Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 3


    ఆయన మొహంలో దిగులు, కళ్ళలో బెదురు కనబడుతున్నాయి. రావడంతోనే ఇన్ స్పెక్టర్ కి చేతులు జోడించి.... "అమ్మా! మా వాడేదో పొరపాటు చేసాడు. క్షమించు..." అని వేడుకున్నాడు.

    "అలా చేతులు జోడిస్తే ఇక్కడ పనులు కావు నాన్నా! చేతులు తడపాలి" కటకటాల వెనుకనుంచి అన్నాడు బృహస్పతి.

    "చూసారా! మీవాడి పొగరు? ఒక్క నాలుగురోజులు యిక్కడ వుండనివ్వండి. అంతా సాపుచేసి పంపిస్తాను."

    "ఇరవై నాలుగు గంటలకన్నా ఎక్కువసేపు లాకప్ లో ఉంచడం చట్టరీత్యా నేరం. మాన్యువల్ రూల్స్ ప్రకారం ఇప్పటివరకూ ఎఫ్.ఐ.ఆర్. తయారు చేయకపోవటం చట్టవిరుద్ధం. ఇంకా చెప్పాలంటే...." అతడి మాటలు పూర్తికాకుండానే పోలీసు వచ్చి తాళం తీసి లోపల్నుంచి అరుస్తున్న బృహస్పతిని బయటికి పిలిచాడు. ఈ ఆకస్మిక చర్యకి ఆశ్చర్యపోయి "ఏమిటీ, మీ ఇన్ స్పెక్టర్ గారి హృదయంలో పరివర్తన వచ్చిందా?" అనడిగాడు బృహస్పతి.

    "ఆ.... డబ్బులొచ్చాయి. మీ నాన్న ఇచ్చాడు" అన్నాడా పొట్టి పోలీసు. బృహస్పతి మొహం వివర్ణమైంది. అప్పుడే అక్కడికి వచ్చిన తండ్రితో "నువ్విచ్చావా నాన్నా? ఎక్కడివి మనకిన్ని డబ్బులు....?" అనడిగాడు.

    "మీ చెల్లి వరలక్ష్మీవ్రతం కోసం వుంచుకున్నవి" అభావంగా అన్నాడాయన. బృహస్పతి చప్పున తలెత్తి ఆయన వైపు చూసాడు. ఒక్కసారిగా పదేళ్ళు మీదపడ్డట్లు ఆయన కుంగిపోయి మెట్లు దిగుతున్నాడు. బృహస్పతి రివ్వున ఇన్ స్పెక్టర్ వైపుకి వెళ్ళాడు. ఆమె ఆ రోజు కలెక్షన్ లెక్క పెట్టుకుంటోంది. ముందుకు వంగి అన్నాడు. "ఇన్ స్పెక్టర్.... గుర్తుంచుకోండి. నిశ్చయంగా ఇంతకు ఇంతా చేస్తాను. మీ చేత కన్నీళ్ళతో క్షమాపణ చెప్పిస్తాను. లేదా మీ లంచగొండి ఉద్యోగం పోయేలా చేస్తాను. బృహస్పతి తెలివితేటలకి ఇదొక సవాల్" అంటూ విసురుగా అక్కడి నుండి వచ్చేసాడు.


                      *    *    *


    బాబ్డ్ హేర్, చిన్న నోరు, పెద్ద కళ్ళు, పల్చటి పెదవులు- ఆ అమ్మాయిలో అన్నీ బావుంటాయి. ముఖ్యంగా ఇన్ స్పెక్టర్ డ్రస్ వేసినప్పుడు బెల్ట్ బిగించికడితే సన్నటి నడుము, దానికి కాస్త పైగా ఎత్తయిన ఛాతీ.

    ఆ అమ్మాయి స్ట్రక్చర్, పేరుమోసిన రౌడీలకి కూడా అరెస్ట్ కాబడాలనీ, ఆమె గది ఎదురుగా లాకప్ రూంలో వుంటే చాలనీ అనిపించేలా చేస్తుంది. ఆమె వక్షం ఎంత హుందాగా ఉంటుందో, జఘనం అంత ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే "మూడు" అంకెని మధ్యకి తెగ్గోసి పై భాగాన్ని రివర్స్ చేసి అతికిస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది ఆ అమ్మాయి షేపు. అయితే ఆ అమ్మాయికి సరిపోనిదల్లా ఆమె పేరే!

    ఆమె పేరు సరళరేఖ. ఆ అమ్మాయి పుట్టినప్పుడు వియ్యపురాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు. 'నా పేరు పెట్టాలని' నాయనమ్మ. 'నా పేరు పెట్టాలని' అమ్మమ్మ పట్టుబట్టారు.

    ఆ అమ్మాయి నాయనమ్మ పేరు సరళమ్మ. అమ్మమ్మ పేరు రేఖమమ. ఓటరుకి ఆప్షన్ లేనట్టే ఆయనకీ లేకపోవడంతో రెండింటినీ కలిపి కూతురికి 'సరళరేఖ' అని పేరు పెట్టి చేతులు దులిపేసుకున్నాడు.


                      *    *    *


    లోపలినుంచి పోపు వాసన గుమగుమ లాడుతోంది .సరళరేఖ డ్రాయింగ్ రూమ్ లో కూచుని లెక్క లేసుకుంటోంది. వంటింట్లోంచి పొట్టి పోలీసు బయటికొచ్చాడు. అధికారంతో వున్న రాజకీయ నాయకుడు, విదేశాలు చూడడం కోసం తన అనారోగ్యం అని పేరు పెట్టినట్టు ఆ అమ్మాయి పోలీసుని అనధికారికంగా ఇంట్లో వంటపనికి ఉపయోగించుకుంటుంది.

    "అమ్మగారూ!" అన్నాడు పొట్టి పోలీసు భయం భయంగా.... ".... ఎప్పటినుంచో అడగాలని అనుకుంటున్నాను. ఏమీ అనుకోకపోతే మీరు ఎందుకిలా డబ్బులు వేరు వేరు మూటల్లో కడుతున్నారో చెప్తారా?" అన్నాడు.

    ఏ కళనుందో కానీ సరళరేఖకి కోపం రాలేదు. నవ్వేసి, "దానివెనక ఒక పెద్ద వ్యూహం వుంది బ్రహ్మనాయుడూ" అంది. ఆ తర్వాత లేచి, చేతులు వెనక్కి కట్టుకుని, గంభీరంగా పచార్లు చేస్తూ "ఎప్పటికైనా ఈ దేశపు పార్లమెంటులో ప్రవేశించాలనేది నా జీవితాశయం" అంది.

    అర్ధమైనట్టు బ్రహ్మనాయుడు నవ్వి "ఎలక్షన్ ఖర్చుకోసం ఈ డబ్బు పోగుచేస్తున్నారా?" అనడిగాడు.

    "అవును. కానీ నా ఎన్నికల కోసం కాదు. నాకు కాబోయే భర్త ఎన్నిక కోసం" అంది స్థిరంగా.

    బ్రహ్మనాయుడికి అర్ధంకాలేదు. "మీకు ఎం.పి. అవ్వాలనుంటే మీ భర్తకు ఎన్నికలేమిటి?" అన్నాడు అయోమయంగా.

    "ఎన్నికల్లో నేను నిలబడను. నేను పోటీ చేస్తే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి. దురదృష్టవశాత్తూ అక్కడ ఓడిపోతే రెంటినీ చెడ్డ రేవడినవుతాను. అదే నా భర్తని నిలబెట్టాననుకో! అతను ఓడిపోతే ఐదు సంవత్సరాల్లో ఇంకో ఐదు లక్షలు సంపాదించి, మళ్ళీ పోటీకి నిలబెట్టచ్చు. రాబోయే పార్లమెంటు సభ్యత్వం కోసం కల్పతరువు లాంటి ఉద్యోగాన్ని వదులుకోలేం కదా!" అంది.

    బ్రహ్మనాయుడు భారతదేశపు సగటు ఓటరులాగా జుట్టు పీకేసుకుని పిచ్చాడిలా కళ్ళనీళ్ళు పెట్టుకుని, చేతులు జోడించి "అమ్మా, థల్లే౧ నాది చీమ మెదడు. అర్ధం చేసుకోలేక పోతున్నాను. జగజ్జననీ!!! మీకు ఎం.పి. అవ్వాలని వుండడం ఏమిటీ, ఆయన్ని నిలబెట్టటం ఏమిటి? కొంచెం సరళంగా వివరించి చెప్పండి సరళమ్మ తల్లీ!" అన్నాడు.

    "పిచివాడా! ఎప్పుడో ఒకసారి మా ఆయన ఎం.పి. అవక తప్పదు కదా. ఆయన పదవిలో వుండగా ఛస్తే ఆ సానుభూతి ఓటుతో నేను ఎం.పి. నవుతానన్న మాట" అంది బ్రహ్మజ్ఞానిలా.

    బ్రహ్మనాయుడు దాదాపు ఆమె కాళ్ళమీద పడినంత పనిచేసాడు. "అమోఘం! అద్భుతం!! మీకున్న ముందుచూపుకి పార్లమెంటు మెంబరేమిటి? ప్రధానమంత్రి అయిపోతారు. పదవికోసం మొగుణ్ణి - మొగుడు కోసం లంచాన్నీ, లంచం కోసం ఉద్యోగాన్నీ - వైకుంఠపాళిలో నిచ్చెనలా ఏర్పరచుకున్న మీ మేధాశక్తికి ఇవే నా జోహార్లు. మీరు ప్రధాని అయితే నన్ను మీ వంటవాడిగా పెట్టుకోవాలి."

    "అమాయకుడా! వంటవాడు ఏమిటి? ఉప ప్రధానినే చేస్తాను. లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తాను."

    "నేనా.... నేను.... ముఖ్యమంత్రినా? వేళాకోళమాడుతున్నారా మేడమ్?"

    "ఇందులో వేళాకోళమేముంది బ్రహ్మనాయుడూ! అర్హతా అవసరం లేనిది ఒక్క రాజకీయంలోనే కదా!! నువ్వలా చూస్తుండు. నేను చక్రం తిప్పుతాను" ఆమె మాటలు పూర్తవుతుండగా ఫోన్ మోగింది. రెండు నిముషాలపాటు ఫోన్ లో మాట్లాడి సరళరేఖ బ్రహ్మనాయుడు వైపు తిరిగింది. ఆమె మొహం వెయ్యికాండిల్ బల్బులా వెలిగిపోతోంది. "నాయుడూ రొట్టె విరిగి నేతిలో పడటమంటే ఏమిటో ఇప్పుడు అర్ధమైందయ్యా. మినిష్టర్ గారి మీటింగ్ కి మనల్ని సెక్యూరిటీ వేసారు" అంది.

    "అందులో అంత ఆనందించాల్సిన విషయం ఏముందమ్మ గారూ?"

    "అసలీ రాజకీయ సెటప్ ఎలా వుంటుందో, మీటింగుల్లో ఎలా మాట్లాడతారో అంతా ప్రత్యక్షంగా మినిష్టర్ గారి వెనక నిలబడి చూడచ్చు. నాకాబోయే భర్తకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇదంతా ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది బ్రహ్మనాయుడూ!" అంది తన్మయంగా.


                           3


    రామ్ భగవాన్ లక్ష్మణ్ భరత్ ఈసారి ఎలక్షన్ లో ఎలాగయినా గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఓడిపోతే మినిస్ట్రీ పోతుంది. ఒకసారి అధికార రాజయోగం అనుభవించాక దాన్ని వదులుకోవడం చిత్రహింసతో సమానం.

    రామ్ భగవాన్ మొదట్లో కాంగ్రెస్ లో ఉండేవాడు. ఇందిరాగాంధీకి చాలా దగ్గర. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అవగానే పార్టీ మార్చాడు. తర్వాత చరణ్ సింగ్ తో కలిసి మొరార్జీని వెన్నుపోటు పొడిచి మినిష్టర్ అయ్యాడు. రాజకీయమంటే- జరగపోయే విషయాన్ని మిగతా అందరూ ఊహించే దానికంటే ముందుగా వూహించగలగడం! ఇందిరాగాంధీ మరణంతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఊహించి, ఢిల్లీలో అరాచకాన్ని సృష్టించాడు. సిక్కుల్ని ఊచకోత కోయించాడు. తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరాడు. అతడు వూహించినట్టే రాజీవ్ గాంధీ తల్లి మరణపు సానుభూతితో అఖండ మెజారిటీ సంపాదించాడు. రామ్ భరత్ ప్రభ ఆ హయాంలో ఒక వెలుగు వెలిగింది. అయితే ఇప్పుడు అంత ప్రాభవం లేదు. తన సత్తా ఏమిటో నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రామ్ లక్ష్మణ్ భరత్ కి వ్యతిరేకంగా బి.జె.పి. 'శత్రుఘ్న'ని బరిలోకి దింపింది. దానితో భరత్ గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. రెండు నెలల ముందు నుంచే ప్రచారానికి పూనుకున్నాడు.

    ప్రస్తుతం సరళరేఖ సెక్యూరిటీ గార్డుగా నియమింపబడింది ఈ ప్రచార సభకే!

    రామ్ భరత్ చేతులు వెనక్కి కట్టుకుని గదిలో పచార్లు చేస్తున్నాడు. సరళరేఖ అతడినే కన్నార్పకుండా చూస్తోంది. అయితే అందులో చెడు ఉద్దేశం ఏమీ లేదు. (ఆయన వయసు ఎనభై దాటి వుంటుంది కాబట్టి!) తను కూడా మినిష్టర్ అయ్యాక ఇలా గంభీరంగా పచార్లు చేస్తుంటే వందిమాగధులు, సెక్రటరీలు తన నోటివెంట రాబోయే మాట కోసం అలాగే ఎదురు చూస్తుంటారన్న దృశ్యాన్ని ఊహించుకుని ఆమె ఎక్కడి.... కో వెళ్ళిపోయింది.

    అంతలో చిన్న భూకంపం వచ్చింది. ఆమె అదిరిపడి అతి కష్టంమీద నిలదొక్కుకుంది. అంతలోనే అది భూకంపం కాదనీ, మంత్రిగారు "చక్కట్రీ" అని పిలిచినా అరుపు తాలూకు ప్రకంపనమని అర్ధమైంది. అప్పుడే వచ్చిన కొత్త ఆలోచనతో ఆయన మొహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దీనంతటికీ ఒక కారణం వుంది. పూర్వకాలంలో అయితే కొన్ని వందల వ్యాన్లు, గోడల మీద రాతలు, మైకులు, బాణాసంచాలు- ఎన్నికలంటేనే మహా ధ్వజాయమానంగా జరిగేది ప్రచారం. ఎలక్షన్ కమీషన్ పుణ్యమాని వీటన్నిటికీ అడ్డుకోత పడింది. అభ్యర్ధులు తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రచారం ఎలా చేసుకోవాలని తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఆ సమయంలో మంత్రిగారు దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడంటే దానికి కారణం ఆయనకొచ్చిన మహత్తరమైన ఆలోచనే!! "చక్కట్రీ! బ్రహ్మాండమైన ఆలోచన వచ్చేసిందయ్యా!! ఈసారి ప్రచార సభకి జెమినీ టీవీ వోల్లనీ, ఈనాడోల్లనీ, సిటీ కేబులోల్లనీ మొత్తం అందర్నీ పిలిపించు. మన స్పీచి ఆ రాత్రి ఆంధ్రప్రదేశ్ లో పతీ ఇంట్లోనూ, పతీ టీవీలోనూ రావల్సిందే!" అన్నాడు మహదానందంగా. 'ఇదేం గొప్ప ఐడియా, నీ మొహం' అన్నట్టు చూసాడు సెక్రటరీ మంత్రివైపు, పైకి మాత్రం మర్యాదగా "ఇలాంటి ఉపన్యాసాన్ని దూరదర్శన్ వాళ్ళే ప్రసారం చేస్తారు కదండీ" అన్నాడు.

    "మరదే! అందుకే నువ్వు ఓటరుగా వుండిపోయావు. నేను మినిష్టర్ ని అయ్యాను. కాసింత తెలివితేటలుండాలయ్యా చక్కట్రీ. పెజలు అమాయకులు. మనం ఏం చెప్తే అదే నమ్మేత్తారు. ఎన్టీ ఆర్ సావుకి ఆవిడే కారణమంటే అవునంటారు. అల్లుడే కారణమని ఆవిడంటే అదీ అవునంటారు. అట్టాటి పెజల్ని మన బుట్టలో పడెయ్యడానికి, బెమ్మాండవైన ప్లానేసాను. మన మడిసిని జనంలో దూరంగా యాడనో నిలబెట్టు.... యధాలాపంగా పిల్సినట్టు పిలుస్తా. మన గురించి ఆడు బెమ్మాండంగా రిపోర్ట్ ఇయ్యాలి. మన పత్తెర్ది గురించి చీల్చి చెండాడాలి. అట్టా ముందే మనం ట్రైనింగ్ ఇత్తామన్నమాట!" అన్నాడు.

    "ఆహా..... ఓహో" అన్నాడు సెక్రట్రీ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS