Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 4

    మిగిలిపోయిన భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. "నా ఖర్మ" అంటు కసిగా తలకొట్టుకుని ఏడ్చింది మీనాక్షి.
    "ఛీ!" అని ఛీత్కారం చేశాడు జయపాల్. ఎత్తుల పైన ఎత్తులు వేసి తన ప్రత్యర్ధులను ఎప్పటికప్పుడు చిత్తు చెయ్యగలుగుతున్నాడు. రకరకాల వుపాయాలతో ఇన్ కంటాక్స్ లు ఎగ్గొట్టి, కొత్త కొత్త బ్రాంచీలలో వ్యాపారాన్ని వృద్దిచేసి డబ్బు కూడబెట్టగలుగుతున్నాడు. ఆ డబ్బుతో పలుకుబడి సంపాదించి హోదా పెంచుకోగలుగుతున్నాడు. కానీ, కన్నకొడుకును అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు, హిరణ్యకశివుడికి ప్రహ్లాదుడిలా తయారయ్యాడు నీరద్. తన పాలిటికి కన్నకొడుకు తన దారిలోకి రావటం లేదనే ప్రేమకంటే అతని కారణంగా తన పేరు ప్రఖ్యాతులు దెబ్బతింటాయనే ఆరాటమే ఎక్కువ__
    జయపాల్ కొడుకు క్లబ్ లలో డాన్స్ చేస్తున్నాడంటే తనకెంత అప్రతిష్ట! ఛీ! ఛీ! పిడికిలి బిగించి డైనింగ్ టేబుల్ మీద గట్టిగా గుద్దాడు. ఆ దెబ్బకు ట్రేతో ఫలహారం తెస్తున్న బట్లర్ నిలువునా వణికిపోయాడు.
    ఆరు పడకగదులున్న పెద్ద బంగళా అది- ఉండేదిమాత్రం ముగ్గురే! జయపాల్ కి ఒక ఏ.సి.రూమూ. మామూలు పడకగది రెండు ఉన్నాయి. మీనాక్షికీ, నీరద్ కీ ఎవరి గదులు వారికున్నాయి - విశాలమైన కాంపౌండ్. ఒకపక్క లాన్, మరొకపక్క పూలమొక్కలు, వెనుకవైపు కిచెన్ గార్డెన్ ఔట్ హౌస్, సర్వెంట్ క్వార్టర్స్, విడిగా తోటమాలి, వంటవాడు, స్వీపరూ అటెండరూ, ఆయా, పనిమనిషి ఇలా ముగ్గురికీ ఆరుగురికంటె ఎక్కువగానే ఉన్నారు పనివాళ్ళు. జయపాల్ కి ఒక కూతురుంది-మరో లక్షాధికారితో పెళ్ళయిపోయింది. కూతురు అల్లుడు ఎప్పుడు వస్తే అప్పుడు ఉండటానికి అన్నివేళలా రెండు గదులు అన్నిహంగులతో శుభ్రపరిచి సిద్ధంగా ఉంటాయి.
    జయపాల్ కి ఎప్పుడూ ఒకటే ధ్యాస. డబ్బు ఇంకా ఇంకా ఎలా సంపాదించాలా అని. డబ్బు తక్కువైకాదు, అది అతని రక్తంలో లీనమయిఉన్న ప్రవృత్తి. అవసరాలకు మించి డబ్బు సంపాదించేవాళ్ళకుండే వ్యసనాలన్నీ అతనికి ఉన్నాయి. ఖరీదైన హాట్ డ్రింక్స్ - అమ్మాయిలు - ఇవన్నీ -ఈ స్త్రీ వ్యసనంలోనూ కాల్ గరల్స్ అతనికి పనికిరారు. అందమైనవాళ్ళు, మంచివాళ్ళు, తనతో తప్ప మరొకరితో సంబంధం పెట్టుకోనివాళ్ళు కావాలి__అలాంటి గర్ల్ ఫ్రెండ్స్ ని చాలామందినీ సంపాదించుకున్నాడు అతను. అతనికి మోజున్నంతకాలమూ ఆ గర్ల్ ఫ్రెండ్ ని అందలమెక్కిస్తాడు. మోజు తీరగానే ఇక ఆ పిల్ల ముఖమయినా చూడడు__నల్లటి నలుపు, పెద్ద బొజ్జ, బట్టతల, ఎర్రటి కళ్ళు, వంకర నవ్వు - అదీ అతని ఆకారం, అయినా అతడు ఎంతో అందమయిన ఆడవాళ్ళను తప్ప ఎంచుకోడు - మొదట్లో మీనాక్షిని కూడా ఆవిడ అందం చూసే పెళ్ళిచేసుకున్నాడు. ఇప్పటికీ మీనాక్షి అందమైనదే! కానీ నాలుగు పదులు నిండి పాతబడిన ఆ అందం ఇప్పుడతనికి పనికిరానిదయింది. నీరద్ పూర్తిగా తల్లిపోలిక.

    సూట్ కేస్ తీసుకొని క్రిందకొచ్చాడు నీరద్. అదిచూచి మీనాక్షి గాభరాగా కొడుక్కి అడ్డుపడి "ఎక్కడికిరా?" అంది.
    "ఈ ఇంట్లోంచి పోతున్నాను."
    "నీరద్! ఏమిటిరా ఇది? నువ్వుకూడా దూరమయితే యెలా బతకనురా?"
    "నువ్వు కూడా నాతో వచ్చెయ్యి. నేను నిన్ను పోషించగలను."
    "నీరద్!" గతుక్కుమంది మీనాక్షి. ఒక్కక్షణం ఆవిడ మనసు తన పట్ల విశ్వాసంలేని భర్తను వదిలేసి స్వతంత్రంగా బ్రతకాలని ఉవ్విళ్ళూరకపోలేదు. కానీ తన భర్తది పాముపగ అని ఆవిడకు తెలుసు. అదీగాక ఇప్పుడు బయటకుపోయి తను అనుభవించే సుఖాలేమున్నాయి? ఇంత ఆస్థినీ, ఈ సంపదనూ యెందుకు వదులుకోవాలి? నీరద్ ది ఉడుకు రక్తం. ఏమీ తెలియదు.
    ఆరాటంగా నీరద్ రెండు చేతులూ పట్టుకొని "నీరద్! వెళ్ళకు నేను మీ నాన్నగారిని విడిచిరాలేను. నువ్వు వెళితే బ్రతకలేను." అంది అనునయంగా. "నేను మీ నాన్నగారిని విడిచిరాలేను" అంటున్న తల్లిని చిత్రంగా చూశాడు నీరద్! ఎందుకో ఆ మాటలలోకాని, ఆమాటలంటున్న తల్లి ముఖంలో కాని, సిన్సియారిటీ కనిపించలేదు అతడికి. ఆ విషయాలన్నీ ఆలోచించటం అతడికి వయసుకు మించిన పనైంది.
    "ఇప్పుడే చెప్తున్నాను. నేను డాన్స్ మానను, మాననంటే మానను" మొండిగా అన్నాడు.
    "నీ ఇష్టం. నీ యిష్టం వచ్చినట్టే చేద్దువుగాని, ముందు లోపలి పద!"
    నీరద్ తండ్రివంక చూశాడు. జయపాల్ కళ్ళు ఎర్రగా మండుతున్నా నోరువిప్పి ఒక్కమాట అనకుండా టిఫిన్ తీసుకోసాగాడు. ధన ధన ధనమని అడుగుల చప్పుడు చేసుకొంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు నీరద్.
                                        3
    లేబ్ లో నుంచి బయటికొస్తూ ఆడపిల్లలూ, మొగపిల్లలూ అందరూ గుమిగూడి ఉండటంచూసి కుతూహలంతో తను అటువైపు నడిచింది గీత. ఆ గుంపు మధ్య ఉన్నాడు నీరద్. అతడి మాటలకు దేనికో అందరూ పకపక నవ్వుతున్నారు. ఆడపిల్లలూ, మొగపిల్లలూ అందరూ అతడిని ఆరాధనతో చూస్తున్నారు. గీతనుచూసి గీత స్నేహితురాలు రాధ "రా! రా! ఇతను తెలుసా? వెస్టరన్ స్టయిల్ ఫేమస్ డాన్సర్- చాలా బాగా డాన్స్ చేస్తాడు" అని ముందుకు లాగింది. గీతను చూడగానే నీరద్ "హలో!" అన్నాడు. గీత ముఖం పాలిపోయింది. తిరిగి 'హలో' అనలేదు.
    "నేను మీ కోసమే ఇక్కడికొచ్చాను" ఛార్మింగ్ గా నవ్వుతూ అన్నాడు నీరద్.
    "ఎందుకూ?" 
    "ఎందుకూ? ఎందుకంటే అది చెప్పటానికే! కొంచెం అలా బయటికి వస్తారా?"
    "సారీ! నాకిప్పుడు క్లాసులున్నాయి."
    నీరద్ వేలుపైకెత్తి చూపించి "వన్ మినిట్!" అన్నాడు. గీత గిర్రున తిరిగి అక్కడినుంచి వచ్చేసింది. రాధ గీత వెనకాతలే పరుగులాటి నడకతో వచ్చి కలుసుకొని "గీతా! అతను నీకు తెలుసా?" అంది.
    "తెలుసు!"
    "హౌ లక్కీ! ఎలా తెలుసే!"
    "లక్కీయా?"
    "రియల్లీ లక్కీ! నేను అతణ్ణి ఎంత ఎడోర్ చేస్తానో తెలుసా! నేనేకాదు, ఆడపిల్లలు ఎంతోమంది అతణ్ణి ఎడోర్ చేస్తారు."
    "బట్ ఐ హేట్ హిమ్!"
    "ఆ!" అంటూ నోరు పెద్దదిగా తెరిచి బొమ్మలా నిలబడిపోయింది రాధ.
    "ఏయ్! ఏమిటీ?" రాధ భుజాలు పట్టుకొని కుదిపింది గీత.
    "ఓయ్ దేవుడోయ్! హేట్ హిమ్" అనేటంతవరకూ పెరిగిపోయిందా వ్యవహారం? ప్రేమాయణంలో అది క్లయిమాక్స్ ఛాఫ్టర్__ తెలుసా?"
    పకపక నవ్వింది రాధ. తన కోపం మరిచిపోయి నవ్వేసింది గీత- "ప్లీజ్, అతనెలా తెలుసో చెప్పవూ?" మళ్ళీ ప్రాధేయపడింది రాధ. గీత మనసంతా ఎలాగో ఐపోయింది. అతను తనకెలా తెలుసో, ఎవరికైనా ఎలా చెప్పగలదూ? రాధ వదిలేలా లేదు.
    "ఒకరోజు అతను బస్ స్టాప్ దగ్గిరున్న ఒకమ్మాయిని "లిఫ్ట్ కావాలా?" అని అడిగి కారులో ఎక్కించుకున్నాడు." 
    "నిజంగా? ఎంతమంచివాడు?"
    "ఫూల్! ఇంకా విను! దారిలో ఆ అమ్మాయి వంటిమీద చెయ్యేసి ఏదేదో మాట్లాడాడు. అందుకే అతనంటే అసహ్యం నాకు."
    "అదిసరే! అప్పుడా అమ్మాయి ఏం చేసింది? ఆ తరువాత ఏమైంది? ఇంతకూ అతడి కారులో ఏం జరిగిందో నీకెలా తెలుసు?"
    పకపక నవ్వింది రాధ. ముఖమంతా ఎర్రబడగా తడబడుతూ "తరువాత ఆ అమ్మాయి నాకు చెప్పింది. అతణ్ణి చెడామడా తిట్టి కారులోంచి దిగిపోయిందట!" అంది గీత.
    "వాట్ ఎ ఫూల్! అలాంటి ఛాన్స్ నాకొస్తేనా? ఇదంతా ఏ బస్ స్టాప్ దగ్గిరో చెప్పవూ? ఆటోలోవెళ్ళి ఆ బస్ స్టాప్ దగ్గిర నిలబడతాను- ఇంతకూ నువ్వు చెప్పింది నిజమేనా? లేక బుద్దిమంతుడిలా డ్రాప్ చేసేస్తాడా?" ఎర్రబడిన గీత ముఖం చేత్తో తనవైపుకు తిప్పుకుని అల్లరిగా నవ్వుతూ అడిగింది రాధ.
    "పో! నువ్వొక రౌడీవి" అని చేతిని తొలగించేసింది గీత.
    ఆ సాయంత్రం రాధ బస్ ముందుగా వచ్చింది. రాధ వెళ్ళిపోయింది. తన బస్ కోసం ఎదురుచూస్తూ గీత నిలబడింది - ఎంత వద్దనుకున్నా గీత ఆలోచనలన్నీ నీరద్ చుట్టూనే తిరుగుతున్నాయి. గాభరా, కోపం ఏదోచికాకూ వీతికన్నింటికీ అంతర్వాహినిగా ఏదో మాధుర్యం....హారన్ చప్పుడు చేస్తూ ఆగింది కారు. ఉలికిపడిన గీతను విండోలోంచి తల బయటకు పెట్టి 'హలో!' అని పలకరించాడు నీరద్. సమాధానంగా 'హలో!' అనటమూ కోపం తెచ్చుకోవటమూకూడా మరిచి బిత్తరపోయి నిలబడిపోయింది గీత.
    తలుపు తెరిచి 'ప్లీజ్, కమిన్!' అన్నాడు.
    అప్పటికీ అలాగే నిలబడిపోయింది కారు దిగి.
    గీత చెయ్యిపట్టుకొని తీసుకొచ్చి కారులో కూచోబెట్టుకున్నాడు. కారు స్టార్టయి ఒక ఫర్లాంగ్ దూరం పోయాక గీత మైకం వదిలినదానిలా గాభరాపడుతూ "ఏయ్! ఏమిటిది? కారు ఆపండి. నాకు లిఫ్ట్ అక్కర్లేదు" అంది.
    "సారీ మేడమ్! ఈ మాటలు మీరెప్పుడో అనవలసింది చాలా ఆలస్యం చేశారు. నేనేదైనా చెయ్యాలనుకుంటే, చేసేవరకూ స్థిమితపడను, నా కారు ఒకసారి బయలుదేరిందంటే గమ్యం చేరేవరకూ ఆగదు."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS