Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 3

  

      చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. అరుంధతి పరిస్థితి కాస్త మెరుగయింది కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి ఆమెది. ఉన్నట్టుండి కడుపు నొప్పితో విలవిల లాడిపోతుంది. మందువేసి దానికది తగ్గేవరకు చూస్తూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
   
    బాల్యం అమాయకత్వానికి ప్రతిరూపం కావచ్చు. కాని కొన్ని సంఘటనలు, అభిప్రాయాలు జీవితాంతం గుర్తుండేలా ఆ సమయంలోనే హృదయంలో ముద్రించుకుపోతాయి. తండ్రి ఔన్నత్యాన్ని చూపే అలాటి సంఘటన ఒకటి పావనికి జరిగింది.
   
    విశ్వపతి ఊరినుంచి వచ్చిన మర్నాడే అరుంధతికి విపరీతమైన కడుపునెప్పి వచ్చి అప్పటికప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. కనీసం రెండు నెలలపాటు అక్కడే ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవాలన్నారు. ఆ రెండు నెలలు విశ్వపతి పడ్డ ఆరాటం అందర్నీ కదిలించింది. అరుంధతికి కాస్త నెమ్మదించాక మళ్ళీ ఇంటికి తీసుకువచ్చారు.
   
    అంత హడావిడిలో అమ్మమ్మ, తాతయ్య, అమ్మతో చాలా సేపు గదిలో మాట్లాడారు. తర్వాత వాళ్ళిద్దరూ నాన్నను లోపలకు పిలవడం గమనించి ఆశ్చర్యపోయింది పావని. కుతూహలంగా గుమ్మం దగ్గర నిలబడింది.
   
    "పావనికి చదువు పాడయిపోతోంది. అక్కడకు వెళ్ళాక వయసుకి మించిన భారం నెత్తిన వేసుకోవాల్సి వస్తోంది. ఇటేమో దీని పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. కనిపెట్టుకుని ఉండే వాళ్ళు లేకపోయారు" అన్నాడు తాతయ్య ఉపోద్ఘాతంగా.
   
    "మాది పరిష్కారం లేని సమస్య మామయ్యా చెయ్యగలిగిందేముంది?"
   
    "ఇంత చిన్న వయసులోనే నీకు అన్ని విధాలుగా సుఖంలేకుండా పోయింది. నువ్వు మరో వివాహం చేసుకో బాబూ అది చెప్పడానికే పిలిచాను. నువ్వు ఊ అంటే నా తమ్ముడి కూతురు సుందరి నీకు తెలుసుగా వాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు".
   
    "ఏమిటి మామయ్యా మీరంటున్నది....?" విశ్వపతి కోపంగా అన్నాడు.
   
    "కోపం వద్దు! నేను చెప్పేది పూర్తిగా విని నిదానంగా ఆలోచించు. అరుంధతిని చూసుకుంటూ, పిల్లలకు నీకు అండగా అన్ని అమర్చి చేసి పెట్టె వాళ్ళ అవసరం నీకు చాలా వుంది. పోనీ మన బంధువుల్లో అలాంటి వాళ్ళున్నారా  అంటే ఎవరూ లేరు. సుందరికి ముఫ్ఫయి ఏళ్ల వయసు వచ్చింది. పెళ్ళి చేయగల తాహతు వాళ్ళన్నయ్యకు లేదు. తండ్రి లేడు. తల్లి ఇవ్వాళో, రేపో అన్నట్టుంది. అందరికీ భారం అయిపోయింది. అలాంటి అమ్మాయయితే కృతజ్ఞతాభావంతో పిల్లలను బాగా చూసుకుంటుంది. దానికి అరుంధతన్నా పిల్లలన్నా చాలా ఇష్టం కూడా. ఇది మా నిర్ణయం మాత్రమే కాదు. అరుంధతిది కూడా."
   
    "మీరు చెప్పడం పూర్తయితే నా ఉద్దేశ్యం చెపుతా మామయ్యా! సుందరి అరుంధతికి చెల్లెలు. నాకూ చెల్లెలిగానే అనిపిస్తుంది. అభ్యంతరం లేకపోతే సుందరిని మాతో తీసుకెళతాను. ఓ చెల్లెలిగా చూసుకుంటాను. ఉన్నదాంట్లో ఇంత పెడతాను. ఆమె మాకు భారం అన్న భావం ఎప్పుడూ కలగదు. మరో పెళ్ళి చేసే ఉద్దేశ్యం ఉంటే మంచిదే. సంబంధం సెటిలయితే పంపించి వేస్తాను. నాకు చేతనయిన సహాయం చేస్తాను". అతడు అరుంధతివైపు తిరిగి అన్నాడు. "నీ కిలాంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్ధం కావడంలేదు. నేనెప్పుడయినా సుఖంగా లేనట్లు ప్రవర్తించానా?"
   
    "అదికాదండీ? ప్రొద్దునే లేచి మీరు వంట చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం అన్నీ చేస్తుంటే చూస్తూ వూరుకోలేక అమ్మతో చెప్పాను. నేను నిజంగా ఎంత అదృష్టవంతురాలనో ఇప్పుడు బాగా అర్ధం అవుతోంది."
   
    "భర్త మరో పెళ్ళి చేసుకోననడం అదృష్టంగా భావించే స్థితినుంచి మీరింకా ఎదగాలి అరుంధతీ. వాళ్ళు నా పిల్లలు! నా బాధ్యత నాది!! నేను వంట చేసినా, వొళ్ళు కడిగినా అది తప్పుగా అనుకోకు. వాళ్ళు ఎప్పటికి ఎవరికీ భారం కాకూడదు. అందుకే పిల్లలను ఇక్కడ వదిలి వెళ్ళడం గూడా నాకు ఇష్టం లేదు. ఇకముందు ఇలాంటి విషయాలు ఎప్పుడూ ప్రస్తావించకండి."
   
    విశ్వపతి బయటకు వస్తున్న శబ్దం వినిపించి పావని పక్కకు తప్పుకుంది.
   
    "నాన్న దేవుడు చాలా అరుదయిన మనిషి అతను మాకు నాన్న అవడం అదృష్టం. ఆయన ఎప్పుడూ మనసు కష్టపెట్టుకోకుండా చూసుకోవాలి. ఆయన బాధ్యతలో తనూ భాగం పంచుకోవాలి" అనుకుంది.
   
    తండ్రి మీద గౌరవంతోపాటు తనకు కాబోయే భర్త ఎలా వుండాలన్న ఆలోచనకు అప్పుడే బీజం పడిపోయినట్లు ఆమెకు తెలియదు.
   
    ఆమె జీవితంలో మొట్టమొదటి స్నేహితుడు ఆమె తండ్రి. మొగవాడంటే ఇలా వుండాలి- అన్న అభిప్రాయం కల్గించినవాడు- గౌరవం పెంచినవాడు....
   
    ఆమె జీవితంలో రెండో మొగవాడు భర్త. అతడేం అభిప్రాయం మిగులుస్తాడో కాలమే నిర్ణయించాలి.
   
                            *    *    *
   

    విశ్వపతి రెండో భార్యగా కాకుండా, కేవలం భార్య చెల్లెలుగా సుందరి ఆ ఇంట్లో ప్రవేశించింది.
   
    త్వరలోనే సుందరి ఆ ఇంట్లో ఇమిడిపోయింది. అక్కకు నర్స్ లా సపర్యలు చేసేది. ఇంటిపని, వంటపని అంతా తనే చేసుకుపోయేది.
   
    మొదట్లో విశ్వపతి ఉదయమే లేచి ఇంట్లో ఆడపనులన్నీ చేస్తుంటే సుందరి సిగ్గుపడేది. మెల్లిగా ఒక్కో పనిలో చేతులు కలుపుతూ, యింటి పనుల్లో అతడి జోక్యం లేకుండా చేయడానికి చాలా కృషి చేయవలసి వచ్చిందామెకు. అతడిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ అనిపించేది.
   
    పుట్టింట్లో స్వంత అన్నయ్య దగ్గర పరాయిదానిలా మెదులుతూ, ఓ పీడగా ఎత్తి చూపబడుతూ ఇన్నాళ్ళు ఆమె నరకం అనుభవించింది. ఈ గౌరవం ఇక్కడ లభించడం ఆమె కలలో కూడా వూహించనంత గొప్ప అనుభవం!
   
    పావని అంటే ఆమెకు ప్రత్యేక అభిమానం.
   
    "పావనీ! పరీక్షలు దగ్గర కొస్తున్నాయి. ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా?" దగ్గరగా వచ్చి కూర్చుంది సుందరి. అప్పటికి పావని తొమ్మిదో తరగతిలోకి వచ్చింది.
   
    "ఏమిటి పిన్నీ! నాన్న ఇంకా రాలేదు. తొమ్మిదికల్లా వస్తానన్నాడు. పదకొండవుతోంది."
   
    "పనిమీద వెళుతున్నానని చెప్పారు కదా. ఆలస్యమవుతుందని గూడా చెప్పారు."
   
    "నీకు అర్ధంకాదులే పిన్నీ! నాన్న రావడం కాస్త ఆలస్యమైనా నాకు చాలా గాభరాగా, దిగులుగా వుంటుంది" అంది పావని. ఆ అమ్మాయి మాటల్లో 'నీకీ ప్రేమ అర్ధంకావటం లేదా?' అన్న మందలింపు కూడా కనపడింది.
   
    సుందరి పావని వైపు ఓ క్షణం కన్నార్పకుండా చూసింది. ఆమె కూడా వయసులో మరీ పెద్దదేమీ కాదు. కానీ మంచి లోకజ్ఞానం వుంది. పుస్తకాలు బాగా చదువుతుంది.
   
    తండ్రిమీద అభిమానం వుండడంలో తప్పులేదు. కానీ పావని అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది తండ్రిని! ఈ 'అవసరమైన దానికంటే ఎక్కువగా ప్రేమించటం' అనేది చాలా మందిలో ఆమె చూసింది. ముఖ్యంగా హాస్టల్ లో చదువుకొనే అమ్మాయిలు- ఒకరిని తన 'ఐడియల్ షి'గా ఎన్నుకుని ఇక ఆ మూడు సంవత్సరాలు ఆమె మెప్పుపొందాలని అనుకుంటూ వుంటారు. అది రూమ్ మేట్ అవ్వొచ్చు, బోటనీ లెక్చరర్ అవ్వొచ్చు. 'తను లేకుండా నేను వుండలేను' వగైరా వాక్యాలు డైరీల్లో వ్రాసుకోవటం- తన జీవితం అంతా అవతలి వారి మీదే ఆధారపడి వుందనుకోవటం ఆమె చూసింది! ఆత్మన్యూనతాభావం, ప్రేమలేని, ఆధారపడే గుణం- ఇవన్నీ కలిసి బహుశా ఇలాంటి వ్యక్తుల్ని తయారుచేస్తాయేమో అనుకుంది సుందరి.
   
    కొంత వయస్సు వచ్చేవరకు ఎదుటి వ్యక్తులవల్ల ప్రేరణ పొందవచ్చేమోగానీ, ఆ తరువాతైనా తనంతట తను వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోలేని వ్యక్తులు జీవితంలో చాలా విలువైన 16-24 మధ్య వయస్సుని ఈ ఆరాధనా భావంతో గడిపేస్తారు.
   
    పావని పట్ల సుందరికి భయంగా వుంది. ఆ అమ్మాయికి నిర్దుష్టమైన అభిప్రాయాలంటూ ఏమీ లేవు. సగటు తెలుగు ఆడపిల్ల. కాలంతోపాటు ఆమె మారలేదు. ఏదో రోజులు మామూలుగా గడిచిపోతున్నాయికదా చాలు - అన్న ఆలోచనే ఆమెకి సంతృప్తినిస్తుంటుంది. అది సుందరికి నచ్చదు. పూర్వకాలంలా కాదిప్పుడు. మునుపులేని సమస్యలెన్నో ప్రతుతపు ఆడపిల్ల ఎదుర్కోవాలని ఆమె వుద్దేశ్యం. అయితే ఇవేమీ చెప్పకుండా తన ఆలోచన్లని తనలోనే దాచుకుని "పిచ్చి ఆలోచనలు మానేసి దృష్టి చదువుమీదకు మళ్లిస్తే మంచిది" అంది క్లుప్తంగా.
   
    "పాసయిపోతాలే పిన్నీ" తేలిగ్గా అంది పావని.

    "కేవలం పాసవడం కాదు పావనీ! బాగా చదవాలి! పట్టుదలగా చదవాలి!! మంచి మార్కులతో పాసవ్వాలి. చదువు స్త్రీలకెంత ముఖ్యమో నీకు అర్ధంకావడంలేదు. ఆ చదువే పూర్తికాక నేనెన్ని కష్టాలుపడ్డానో నీకు తెలియదు. ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీకి స్వేచ్చ లేదు పావనీ."
   
    "అంటే నువ్వు మా ఇంట్లో గూడా సంతోషంగా లేవా? ఇక్కడ స్వేచ్చ లేదా?"
   
    "అలా అని నేననలేదు. అది అదృష్టం. అన్ని చోట్లా  అది దొరకదు. ఒక్క మనింటినే ప్రపంచం అనుకోకు. ఎల్లకాలం ఈ నాల్గుగోడల మధ్య వుండేదానివి కావు. ఉద్యోగం లేకపోయినా, కనీసం చడువైనా వుంటే ఎప్పటికయినా అవసరానికి ఆదుకుంటుంది. అనుభవంతో చెపుతున్నాను."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS