్నీ అమ్మేస్తూంటారని మాకు తెలుసు. అందుకే ఏమయినా సామాను అమ్మితే చౌకగా కొనుక్కెళదామని వచ్చాం" అన్నారు వాళ్ళు.
    రామ్ గోపాల్ ప్రసూనాంబ వేపు చూశాడు.
    ప్రసూనాంబ ఇల్లంతా కలయజూసింది.
    "మనం కొద్దిరోజులు చాపమీద పడుకుందాంలెండి" అంది డబుల్ కాట్ వైపు చూస్తూ.
    ఆ మంచాలు రెండూ రిక్షాలో తీసుకు వెళ్ళిపోయారు ఆ ముసలి వాళ్ళు.
    ఆ మర్నాడు సాయంత్రం రామ్ గోపాల్ ఇంటికి తిరిగొస్తుంటే, తమ ఇంటిలోనుంచి ఓ వ్యక్తి తమ బొచ్చు కుక్కపిల్లను చంకలో పెట్టుకొని తీసుకెళ్లడం కనిపించింది.
    ఛటుక్కున అతని చొక్కా పట్టుకున్నాడు రామ్ గోపాల్.
    "మా కుక్క పిల్లను ఎత్తుకుపోతున్నావ్ కదూ?"
    "కాదండీ! మీ మిసెస్ దీనిని ఆరువందలకు మాకు అమ్మేశారు"
    రామ్ గోపాల్ కి కోపం చచ్చిపోయింది.
    నీరసంగా ఇంట్లోకి చేరుకున్నాడు.
    ఓ పక్క పిల్లలు ఏడుస్తున్నారు.
    "మాకా పాడు ఇల్లు వద్దు. జూలీయే కావాలి" అంటూ.
    ప్రసూనాంబ మరోపక్క ఓ ముసలతనితో మాట్లాడుతోంది. "ఇల్లంతా చూశానమ్మా! మీరు చేసిన తప్పేమిటంటే ఈస్ట్ లో ఖాళీస్థలం ఎక్కువ వదల్లేదు. అందుకనే మీ ఇల్లు పూర్తికావటంలేదు" అన్నాడతను. అంటే మేమేం చెయ్యాలంటారు?"
    "బాత్రూమ్ ఒకటుందికదా! అది పడగొట్టేయండి"
    మర్నాడే బాత్ రూమ్ ను పడగొట్టేశారు వాళ్ళు.
    ఆ రోజు ఇంకో వాస్తుశాస్త్రజ్ఞుడిని ఖమ్మంనుంచి తీసుకొచ్చాడు ప్రసూనాంబ తండ్రి. అతను ఇల్లంతా చూసి "ఇరవై నాలుగు గంటల్లో మెట్లు పడగొట్టేయకపోతే ఇంటి ఓనరు ఠా" అన్నాడు.    
    "ఈ నిజామాబాదోళ్ళు అంతేనమ్మా! అన్నీ ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు" అన్నాడాయన.
    ఆ రాత్రి నిజంగానే జ్వరం వచ్చింది రామ్ గోపాల్ కి. జ్వరం వెంటనే తగ్గితే మెట్లు పడగొట్టేస్తానని వెంకటేశ్వరస్వామికి మొక్కుకుంది ప్రసూనాంబ. తెల్లవారేసరికి అతని జ్వరం తగ్గిపోయింది. వెంటనే మెట్లు పడగొట్టించడానికని ఇంటిదగ్గరికి చేరుకునేసరికి ఆ దారిన వెళుతున్న మరో వాస్తుశాస్త్ర విశారదుడు లోపలికొచ్చి "మెట్లు అలా ఉండడం వల్లే మీరు బతికి బయటపడ్డారు లేకపోతే ఎగిరిపోయేవారే" అన్నాడు.
    "అట్లనా? అయితే మరి మేము ఇల్లు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాం?" అనడిగాడు రామ్ గోపాల్.
    "ముందు హాల్లో దోషం వుంది మెయిన్ డోర్ గోడతో మూసి పారేసేయండి"
    "మరి హాల్లోంచి బయటకు వెళ్ళేదెలా?"
    "వంటింట్లో నుంచి రాకపోకలు పెట్టుకోండి!"
    "అదేమిటి? ఇంటి వెనుక నుంచా?"
    "అవును- అలా చేయకపోతే ఇంటావిడ ఠా!" అన్నాడతను.
    ఆ రాత్రి ప్రసూనాంబకు గుండెనొప్పి వచ్చింది. వెంటనే రామ్ గోపాల్ ఆ హాల్ మొత్తం మూసివేస్తానని యాదగిరి గుట్ట నర్సింహుడికి మొక్కుకున్నాడు. తెల్లారేసరికి రామ్ గోపాల్ తండ్రి నిజామాబాద్ నుంచి మరో వాస్తు శాస్త్రజ్ఞుడిని తీసుకొచ్చాడు.
    "బెడ్ రూమ్ పడగొట్టేసి, అక్కడ పూజ గది కట్టండి" అన్నాడతను. "అలా చేయకపోతే భార్యాభర్తలు ఇద్దరూ ఠా" అన్నాడు అతను.
    రామ్ గోపాల్ కి పిచ్చెక్కిపోయినట్లయింది.
    ఆ రాత్రి ప్రసూనాంబ భోరున ఏడ్చేసింది.
    "మా నాన్నగారు ముందే చెప్పారండీ, నిజామాబాద్ జిల్లా వాళ్ళు వట్టి ఆరంభ శూరులు, ఏ పని పూర్తిగా చేయరు అని" అందామె.
    రామ్ గోపాల్ కు కోపం వచ్చింది. ఆమె చెంప ఛెళ్ళుమనిపించాడు.
    ప్రసూనాంబ మళ్ళీ అతని చెంప ఛెళ్ళుమనిపించింది.
    "నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఇలా పెళ్ళం మీద చేయి చేసుకున్నప్పుడు తిరిగి చేయి చేసుకోవాలని కూడా మా నాన్నగారు అప్పుడే చెప్పారు."    
    ఆ మర్నాడు ఉదయం ఏడు గంటలకు ఖమ్మం జిల్లా భార్య, నిజామాబాద్ జిల్లా భర్త గేటు దగ్గర నిలబడి న్యూస్ పేపర్ కుర్రాడు విసిరేసిన న్యూస్ పేపర్ని అమాంతం అందుకుని ఆత్రుతగా "అమ్మకాల' పేజీ చూశారు.        
    "ఇంచుమించుగా కట్టడం పూర్తయిన, అందమయిన ఇల్లు అమ్మకానికి వుంది. వాస్తుశాస్త్రం, తర్కశాస్త్రం, ఇంకా అయిదారు పేరు తెలీని శాస్త్రాలకు అనుగుణంగా మలచబడిన ఈ ఇంటి ఓనర్లు అర్జంటుగా విదేశాలకు వెళ్ళవలసి రావడం వల్ల అతి కారుచౌకగా ఈ ఇల్లు అమ్మేయాలని నిశ్చయించుకున్నారు. కావలసినవారు వెంటనే ఈ కింది చిరునామాతో సంప్రదించవలసిందిగా కోరుతున్నాం."
    ఆ ప్రకటన చూస్తూనే ఆనందంతో పొంగిపోయింది ప్రసూనాంబ.
    "ఏవండోయ్! చూశారా! ఇదిగో ఎంత బాగుందో మన ఇంటి ప్రకటన!" అంది తన్మయత్వంతో. రామ్ గోపాల్ మనసు కూడా ఆ ప్రకటన చూసి ఊరడిల్లింది.
    "మనం మనుషులుగా బ్రతకినికి అవసరమయిన వస్తువులన్నీ మళ్ళీ కొనుక్కుని ఖుషీగా కలో గంజో తాగి ఇజ్జత్ తోటి జిందగీ గుజరాయిద్దాం ప్రసూనా! ఈ ఫాల్తూ ఇల్లు మనకొద్దు! మన్లాంటి మిడిల్ క్లాసోడికి గసంటి కలలు గిట్ట రావొద్దు" అన్నాడతను.
                                                 *  *  *  *  *


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS