Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 2


    "ఒరేయ్! నీలాంటి కొడుకుని కనడం నా మొదటి తప్పయితే, వాడికి బృహస్పతి అని పేరు పెట్టడం నా రెండో తప్పు. పాతికేళ్ళొస్తున్నా బి.ఏ. పాసవని వాడివి ఇక జీవితంలో ఏం సాధిస్తావురా?"

    "అలా అనకు నాన్నా. ఇంకో రెండుసార్లు ప్రయత్నించి ఎందులోనూ షైన్ అవకపోతే రాజకీయాల్లో చేరతాను. 'politics is the last risort of a scoundrel' అన్నాడో తత్వవేత్త" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు బృహస్పతి.


                 *    *    *


    "ఏమిటీ, అంత దీక్షగా లెక్కపెడుతున్నావ్?"

    పాత రూపాయినోట్లు లెక్కపెడుతున్న హిమసమీర ఉలిక్కిపడి "అబ్బే, ఏం లేదన్నయ్యా! ఎల్లుండి శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మీ వ్రతానికి చీర కొనుక్కోమని నాన్న డబ్బు యిచ్చాడు. అవి లెక్కపెడుతున్నాను" అంది.

    బృహస్పతి మోకాళ్ళమీద చెల్లెలి దగ్గరగా కూచున్నాడు. "కొత్తచీర కొనుక్కోవడానికి పాత రూపాయినోట్లు లెక్క పెడుతున్నావామ్మా?" అన్నాడు ఆర్ద్రంగా. హిమసమీర తలదించుకుంది. ఆ అమ్మాయి కళ్ళలో తడి చూసి వెంటనే మాట మార్చేసి "యాభై తొమ్మిది వున్నాయి. ప్చ్! లాభం లేదు చెల్లాయ్! ఈ రోజుల్లో దీనితో చీరె కాదుకదా, ఒక ఓటు కూడా కొనుక్కోలేం. దీన్ని నాకు అప్పు ఇవ్వు. పెట్టుబడిగా పెట్టి సాయంత్రానికల్లా వంద రూపాయల లాభంతో సహా తెచ్చిస్తాను" అన్నాడు.

    "ఏం చేస్తావ్? పేకాడతావు అంతేగా."

    "అంతే!"

    "నేను చచ్చినా ఇవ్వను."

    "ఎందుకు ?"

    "పోతే?"

    "ఇదిగో చెల్లాయ్! నువ్విలా ఆలోచిస్తే భారతదేశంలో బ్రతకడానికి అనర్హురాలివి."

    హిమసమీర అమాయకంగా "జూదంలో డబ్బులు పోతాయని తెలియడానికీ, భారతదేశంలో బతకడానికీ సంబంధం ఏమిటి అన్నయ్యా?" అనడిగింది.

    బృహస్పతి వేదాంతిలా నవ్వి, "పిచ్చిదానా అది తెలిస్తే ఇంతమంది భారతీయులు హర్షద్ మెహతాని నమ్మి షేర్లలో ఎందుకు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటారే?" అన్నాడు. దాంతో హిమసమీరకి ఏం మాట్లాడాలో తోచలేదు. "వద్దులే అన్నయ్యా! నాన్నకి తెలిస్తే బాధపడతాడు" అంటూ మరి వాదించకుండా నిరాకరించింది.


                          2


    ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్దిలా ఉంది ఊరి బయటి సత్రం. ఉన్న అభ్యర్ధులందరూ అవతలి పార్టీలో చేరిపోగా, మిగిలిన ప్రెసిడెంటూ, వర్కింగ్ ప్రెసిడెంటూ లాగా కూచున్నారు బృహస్పతి, హనుమంతరావులు.

    "ఎవరూ రారంటావా?" అడిగాడు రావు.

    "రాజకీయాలకీ, పేకాటకీ రారన్న ప్రసక్తిలేదు బ్రదర్! అక్కడ సీటు దొరక్కపోతే తప్పకుండా ఇక్కడికే వస్తారు" అన్నాడు బృహస్పతి.

    అతడి మాటలు నిజం చేస్తూ రంగారావు, సుబ్రహ్మణ్యం అక్కడికొచ్చారు. పేక బయటికి తీస్తూ "డబ్బు తీసి బ్యాంక్ చేయండి" అన్నాడు.

    "నా దగ్గర డబ్బుల్లేవు" అన్నాడు బృహస్పతి. ".... పది బీడీలున్నాయి. వాటితో ఆడతాను"

    "బీడీలా? మేము ఓడిపోతే నీకు డబ్బులివ్వాలా? నువ్వు ఓడిపోతే బీడీలిస్తావా? ఇదెక్కడి న్యాయం...."

    "అదే న్యాయం. మీ దగ్గర లేనిదీ, నా దగ్గర ఉన్నదీ ఒకటుంది."

    "ఏమిటదీ?"

    "మీ సానుభూతి. దానికి మించినది ఇంకేమీ లేదు. నాకే అర్హత లేకపోవచ్చు. కానీ నా దగ్గర డబ్బుల్లేవన్న మీ సానుభూతి చాలు! ఏ అర్హతా లేకపోయినా, మొగుడు చచ్చాడన్న సానుభూతి ఎంత మంది విధవరాళ్ళని అసెంబ్లీలకీ, పార్లమెంటుకీ పంపించడం లేదూ? నాతో కలిసి పేకాడాలన్న అనుభూతి మీకు కావాలనుకుంటే, నా బీడీ ముక్కలనే ఆస్థి స్వీకరించండి."

    "ఒరేయ్! మా మెదడు తినకు. రేప్పొద్దున్న నువ్వు మా అప్పు చెల్లించే షరతుమీద నన్ను ఆడిస్తాం" అన్నాడు హనుమంతరావు.

    ఆ విధంగా పేకాట మొదలయింది.

    ఆట మొదలయిన అరగంటకి అక్కడికో వాన్ వచ్చి ఆగింది. అందులోంచి ఒక ఇన్ స్పెక్టర్ కిందకి దిగింది. ఆ దిగడంలో విజయశాంతి సినిమాల ప్రభావం చాలా ఉంది. లేడిలా ఛెంగున దూకి, సింహంలా దర్పంగా నిలబడి కుడిచేతిలో ఉన్న లాఠీని ఎడమచేతిలో పెట్టుకుంటూ గంభీరంగా 'యూ ఆర్ ఆల్ అండర్ అరెస్ట్' అనబోయింది. అయితే ఉద్యోగంలో కొత్తగా చేరడంవల్ల అంతగా అనుభవం లేకపోవడంతో కాలుజారి (పాపం శమించుగాక), నిలదొక్కుకుని, పక్కనున్న పోలీసుతో "అందరినీ వాన్ ఎక్కించు" అంది అధికార యుక్తమైన కంఠంతో.

    "పారిపోదామా?" రహస్యంగా అడిగాడు సుబ్రహ్మణ్యం.

    "అప్పుడు మరీ పెద్ద కేసవుతుంది" అన్నాడు భయంగా హనుమంతరావు.

    "అవసరం లేదు. నేను మాట్లాడతాను" అంటూ బృహస్పతి ఇన్ స్పెక్టర్ దగ్గరికి వచ్చాడు. "... మేడమ్ మేము ఆడుతున్నది మూడు ముక్కలాట కాదు. రమ్మీ! సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రమ్మీ జూదం కాదు..." అన్నాడు.

    "మిస్టర్! ఐ.పి.సి. సెక్షన్ లన్నీ నాకు కంఠతా వచ్చు. ఏది జూదమో, ఏది కాదో కోర్టులో చెప్పుకుందువుగాని, వానెక్కు" అంది ఇన్ స్పెక్టర్.

    బృహస్పతి ఆమెవేపు సానుభూతిగా చూస్తూ "మీకు ఐ.పి.సి. సెక్షన్ లన్నీ కంఠతా వచ్చా ? అయితే జూదం గురించి ఏ సెక్షన్ లో ఉందో చెప్పండి చూద్దాం" అని ఛాలెంజ్ చేసాడు.

    "షటప్! నీకు వివరణ లిచ్చుకోవలసిన అవసరం నాకు లేదు."

    "వివరణ అవసరం లేదు మేడమ్! కానీ విషయం తెలుసుకోండి పనికొస్తుంది. జూదం గురించి ఐ.పి.సి.లో లేదు. దాన్ని గాంబ్లింగ్ యాక్ట్ అంటారు ఇన్ స్పెక్టర్ అయి వుండీ మీకింత చిన్న విషయం తెలియదంటే మీకే అవ...." అతడి మాటలు పూర్తి కాకుండానే "ఇతన్ని మామూలుగా కాదు, చేతులకి సంకెళ్ళు వేసి ఎక్కించండి...." అని వెళ్ళి ముందు సీటులో కూచుంది.

    వాన్ కి వెనకవేపు తలుపు తీసి అందర్నీ లోపలికి తోసారు. లోపల చిన్న భారతదేశంలా ఉంది. వ్యభిచారిణులూ, బ్రోకర్లూ, పైరవీకారులూ, కాబోయే రాజకీయ నాయకులూ, గూండాలూ అందరూ కిక్కిరిసి వున్నారు. బృహస్పతి వెళ్ళి ఒక వ్యభిచారిణి వళ్ళో పడ్డాడు. "అదృష్టవంతురాలివే! కుర్రాడు కొబ్బరిముక్కలా వున్నాడు" అంటోంది పక్కనున్నావిడ. అందరూ గొల్లున నవ్వారు.

    వాన్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది .అందర్నీ చెట్లకింద నిలబెట్టారు. వీళ్ళని వేన్ ఎక్కించిన పోలీసు దగ్గరకొచ్చాడు. వ్యభిచారుణులు ఒక్కొక్కరూ యాభై రూపాయలచొప్పున యిచ్చారు. ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క రేటు అప్పటికే ఫిక్సు అయివున్నట్టుంది.

    ఆ సంగతి వీరికి తెలీదు.

    డబ్బులిచ్చేసిన వాళ్ళందరూ వెళ్ళిపొతుంటే బృహస్పతి బృందానికి ఏమీ అర్ధంకాలేదు. ఈలోగా పోలీసుల వాళ్ళ దగ్గరికి వచ్చాడు. "మీదేం కేసు! పేకాట కదూ! ఒక్కొక్కరూ వంద యివ్వండి" అన్నాడు హైకోర్టు జడ్జిలా.

    "నేను అంత ఇచ్చుకోలేను" అన్నాడు హనుమంతరావు.

    "నూటయాభై" మొహంలో ఏ మార్పు లేకుండా రేటు పెంచాడు పొట్టి పోలీసు.

    "ఇది అన్యాయం!" అన్నాడు సుబ్రహ్మణ్యం.

    "రెండు వందలు" అన్నాడు పోలీసు.

    "కోర్టుకెళ్ళినా అంతకన్నా ఎక్కువ జరిమానా పడదు. రేపు కోర్టు వెళతాంలెండి పోలీసుగారూ" అన్నాడు బ్రహ్మానందం.

    "ఏంటీ? రేపటివరకూ పోలీస్ స్టేషన్ లో వుంటారా? ఆ లాకప్ రూం ఎంత చిన్నదంటే ఒకళ్ళమీదొకళ్ళు పడుకోవాలి. కింద ఎలుకలుంటాయి. పైన దోమలుంటాయి. మీరు లంచం ఇవ్వలేదని తెలిస్తే మా ఇన్ స్పెక్టర్ గారికి కోపం వస్తుంది. ఆవిడకి కోపంవస్తే మీ ఆస్పత్రి ఖర్చు ఇంతకు పదిరెట్లు అవుతుంది" అన్నాడు పార్లమెంట్ లో రూలింగ్ యిస్తున్నట్లు.

    స్నేహబృందం బెదిరిపోయి "ఇచ్చేద్దాం బ్రదర్" అన్నారు.

    "మీరందరూ ఇస్తే ఇవ్వండి. నేను చచ్చినా యివ్వను" అన్నాడు బృహస్పతి.   

    "ఎందుకివ్వవ్?" కోపంగా అడిగాడు పోలీసు.

    "నా దగ్గర లేవు కాబట్టి" అన్నాడు బృహస్పతి.

    అప్పుడే వచ్చి వాళ్ళ మాటలు వింటున్న ఇన్ స్పెక్టర్ "మిగతా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వదిలేసెయ్. లాకప్ లో ఇతని సంగతి నేను రాత్రి చూసుకుంటాను."

    "పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరాక సున్నితత్వాన్నీ, తెలుగు భాషనీ మర్చిపోయినట్టున్నారు మేడమ్! రాత్రి అన్న పదానికి సెన్సార్ అభ్యంతరం చెప్పవచ్చు" అన్నాడు బృహస్పతి.

    అతడు చెప్పింది అర్ధం కావటానికి ఆమెకో నిమిషం పట్టింది. మొహం ఎర్రబడింది. తానే స్వయంగా లాకప్ లో తోసి తాళం వేసింది. లోపల నుంచి బృహస్పతి అరుస్తున్నాడు. "పవిత్ర భారతదేశంలో నీతికీ, నిజాయితీకి స్థానం లేదని చెప్పడానికి ఇదే సజీవ ఉదాహరణ. నా తల్లిదండ్రుల కింత మానసిక క్షోభ కలగజేసిన ఈ ఇన్ స్పెక్టర్ మీద పగ తీర్చుకునే వరకూ నేను విశ్రమించనని ఈ కాలుతున్న నిప్పుమీద శపథం చేసి చెపుతున్నాను."

    "ఒరేయ్! వీడి దగ్గరనుంచి ఆ బీడీలూ, అగ్గిపెట్టె కూడా లాక్కోండి" అని హుకుం జారీచేసి తన గదిలోకి వెళ్ళిపోయింది.

    "పశ్చాత్తాప పడతారు ఇన్ స్పెక్టర్! ఇప్పుడు మీరు చేసిన ఈ పనికి జీవితాంతం కుమిలి కుమిలి పోతారు మీరు ఎదుర్కొంటున్న దెవరినో తెలుసా? బృహస్పతిని!" లోపలికి వెళుతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి దగ్గరకొచ్చి "ఏం చేస్తావ్?" అనడిగింది.

    "ముందు మీ షర్ట్ బటన్ సరిగా పెట్టుకోండి. తర్వాత చెప్తాను" అన్నాడు.

    ఆమె ఉలిక్కిపడి-

    ఛాతీవైపు చూసుకుని అది [ఛాతికాదు బటన్] సరిగ్గానే ఉండటంతో అతడివైపు కోపంగా చూసింది.

    బృహస్పతి పెదవి విరుస్తూ "మీకు గొప్ప తెలివితేటలు కూడా లేవు మాడమ్. నేను మీ బటన్స్ గురించి చెప్పగానే 'నా బొత్తాం గురించి నీకు అనవసరం' అని బెత్తం జుళిపిస్తే మీరు నిఖార్సయిన ఇన్ స్పెక్టర్ అయి వుండేవారు" అంటూండగా అతడి తండ్రి పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS