Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 3

    వేద ముఖంలోకి తెల్లబోయి చూస్తూ కూర్చున్నాడు నీరద్. ఇక్కడికి రాకముందు అతడు వేదగురించీ వేద కుటుంబాన్ని గురించీ ఊహించుకుంది వేరు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నది వేరు - ప్రతిమాటలోనూ ఏదో సంస్కారం ఉట్టిపడుతుంది. ఈ యువతిలో - ఈమె ముందు తనే కుంచించుకుపోతున్నాడు.
    అంతవరకు వీళ్ళ సంభాషణ వింటూ అతి ప్రయత్నంమీద తనను తను నిగ్రహించుకుంటున్న గీత కోపంగా లేచింది.
    "ఓహో!  మీరు మా అక్కను తిట్టి బుద్ధిచెప్పటానికి వచ్చారన్నమాట! నన్ను చూసి అక్కనుకొని నేరుగా తిట్లు ప్రారంభించారన్నమాట! మీరెవరండీ, మా అక్కను తిట్టడానికి? మీకోపిక ఉంటే, మీ నాన్నను తిట్టుకోండి-ఎన్ని తిట్లు ఎలా తిట్టినా నాకు అభ్యంతరంలేదు. మీ నాన్నని-ఇంకా కావాలంటే, మిమ్మల్ని మీరు తిట్టుకోండి - అంతేకాని - అక్కను ఒక్కమాటన్నారంటే...."
    ఉద్రేకంగా అంటున్న గీతను వారిస్తూ "గీతా! నువ్వు లోపలకి వెళ్ళు" అంది వేద.
    "వెళ్ళనక్కా! ఏ తప్పూ చెయ్యని నిన్ను అడ్డమైన చవటలూ నోటికొచ్చినట్లు మాట్టాడుతూంటే విని సహించలేను. నా అక్కను ఎవరు ఏమీ అనటానికి వీల్లేదు."
    గీత కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగిపోతున్నాయి. మతిపోయినట్లు చూస్తున్నాడు నీరద్__
    "గీతా! నువ్వు లోపలికి వెళ్ళు!" ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది వేద. కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది గీత.
    "నీరద్! నువ్వు ఇంటికి వెళ్ళు. మరొకసారి మీ నాన్నగారు లేనప్పుడు ఇక్కడికి రాకు. నన్ను మరింత చిక్కుల్లో పెట్టకు."
    ఆ కంఠంలో పలికిన ఆజ్ఞాస్వరానికి, హుందాతనానికి, ఆశ్చర్యపోయాడు నీరద్.  
    ఇలాంటి వ్యక్తి__మరి?.... ....
    సమాధానం దొరకని ప్రశ్న అతడకిది!
                                       2
    డైనింగ్ టేబిల్ దగ్గర కూచుని, ఆపిల్స్ కట్ చేసుకొని ఒక్కొక్క ముక్క తింటూ ప్రారంభించింది మీనాక్షి. "ఆ పాపిష్టిముండలకి చావైనా రాదు. ఇలా ఎంతమంది కొంపలు నాశనం చేస్తారో? నా ఉసురు ఆ దరిద్రపు ముఖాలకి కొట్టకపోతుందా?"
    "ఈ రకమైన తల్లి మాటలు విని విని బాగా అలవాటైపోయింది నీరద్ కి. ఇదివరలో ఈ మాటలు విని తల్లికి జరిగిన అన్యాయానికి తెగ ఉద్రేక పడిపోయేవాడు. తల్లితోపాటు తనూ ఆ పాపిష్టి వాళ్ళను తిట్టిపోసేవాడు. కానీ, ఆనాడు మాత్రం అతనిలో ఎలాంటి ఉద్రేకము కలగలేదు. ఇరవైయేళ్ళు అప్పుడప్పుడే నిండుతోన్న నీరద్ కి లోకం వింతగా కనిపించసాగింది. అటు తల్లి కన్నీళ్ళు. ఇలా జాగ్రత్తగా తింటున్న ఆపిల్స్ ఈ రెంటికి సమన్వయమెలా అని కొత్తగా ఆలోచించసాగాడు. ఆ కన్నీరు అలవాటుగా వచ్చినవా, లేక ఆవేదనతో వచ్చినవా ఏమీ అర్ధంకాలేదు.
    "అమ్మా! ఎంతసేపూ వాళ్ళనే తిడతావు కాని నాన్నని తిట్టవేం?" అని అడిగేశాడు.
    ఆశించని ఈ ప్రశ్నకు తెల్లబోయింది మీనాక్షి.
    "నాన్ననా? నాన్నని ఏం తిట్టమంటావురా?" కళ్ళు పెద్దవిచేసి చూస్తూ అడిగింది.
    "మరి? వాళ్ళని తిట్టినట్టే తిట్టు, నాశనమయిపోవాలనీ, పాపాలకు ఫలితం అనుభవించాలనీ...."
    "ఛీ! నోర్ముయ్!...." గట్టిగా అరిచింది మీనాక్షి.
    అతినిర్లక్ష్యంగా నవ్వుతూ "ఏం! నాన్నచేసింది మాత్రం తప్పుకాదా? ఆయన చేసింది మాత్రం పాపం కాదా? ఆ మాటకొస్తే నాన్న పాపమే ఎక్కువ. డబ్బు, అధికారం ఎరగా చూసి, అమాయకుల జీవితాలు నాశనం చేస్తున్నాడు" అన్నాడు నీరద్.
    కొడుకు అల్లరి మీనాక్షికి ఎప్పుడూ అలవాటేకాని. ఈనాడు అతని ధోరణి మరీ వింతగా, భరించరానిదిగా ఉంది ఆవిడకి.
    "నీకు బుద్దుందా? నాన్నని నాశనమయిపో! అని తిట్టమంటావా? ఆయన నాశనమయితే, నాశనమయ్యేది ఎవరురా!"
    "ఓహో! ఆయన నాశనమయితే మనమూ నాశనమవుతాము కనుక ఆయనని తిట్టవన్నమాట! ఆ అమ్మాయెవరో సర్వనాశనమయి పోయినా, మనకేం బాధలేదు గనుక ఆ అమ్మాయిని తిట్టిపోస్తావన్నమాట? లాభం లేదమ్మా! ఒకవేళ నీ తిట్ల ప్రభావానికి అమ్మాయి నాశనమయిపోయినా ఆయన క్షణాలలో మరో అమ్మాయిని సృష్టించుకోగలరు. అంచేత నిజంగా నీకు కన్నీళ్ళు రాకుండా వుండాలనుకొంటే నువ్వు కోరుకోవసింది ఆయన నాశనమయిపోవాలనే!"
    "ఒరేయ్! నోరుముయ్యరా? ఛా! ఏం మాటలురా ఇవి? వినటానికే భయంగా ఉంది__"
    టిఫిన్ ప్లేట్లో స్పూన్ పడేసి పకపక నవ్వసాగాడు నీరద్.
    "అమ్మా! ఒక్కమాట చెప్పనా?"
    "ఏమిటిరా అది?"
    "నువ్వు టిఫిన్ మానేసి ఆపిల్స్ తిని డయట్ చేసినా, బ్యూటీక్లినిక్ కు వెళ్ళి ఎన్ని రకాల మేకప్ లు చేయించుకున్నా, 'మిరకిల్'కి వెళ్ళి ఎన్ని అత్యద్బుతమైన హెయిర్ స్టయిల్స్ చేయించుకున్నా, నువ్వు ఆయన మనసు మార్చలేవు. సుబ్బరంగా, పబ్లిగ్గా ఆయనకు డైవోర్స్ ఇచ్చేయ్ అప్పుడు ఆయన పరువు దెబ్బతింటుందికదా! అప్పుడు బుద్దొస్తుంది - లేకపోయినా ఈ కళ్ళనీళ్ళ బాధ నీకు తప్పుతుంది."
    "నిన్నే దెయ్యం పట్టిందిరా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?"
    "నువ్వు అర్ధంపర్ధం లేకుండా ఏడుస్తోంటే, నేను కాస్త అర్ధమున్న మాటలు మాట్లాడుతున్నానమ్మా! ఆయన చేసే అన్యాయాలు సహించలేవు. ధైర్యంగా విడాకులివ్వలేవు - ఇక ఎటూగాని ఈ చేతకాని ఏడుపు లెందుకమ్మా? ఈ ఏడుపులు చూస్తే నాకు జాలి కలగటంలేదు__అసహ్యం వేస్తుంది.... ...."
    "ఏమిటిరా. నీకు అసహ్యం వేసేది" అప్పుడే నిద్రలేచి వచ్చిన జయపాల్ సింహంలా గర్జించాడు. జయపాల్ ఏనాడూ ఒంటిగంటకి ముందు నిద్రపోడు. బయట ఎక్కడెక్కడ తిరిగినా రాత్రికి ఇంటికొస్తాడు. తన ఏ.సి. బెడ్ రూంలో తప్ప మరెక్కడా అతనికి నిద్రరాదు. అంచేత అతడు ఎనిమిది, తొమ్మిది గంటలకు ముందు ఏనాడు నిద్రలేవడు - రాత్రే అతనికి నీరద్ క్లబ్ లలో డాన్స్ చేస్తున్నట్లు తెలిసింది - అప్పటినుంచీ కొడుకుమీద మండిపడుతున్నాడు.
    అప్రయత్నంగా గభాలున లేచి నిలబడ్డాడు నీరద్ - సాధారణంగా తండ్రిని తప్పుకు తిరుగుతాడు అతడు - తండ్రిదగ్గర అప్పటివరకు అతనికి ఎంతో భయముండేది.
    "వాట్ నీరద్ బాబుగారూ! ఏమిటండీ మీరు అసహ్యించుకునేది?" వెటకారంగా అడిగాడు.
    "చేతకాని ఏడుపులిని" నిర్భయంగా సమాధానం చెప్పాడు నీరద్ - ఈ ధోరణికి కొద్దిగా ఆశ్చర్యపోయాడు జయపాల్.
    "చేతనయిన ఏడుపులేమిటి? చదువుకి పంగనామాలు పెట్టి క్లబ్ లో తైతక్కలాడటమా?"
    "అది ఏడుపు కాదు__కళ!"
    "నోర్ముయ్! రేపటినుంచీ నువ్వా క్లబ్బులకి వెళ్ళటానికి వీల్లేదు."
    "నేను వెళ్ళితీరతాను."
    నిర్ఘాంతపోయాడు జయపాల్. అంతకుమించి కొయ్యబొమ్మయి పోయింది మీనాక్షి.
    ధైర్యంగా నిర్లక్ష్యంగా తండ్రి చూపులిని ఎదుర్కొన్నాడు నీరద్.   
    "ఎందుకురా, నీ జీవితం ఇలా నాశనం చేసుకుంటావు?" ప్రాధేయపడుతున్నట్లు అంది మీనాక్షి పరిస్థితికి భయపడుతూ-
    "నేను ఏం నాశనం చేసుకుంటున్నానమ్మా! కాలేజీలో చదివి పుస్తకాలు రుబ్బి ఎలాగో ఒకలాగ డిగ్రీలు సంపాదిస్తేనే బాగుపడినట్లా! నాకు డాన్స్ లో అభిరుచి ఉంది. నేను డాన్స్ నేర్చుకున్నాను - డాన్స్ చేస్తున్నాను - డాన్సర్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలను. రాణించగలను. మీ ఉద్దేశ్యంలో చదువుకోవటం మాత్రమే మంచి జీవితం అయితేకావచ్చు- అది నామీద రుద్దతారెందుకు?"
    "నీరద్! బుద్ధిలేకుండా మాట్లాడకు-నువ్వు కాలేజీకి వెళ్ళు. చాలు! నేను డిగ్రీ తెప్పిస్తాను ఉద్యోగం చూపిస్తాను. రాజాలాగా బ్రతకవచ్చు."
    నీరద్ పకపక నవ్వాడు - "ఇదా? రాజాలాగ బ్రతకటమంటే? కాలేజీలో చేరి చదవక్కరలేకుండా నేను ఉద్యోగం చూసుకున్నాను. నువ్వు చూపించిన ఉద్యోగంలోకంటే బాగానే సంపాదించగలను-"
    "నీరద్! నువ్వు ఆ డాన్సులు మానవా?" చాలా తీక్షణంగా అడిగాడు జయపాల్.  
    "మానను!" శాంతంగా నవ్వుతూ చెప్పాడు నీరద్.
    "నామాట వినకపోతే నిన్ను ...."
    "ఇంట్లోంచి గెంటేస్తావా? హాయిగా పోతాను." నవ్వేసి మేడమెట్లు ఎక్కుతూ నాలుగు మెట్లెక్కి ఆగి కిందకు చూసి "జాగ్రత్తగా ఆలోచించుకో! జయపాల్ కొడుకుని ఇంట్లోంచి గెంటేశాడు- అని రేపు అందరూ వింతగా చెప్పుకుంటారు. అదొక పెద్ద న్యూస్ అవుతుంది." అని మరో నాలుగు మెట్లెక్కి మళ్ళీ క్రిందకు చూసి "మా తండ్రి నన్ను ఇంట్లోంచి గెంటేశాడు అని నలుగురికి చెప్పుకుంటే, నాకింకో నాలుగు క్లబ్బులు ఛాన్స్ ఇస్తాయి. ఆ రకంగా నాకు ఉపకారంచేసిన వాడవవుతావు" అని మళ్ళీ ఇంకో పది మెట్లెక్కి మళ్ళీ క్రిందకు చూసి "నీ శత్రువులు ఈ వార్తను బాగా ప్రచారం చేసి నీమీద దెబ్బతీయాలని చూస్తారు. పాపం!" అనేసి పైకి వెళ్ళిపోయాడు. 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS