Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 4

    అందరూ పిలిచేది.... అతను పలికేది రాంగో!
   
    ఆ పేరంటే అతనికి చచ్చేంత ఇష్టం....ఎందుకంటే ఆ పేరు గలవాడు ఇండియాలో అతనొక్కడే! ఆ పేరుతో గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలనే కోరికా లేకపోలేదు.
   
    వాళ్ళిద్దరి మధ్యకు కుర్చీ లాక్కుని కూర్చుంటూ మొదలుపెట్టింది బామ్మ.
   
    బామ్మకు అరవైదాటి ఆర్నెల్లయింది. భర్తపోయి చాలా సంవత్సరాలైంది. వున్న ఒక్కగానొక్క కొడుకు కోడలితో దుబాయ్ లో వుంటున్నాడు. పదహారేళ్ళ మనవరాలు జాజిబాల సంరక్షణ భారం మాత్రం ఆమెపై వున్నది.
   
    "నేను చెబుతున్నది వింటున్నారా?"
   
    "వింటున్నాం...చెప్పండి..."
   
    "ఏం వింటున్నారు.... అసలు ఈ లోకంలోనే లేరు.... కాస్త చెవులు ఇటు పడేయండి.... మళ్ళీ మొదటి నుంచి చెబుతాను..."
   
    'హతోస్మి' విషయం పూర్తిగా వినేదాకా వందసార్లయినా ఓపిగ్గా చెప్పగలదు.... తనలో తనే నిట్టూర్చాడతను.
   
    పబ్లిక్ గా నిట్టూరిస్తే దానితో అందమయిన అనుభవం చెప్పి ప్రాణాలు తోడేస్తుంది బామ్మ.
   
    జాజిబాల ముసిముసిగా నవ్వుతోంది.
   
    బామ్మ చెప్పడం ఆరంభించింది.
   
    రాంగో ఈసారి శ్రద్దగా వినసాగాడు.
   
    "ఆ రోజు శివరాత్రి.... నాకు పద్నాలుగు వచ్చాయోలేదో....కోటప్పకొండకు ఆయనతోపాటు బయలుదేరాను. జనం ఇసుకవేస్తే రాలనంతగా వచ్చారు. అప్పుడే ఊరికి కొత్తగా కరెంటు వచ్చింది. కరెంటు బల్బులతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. నా చేయి పుచ్చుకుని ఆయన బర బర ఈడ్చుకుపోతున్నాడు.
   
    "ఆయన ఆజానుబాహుడు....ఆరడుగులు వేసి ఆయన అడుగుల్లో చేరుకుంటున్నాను. ఆయన బుర్రమీసాలు ఇంతవరకూ ఎవరికీ లేవు. ఆయన ముఖానికి బాగా కొట్టొచ్చినట్టు కనబడే అందం ఆ మీసాలే.... ఆ మీసాల గురించి వేరే కథ వుందిలే.."
   
    "హమ్మయ్య....బ్రతికించారు..."
   
    "ఏమిటీ అంటున్నావ్?"
   
    "బాగా చెప్పారు....అసలు కథ పూర్తి చేయండి అంటున్నాను...."
   
    రాంగో తన అసహనాన్ని కవర్ చేసుకుంటూ అన్నాడు. జాజిబాల నవ్వుతోంది.
   
    ఆ నవ్వు నిశ్శబ్దంగా....నిండు నదిలో సన్నని వాన తుంపరలు పడినంత నాజూకుగా వున్నది...అలా నవ్వడం ఆమె ప్రత్యేకత!
   
    ప్రతి సందర్భంలోనూ జాజిబాల అదే నవ్వు కంటిన్యూ చేయడం రాంగో భరించలేక పోతున్నాడు.
   
    ఆ విషయమే చెప్పాలను కుంటున్నాడు కానీ.... అసలు నవ్వడమే మానివేస్తుందేమో నన్న భయంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు.
   
    అసందర్భపు వేల ఆమె నవ్వితే మాత్రం.... దాని తాలూకు చికాకు రెండు క్షణాలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది.
   
    బామ్మకు వుండీ వుండీ మూడ్ ఫాస్టెన్సు లో ఫంక్షనింగ్ మొదలుపెడుతుంది. అపుడు తప్పకుండా తాతకథ దూరదర్శన్ లోని సీరియల్ లా పెల్లుబికి వచ్చి గొంతు పట్టుకుంటుంది.
   
    "ఏమిటీ మీరిద్దరూ... ఏదో ఆలోచనలో వున్నట్టున్నారు?" బామ్మ అనుమానంగా కొశ్చన్ వేసేసరికి ఇద్దరూ అలర్ట్ అయ్యారు.
   
    "అదేమీ లేదుకానీ... మీరు చెప్పడం కంటిన్యూ చేయండి బామ్మగారూ...." బలవంతంగా రాణి నవ్వుని ముఖాన పులుముకుంటూ చెప్పాడు రాంగో.
   
    అదే రాంగోలో వున్న టెక్నిక్....
   
    ఆ టెక్నిక్ తోనే పదహారేళ్ళకే ఇంటర్ లో గిరికీకొట్టి ఏకంగా చదువుకే తిరుపతి నామం పెట్టేసి....దూరపు బంధువు వరసకు మామయ్య రాజేంద్రప్రసాద్ ఫైనాన్స్ కంపెనీలో క్లర్క్ గా జాయిన్ అయ్యాడు.
   
    అతని తల్లిదండ్రులు గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో వున్న ఒక పల్లెటూరిలో వుంటారు.
   
    రాంగో మాత్రం ఒంటరిగా జాజిబాల ఇంటిపైన ఉన్న సింగిల్ రూమ్ లో సింగిల్ గా వుంటున్నాడు....
   
    ఆరు నెలల క్రితమే ఒకళ్ళపైన ఒకళ్ళకు ఆకర్షణ కలిగింది.
   
    టీనేజ్ లవ్ తీవ్రస్థాయిలో వాళ్ళిద్దరి ప్రతి అణువణువులోనూ ప్రవహిస్తున్నది.
   
    "ఎంతవరకు చెప్పాను....?"
   
    అసలు మొదలు పెట్టనేలేదు కథకు మధ్యలో కొశ్చన్స్...సన్నగా గొణుక్కుంటూ అన్నాడు రాంగో.
   
    "నాకు నిద్ర వస్తున్నది బామ్మా..." జాజిబాల అమాయకంగా మొహం పెట్టి అన్నది.
   
    "నాన్సెన్స్.... నేను కధ మొదలుపెట్టి పెట్టగానే నువ్వు ప్రతిసారీ నిద్ర వస్తుందంటూ తప్పించుకు వెళ్ళిపోతున్నావు. దిసీజ్ టూమచ్... ఈ రోజు పూర్తి కథ వినవలసిందే" ఆర్డర్ జారీ చేసింది బామ్మ.
   
    "ఇంట్రస్ట్ గా 'వూ' కొట్టి వినడానికి రాంగో వున్నాడుగా..." అతనివైపు అదోలా చూస్తూ చెప్పింది జాజిబాల.
   
    "అదేం కుదరదు బామ్మగారూ.... ప్రతిరోజు మీరు ఇలాంటి మూడ్ తో మా మైండ్ లోకి ఎంటరై మీరు చెలరేగిపోయి తాతగారి సిరీస్ లోని ఒకో ఎపిసోడ్ ను రిలే చేస్తున్నప్పుడు మధ్యలోనే జాజిబాల నిద్రాదేవి ఒడిలో హాయిగా పవళించడం జరుగుతుంది. ఎట్టకేలకు మీ ఎపిసోడ్ పూర్తయ్యేసరికి అర్దరాత్రి అవుతుంది మర్నాడు ఆఫీసులో నేను కునికిపాట్లు పడడం.... ఇదేమీ బాగోలేదు.."
   
    "అయితే ఇప్పుడేమంటావ్?"
   
    "జాజిబాల కూడా ఈ రోజు మెలకువగా వుండాల్సిందే...."
   
    "తప్పదా?"
   
    "తప్పదు..."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS