Previous Page Next Page 
అనైతికం పేజి 3


                                అనైతికం
                                             __ యండమూరి వీరేంద్రనాథ్

 

    షామ్లా చెప్పిన కథ:

 

    జార్జి స్క్వేర్ నుంచి క్వీన్స్ సర్కిల్ వైపు మలుపు తిరుగుతూ కారు నెమ్మదిగా స్లో చేశాను. దూరంగా ఎత్తైన కోర్టు భవంతి కనపడుతోంది. దాదాపు వెయ్యిమంది దాకా వుంటారు జనం!

 

    చుట్టూ పోలీసులు కవచంలా వున్నారు. బి.బి.సి.తో సహా ఇరవై టీవీ కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నాయి. జనం ప్లేకార్డులు పట్టుకుని నిలబడి వున్నారు. 'స్త్రీ స్వాతంత్ర్యానికి గౌరవం ఇవ్వాలి', 'విమెన్ లిబ్ స్త్రీల ఆశయం' లాంటి స్లోగన్లు ఆ ప్లే కార్డుల మీద రాయబడి వున్నాయి. అక్కడ వున్నవారందరూ స్త్రీలే. తొంభైశాతం బ్రిటీషర్లు.

 

    నాక్కొద్దిగా గర్వం కలిగింది.

 

    వారందరికీ నేను ప్రతినిధిని!

 

    వారి తరఫున వాదించబోతున్న లాయర్ని!!

 

    ఒక భారతీయురాలినై వుండీ, ఎక్కడో దేశం కాని దేశంలో అంతమంది బ్రిటీషర్ల తరఫున వాదించబోతున్న నాకు ఆ మాత్రం గర్వం కలగటంలో ఆశ్చర్యమేముంది?    

 

    కారు దిగి కోర్టు మెట్లు ఎక్కుతుంటే జనం హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టటం ప్రారంభించారు. దాదాపు కెమెరాలన్నీ నామీదే ఫోకస్ చేయబడి వున్నాయని నాకు తెలుసు.

 

    అక్కడ పెద్ద గొడవేమీ జరగదని నిశ్చయంగా తెలియటం వల్లనేమో, పోలీసులు కూడా దీన్ని నవ్వుతూ చూస్తున్నారు. ఇదంతా వారికి ఒక సినిమా షూటింగ్ లా అనిపిస్తూందేమో అన్న భావం- నాకు చిరాకుతో కూడిన ఉక్రోషాన్ని కలిగించింది.

 

    "అవును మరి! స్త్రీల నైతిక విజయానికి సంబంధించిన సమస్య ఇది".

 

    నేను కోర్టు హాల్లో ప్రవేశిస్తూ వుండగా, మరోవైపునుంచి సూర్యమ్ అక్కడికి వచ్చాడు. అతడు ప్రతిన్యాయవాది. నన్ను చూసి స్నేహపురస్సరంగా నవ్వాడు. నేను కూడా చిరునవ్వుతో సమాధానమిచ్చాను. మే మిద్దరమూ మంచి స్నేహితులం. మరో రకంగా చెప్పాలంటే చిన్నప్పటినుంచీ కలిసే చదువుకున్నాం. అమ్మతో కలిసి నేను ఇంగ్లండ్ వచ్చి పాతిక సంవత్సరాలైంది. సూర్యమ్ తల్లిదండ్రులు అంతకుముందు కొన్ని తరాలనుంచీ ఇక్కడే సెటిల్ అయ్యారు.

 

    న్యాయవాద వృత్తిలో సూర్యమ్ నాకన్నా రెండేళ్ళు సీనియర్.

 

    సూర్యమ్ కోర్టు ఆవరణలోకి వస్తున్నప్పుడు జనం ముఖ్యంగా స్త్రీలు అతడికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. జడ్జి వచ్చి ఆసీనురాలయ్యేంత వరకూ బయటినుంచి ఆ నినాదాలు వినిపిస్తూనే వున్నాయి. జడ్జి పేరు బార్బరా స్టార్లండ్. ఆమెను చూడగానే కేసు గెలుస్తానన్న ధైర్యం నాకు కలిగింది. బహుశా ఆమె కూడా ఒక స్త్రీ అవడం వల్లనేమో!

 

    ఆ తరువాత అయిదు నిమిషాలకి వాద ప్రతివాదాలు ప్రారంభమయ్యాయి.

 

                                               2

 

    'The women' అన్న పుస్తకాన్ని ఇంగ్లండ్ లో నిషేధించడం గురించి ఈ కేసు.

 

    ఈ పుస్తకం రిలీజైన మూడునెలల్లో అరమిలియన్ కాపీలు అమ్ముడుపోయింది. మొదటి నెలలోనే సంచలనం సృష్టించింది. ఈ పుస్తకాన్ని నిషేధించాలని స్త్రీవాదులు, విమెన్ లిబ్ సంస్థలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపాయి. ప్రచురణకర్తలు దిగిరాలేదు. దాంతో చట్టపరమైన చర్యకోసం కేసు వేశారు. వారి తరఫునే నేను ప్రస్తుతం వాదిస్తున్నది.    

        
    ఈ కేసు నేను వాదిస్తున్నానని తెలియగానే పుంఖానుపుంఖాలుగా అభినందనలు, టెలిగ్రామ్ లు వచ్చాయి.

 

    ఈ కేసు తప్పక నేను గెలుస్తానని నాకు తెలుసు. 'ది ఉమెన్' అన్న పుస్తకం ఏ కోణంలోంచి చూసినా 'బాన్' చేయబడాల్సిన పుస్తకమే. దాని మొదటి పేజీలో ఉపోద్ఘాతం ఒకటే చాలు దాన్ని నిషేధించడానికి. 'స్త్రీ పురుషులిద్దరూ చేయడానికి వేరు వేరు పనులున్నాయి. అంతే తప్ప ఒకే పని చేయడం కోసం కాదు' అన్న వాక్యంతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. దేవుడి సృష్టిలోనే ఆ తేడా వుందట. ఇంత కొద్ది కాలంలో ఈ పుస్తకం ఇన్ని వేల కాపీలు అమ్ముడుపోయిందంటే దాన్ని బట్టే మనుషుల్లో పురుషాహంకారం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతోంది.

 

    ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. ఈ కేసు నెగ్గడంవల్ల ఇంగ్లండ్ లో దాదాపు ప్రతి పౌరుడికీ లాయరుగా నా పేరు తెలుస్తుంది. ఒక భారతీయ వనితగా ఇది నా మాతృదేశానికి కూడా గర్వకారణం అవుతుంది. అది దృష్టిలో వుంచుకుని చాలా పట్టుదలతో నెలరోజులపాటు శ్రమించి నేను నా వాదాలని తయారు చేసుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు నా ప్రతివాది తరఫు లాయరు సూర్యమని.

 

    షాక్ తగిలినట్టయింది నాకు. వెంటనే సూర్యానికి ఫోన్ చేశాను. "నీకేమైనా మతిపోయిందా? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? నువ్వు.... నువ్వు" కోపంతో మాటలు రాలేదు.

 

    "నువ్వంతగా ఉద్వేగం చెందకు. కోర్టులో రెండువైపులా వాదాలుంటాయనీ, దానికి చెరో లాయరూ వుంటారని నీకు తెలియదా?" అటునుంచీ సూర్యమ్ నవ్వుతూ అన్నాడు.

 

    "నువ్వు ఆ పుస్తకం చదివావా?" కసిగా అడిగాను.

 

    "చదివాను".

 

    "చదివి కూడా దాని తరఫున వాదించడానికి సిద్ధపడ్డావా?"

 

    "అవును".

 

    అటువంటి సమాధానం ఊహించకపోవడం వల్ల రిసీవర్ ని పట్టుకున్న నా చేతులు అప్రయత్నంగా వణికాయి. "నీకు...నీకు వ్యక్తిత్వం లేదా?"

 

    "నువ్వు లాయరుగా అడుగుతున్నావా? నా స్నేహితురాలుగా అడుగుతున్నావా?"

 

    "గొప్ప తెలివితేటలతో మాట్లాడుతున్నాననుకోకు. తెలివి తేటలు ఉపయోగించడానికి ఇదేమీ కోర్టు కాదు".

 

    "వాళ్ళ తరఫున వాదించడానికి పబ్లిషర్లు నాకు డబ్బిచ్చారు. తమ తరఫున వాదించడానికి మరి కొంతమంది నీకు డబ్బిచ్చారు. ఇందులో అంత ఆవేశపడటానికి ఏం కారణం వుంది?"

 

    "కారణం లేదా? చాలా పెద్ద కారణం వుంది. నేను నమ్మిన సిద్దాంతానికి అనుకూలంగా నేను వాదిస్తున్నాను. నువ్వు నమ్మిన సిద్దాంతానికి ప్రతికూలంగా నువ్వు వాదిస్తున్నావు. అదీ తేడా?" అని ఫోన్ పెట్టేశాను.

 

    తరువాత మరింత పట్టుదలతో నోట్సు ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కేసు గొప్ప సంచలనం సృష్టించబోతుందనిమ్ కోర్టులో నేను వాదించే ప్రతి వాక్యమూ దాదాపు అన్ని పత్రికల్లోనూ టీవీల్లోనూ వస్తుందని నాకు తెలుసు. అదీగాక నా వెనుక యాభై మిలియన్ల బ్రిటీషర్లు వున్నారు. వారిలో దాదాపు సగంమంది పురుషులవడం శుభసూచకం!

 

                                   3

 

    "పాలివ్వడానికి ఆవుని పెంచుతాం. గుడ్లకోసం కోడిని పెంచుతాం. ఆవు, కోడి జంతువులే. కాబట్టి పాలధర, గుడ్లధర ఒకేలా వుండాలి అని వాదించటం మూర్ఖత్వం అని తన పుస్తకంలో రాశాడు మిలార్డ్. ఈ రచయిత మగవాళ్ళని ఆవులతోనూ, ఆడవాళ్ళని కోళ్ళతోనూ పోల్చడంలో నాకేమీ అభ్యంతరంలేదు కానీ ధరలు నిర్ణయించడంలో ఈ పోలిక చాలా నిర్హేతుకమని నా అభిప్రాయం. ఒక పురుషుడు తన కుటుంబం కోసం బయట ఎంత కష్టపడతాడో, ఒక ఇంటి కోసం స్త్రీ కూడా అంతే కష్టపడుతుంది. పాలకన్నా గుడ్లు బలవర్ధకమైన ఆహారం అని ఈ రచయిత తెలుసుకోవాలి" అంటూ నా వాదాన్ని ప్రారంభించాను. కోర్టు హాల్లో హర్షధ్వానాలు వినిపించాయి. జ్యూరీ సభ్యుల మొహాల్లో చిరునవ్వు కనిపించింది. మొదటి పాయింట్ నేను నెగ్గానని నాకర్థమైపోయింది.

 

    "అబ్జక్షన్ మిలార్డ్" అంటూ సూర్యమ్ లేచాడు. "గౌరవనీయులైన న్యాయవాది పుస్తకంలో కేవలం ఒక పేరాను మాత్రమే ఉటంకిస్తున్నారు. ఆ తర్వాతి పేరాలోనే రచయిత స్త్రీ పట్ల తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. మెదడుని ఆపరేట్ చేసే డాక్టరు జాగరూకతతో చేస్తాడు. అదే చేతిని ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు మరో రకమైన విధానం అవలంబిస్తాడు. స్త్రీ సమాజానికి మెదడులాంటిది కాబట్టి ఆమెను చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి అని రాయడాన్నిబట్టే రచయితకి స్త్రీపట్ల వున్న గౌరవం తెలుస్తోంది!" అన్నాడు సూర్యమ్.

 

    అరక్షణంపాటు నేను స్తబ్దురాలి నయ్యాను. అతడంత సమయస్ఫూర్తితో వాదించినందుక్కాదు. ఏ పేరా తర్వాత ఏ పేరాగ్రాఫ్ వుందో దాదాపు కంఠతా పట్టిన లెవల్ లో ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసినందుకు.

 

    నా ఆలోచల్నించి వెంటనే తేరుకుని వాదం కొనసాగించాను. "స్త్రీ ఒక అంటరాని వస్తువుగానో, పవిత్ర కార్యాలకు ఉపయోగపడని జీవిగానో ఈ రచయిత ఈ పుస్తకంలో చిత్రీకరించాడు. మతాధిపతులు, దేవాలయాల్లోనూ, చర్చిల్లోనూ దేవుణ్ణి అర్చించేవారూ స్త్రీ నుంచి దూరంగా వుండాలని ఉల్లేఖించాడు. అదే విధంగా చర్చిల్లో పనిచేసే స్త్రీలు తప్పనిసరిగా బ్రహ్మచారిణులై వుండాలని ఉద్దేశింపబడిన సామాజిక ధర్మాన్ని ఎద్దేవా చేశాడు. బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, క్రిస్టియానిటీ మొదలైనవాటిగురించి కూడా రచయితకి తేలికైన అభిప్రాయం వుందని ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. జైన మతానికి సంబంధించిన గురువులు స్త్రీవైపు కన్నెత్తి కూడా చూడరాదన్న నియమంలోనే రచయిత అభిప్రాయం తెలుస్తోంది. ఇన్ని మతాలని ఇంత దారుణంగా విమర్శించిన ఈ రచయిత పుస్తకం సభ్యసమాజంలో చలామణి కావడం మానవజాతికే అవమానకరం!" గర్వంగా సూర్యమ్ వైపు ఓసారి చూసి కూర్చున్నాను.

 

    సూర్యమ్ లేచాడు.  

 

    "రచయిత వున్న పరిస్థితిని చెప్పాడు. ఇదంతా చలామణీ కాకూడదని, గౌరవనీయులైన న్యాయవాది భావించినట్టయితే నిషేధించవలసినది ఈ పుస్తకాన్ని కాదు! మొత్తం ప్రపంచంలో వున్న అన్ని మతాల్నీ..." సింపుల్ గా అన్నాడు.

 

    కోర్టు హాల్లో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం ఆవరించింది. నేను లేచాను.

 

    "మతాల్నీ, మనుధర్మ శాస్త్రాల్నీ, బైబిల్ నీ, ఖురాన్ నీ నిషేధించాలా? అవసరం లేదా? అన్న సమస్య చర్చించడానికి కాదు మిలార్డ్ మనమిక్కడ సమావేశమైనది! రచయిత రాసిన 'ది విమెన్' అన్న పుస్తకంలో స్త్రీ గురించి చేసిన అవహేళన గురించి చర్చించడానికి ఈ న్యాయస్థానం సమావేశమైంది. పాశ్చాత్య నాగరికతతో పోల్చుకుంటే హిందూ స్త్రీ భర్తకోసం చేసేత్యాగానికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుంది. ఒక హిందూ స్త్రీ భర్తకోసం చేసేత్యాగానికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుంది. ఒక హిందూ స్త్రీనైన నేనే ఈ పుస్తకం చదివి ఇంత ఇరిటేట్ అయ్యానంటే, దాన్నిబట్టే పుస్తకం ఎంత అర్థరహితంగా నిర్హేతుకంగా, పక్షపాతంతో రాయబడిందో అర్థమౌతోంది. కెనడీ భార్య భర్త మరణించిన తర్వాత మరొక కోటీశ్వరుణ్ణి పెళ్ళి చేసుకుందనీ, కానీ ఏ మాత్రం సంతోషం పొందలేదనీ, అందువల్ల డబ్బుకన్నా వితంతువుగా బతకడంలోనే ఎక్కువ సంతోషం వుందనీ ఈ రచయిత రాశాడు. మార్లిన్ మన్రో గురించి ప్రస్తావిస్తూ ఆమె తన ముప్పై ఆరవ ఏట ఆత్మహత్య చేసుకోవడానికి కారణం సరియైన మగతోడు లేకపోవడమే అన్నట్టు వాదించాడు. ఇదే పుస్తకంలో బ్రిగెటీ బొర్డాట్ అన్న ప్రముఖ నటీమణి గురించి రచయిత ప్రస్థావించాడు. ఒక సంవత్సరంలో దాదాపు ముప్పైవేలసార్లు ఈ నటీమణీ ఫోటో వివిధ పత్రికల మీద ముఖచిత్రంగా వచ్చిందట. తన ఒంటరితనాన్ని భరించలేక నిద్రమాత్రలు మింగితే ఆమెను హాస్పిటల్ కి తీసుకువెడుతున్న అంబులెన్స్ ని మార్గమధ్యంలోనే ఆమె ఆరాధకులు ఆపుచేసి ఆమెను తనివితీరా చూడాలనుకున్నారట. మరో రకంగా చెప్పాలంటే సమాజం నుంచి ఎన్ని ఆదరాభిమానాలను పొందినా, చివరికి తనకంటూ ఒక తోడులేని జీవితం నిరర్థకమని ఆమె జీవితం నిరూపిస్తోందని ఈ రచయిత చెప్పాడు. ఈ పుస్తకం చదివి ప్రతి స్త్రీ తాను తప్పనిసరిగా 'పురుషుడి మీద ఆధారపడితేనే తన జీవితం సుఖవంతమవుతుంది' అన్న అభిప్రాయాన్ని అంతర్లీనంగా పాఠకుల్లో కలిగించాడు. ఇది శ్లో పాయిజన్ మిలార్డ్! దీన్నిక్కడితో ఇప్పుడే అరికట్టకపోతే శరీరమంతా వ్యాపిస్తుంది".

                                         *    *    *   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS