Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 5

   ప్రసూనాంబ ముఖం పాలిపోయింది.
    "పదండి, ఇంటికెళదాం" అంది దిగులుగా.
    ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు మళ్ళీ మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు రామ్ గోపాల్ పడక కుర్చీలో కూర్చుని.
    "కహతా హై జోకర్ సారా జమానా..." పాట వినబడుతోంది.
    బయట స్కూటర్ హారన్ మోగింది. ఇంటి ఓనర్ ఇంజన్ ఆఫ్ చేయకుండానే మాట్లాడాడు.
    "ఈ నెల నుంచీ అద్దె ఎనిమిది వందలు. గుర్తుందో లేదోనని వార్నింగివ్వటానికొచ్చా" అనేసి వెళ్ళిపోయాడు. రామ్ గోపాల్ కి కోపం వచ్చేసింది.
    "ఎనిమిది వందలు- ఈ ఫాల్తూ ఇంటికి ఎనిమిది వందలా? నేనివ్వ! ఏడొందలు కంటే ఒక్కపైస గూడా ఎక్కువివ్వ" అని గావుకేక వేశాడు.
    ఆ రాత్రి అతనికి జ్వరం వచ్చింది. ప్రసూనాంబ కన్నీరు పెట్టుకుంది "మీ నిజామాబాద్ జిల్లా వోళ్ళు ఇలాగే ఆవేశపడి కొంపలు మీదకు తెచ్చుకుంటారని మా నాన్నగారు ముందే చెప్పారండీ" అంది జాలిగా.
    "చూడండీ! అనవసరంగా డాక్టర్ కి యాభై కట్టాల్సి వచ్చింది. ఎంత నష్టం? అదే ఇంటికి ఓ కిటికీ వచ్చేది"
    మర్నాడు ఆఫీసు కెళ్ళేసరికి గుమాస్తాలందరూ రామ్ గోపాల్ చుట్టూ మూగిపోయారు.
    "కంగ్రాచ్యులేషన్ గురూ" అన్నాడు రామానుజాచారి.
    "ఎందుకు? నాకు ప్రమోషన్ ఏమైనా వచ్చిందా?" ఆశగా అడిగాడు రామ్ గోపాల్.
    అందరూ ఆ జోక్ కు పగలబడి నవ్వారు.
    "బలేవాడివేలే, సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రమోషనా? ఇంకా నయం! నీకు ఇంటి లోన్ శాంక్షన్ అయినట్లు లెటర్ వచ్చింది." దభేల్ మని కిందపడ్డాడతను.
    రామ్ గోపాల్ ను స్పృహ తప్పిన మిగతావాళ్ళ పక్కన పడుకోబెట్టారు వాళ్ళు. సాయంత్రానికల్లా అందరూ లేచి కూర్చున్నారు.
    "అదేమిటి?" సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ లోన్ శాంక్షన్ అవదుగా అసలు?"
    "ఎక్కడో ఏదో పొరబాటు జరగడం వల్ల లోన్ శాంక్షన్ అయుంటుందని మన బాస్ కూడా అన్నారు. నువ్వు ఆలస్యం చెయ్యకుండా వెంటనే డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి లోన్ తీసేసుకో. లేకపోతే ఓ క్షణంలోనైనా ఎర్రర్ రిగ్రెటెడ్ అని టెలెక్స్ మెసేజ్ రావచ్చు-"
    రామ్ గోపాల్ మెరుపువేగంతో బయటకు పరుగెత్తాడు. వారంరోజుల్లో ఇంటి లోన్ తాలూకూ చెక్కు తీసుకొచ్చి ప్రసూనాంబకు చూపించాడతను. ప్రసూనాంబ కన్నీరు పెట్టుకుంది.
    "మా నాన్నగారు ఈ మాట కూడా ముందే చెప్పారండీ! నిజామాబాద్ జిల్లా వోళ్ళు అనుకున్నది ఎప్పటికైనా సాధిస్తారని, ఆ ఒక్కటీ వాళ్ళ దగ్గర మంచి గుణం ఉందని అంటూండేవాళ్ళు" అంది ఆనందంగా.
    ఆ మర్నాటినుంచీ నెల రోజులు సెలవుపెట్టి ఇంటి పని ప్రారంభించాడతను. పొద్దున్నే తన మోపెడ్ వేసుకుని తాపీ మేస్త్రీ ఇంటికి చేరుకున్నాడు. ఎవడో ఇల్లు కట్టిన ఫ్రెండ్ ఇచ్చాడా అడ్రస్. ఓ పెంకుటిల్లది. ఇంటి ముందున్న జీప్ అప్పుడే స్టార్టయింది. ఫ్రంట్ సీట్లో కూర్చున్న వ్యక్తి జీప్ ఆపించి, రామ్ గోపాల్ వేపు ప్రశ్నార్థకంగా చూశాడు.
    "ఎవళ్ళు కావాల్సార్?"
    "అంజయ్య మేస్త్రి"
    "నేనే సార్! ఏం గావాలి?"
    "మా ఇల్లు కట్టాల"
    అతను జేబులోనుంచి ఓ కాగితం తీసి రామ్ గోపాల్ కిచ్చాడు.
    "అది నా రేట్స్ కొటేషన్ సార్! సరేననుకుంటే నాకు ఫోన్ జేయండ్రి! రేపే పని షురుజేస్త. ఇంటి ఫోన్ నెంబర్ కూడా అందులోనే రాసున్నది"
    అతని జీప్ వెళ్ళిపోయింది.
    రామ్ గోపాల్ నిశ్చేష్టుడైపోయాడు.
    తాపీ మేస్త్రీ ఒక జీప్ మెయింటెయిన్ చేస్తున్నాడా? అతనింటికి ఫోన్ కూడా ఉందా? మోపెడ్ స్టార్ట్ చేసుకుని వడ్రంగి మేస్త్రీ ఇంటికి చేరుకున్నాడు. అతని భార్య తలుపు తీసింది.
    "వడ్రంగి మేస్త్రీ ఉన్నాడామ్మా?"
    "లేడు. ఎయిర్ పోర్ట్ కి పోయిండు"
    "ఎయిర్ పోర్టుకా? ఎందుకు? అక్కడేమయినా వడ్రంగి పని చేస్తున్నాడా?"
    "కాద్సార్! మా పోరడు పెద్ద సదువులకు అమెరికా పోతుండు. సెండాఫ్ ఇయ్యడానికి పోయిండు."
    రామ్ గోపాల్ కు మతి పోయినట్లయింది.
    "సరే! అయితే మళ్ళీ వస్తాలే. నేను ఇల్లు కడుతున్నా! దానికి కార్పెంటరీ పని గురించి మాట్లాడాని కొచ్చినా"
    "ఏ టైమ్ కొస్తవో జెప్తే బుక్ లో రాస్తా సార్! లేకుంటే ఇంటి దగ్గరుండడు. చాలా బిజీగుంటడు."
    "అట్లనా! దినాలట్లున్నయ్, సాయంత్రం ఆరు గంటల కొస్తానన్జెప్పు"
    "ఈ బుక్ లో టైమూ, నీ పేరూ అడ్రసూ రాయ్ సార్"
    రామ్ గోపాల్ పుస్తకంలో రాసిచ్చాడు.
    మర్నాడు పని ప్రారంభమైపోయింది. కూలీలు వచ్చి పునాదులు త్రవ్వడం ప్రారంభించారు. వాళ్ళందరికీ సాయంత్రమయ్యేసరికి కూలీ డబ్బు ఇస్తోంటే చాలా గర్వంగా, ఓ విధమైన థ్రిల్లింగ్ గా ఉందతనికి. ఎప్పుడూ కాషియర్ ముందు నిలబడి జీతం తీసుకోవడం, ఆఫీసర్ ముందు చేతులు కట్టుకుని నిలబడి చెప్పిన పనులు చేయడమేగానీ, పదిమందిని ఆజ్ఞాపించే అవకాశం, వాళ్ళకు జీతాలిచ్చే స్టేటస్ అనుభవించలేదు.
    మామూలుగానే ఇంటికి స్లాబ్ పడేసరికి అతనికి శాంక్షన్ అయిన లోన్ అంతా ఖర్చయిపోయింది.
    "అదేమిటండీ! ఇల్లంతా పూర్తవడానికి సరిపోయేంత లోన్ ఇచ్చారు కదా వాళ్ళు? అప్పుడే ఎలా అయిపోయింది?" గాబరాగా అడిగింది ప్రసూనాంబ.
    "మనం లోన్ అప్లయ్ చేసి ఐదేండ్లయిపాయె. అప్పటి బడ్జెట్ ప్రకారమైతే సరిపోతుందే కానీ, ఇప్పుడు ఇంటికి కావల్సిన వస్తువుల ధరలన్నీ డబుల్ ఐపాయె. ఇంకేడకెళ్ళి సరిపోతది?
    "మరిప్పుడేం చేద్దాం? మధ్యల ఆపుతే అటూ ఇటూ కాకుండా ఐపోతాం గదండీ! జీతంలో ఇంటి అప్పు తెగుతూంటుంది. ఇటు ఇంటి అద్దెకూడా కట్టుకుంటూండాలి"
    ఇద్దరూ రాత్రంతా నిద్రలేకుండా ఆలోచించారు. ఉదయం ఆమె మెడలో నగలన్నీ బ్యాంక్ కు తీసుకెళ్ళాడతను.
    "నగలు తాకట్టు పెట్టుకోవటం మానేశాం. గోల్డ్ లోన్ మీద బాన్ ఉంది" అన్నాడు మేనేజర్ చిరునవ్వుతో.
    "నేను పదేళ్ళనుంచీ మీ కష్టమర్ని సార్! ఇలాంటి కష్ట సమయంల మదద్ జేయకుంటే ఎట్ల సార్? మీ సేవకోసమే మా బ్యాంక్ అని టీవీలో పబ్లిసిటీ గూడా జేస్తున్రుగద్సార్"
    "మీ సేవకోసమే మా బ్యాంక్ అన్న మాట నిజమేగానీ, గోల్డ్ లోన్ ఇవ్వం"
    "పోనీ ఓడీ ఇస్తారా?"

"ఇవ్వం"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS