Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 2


    ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి "మీరు డాన్స్ చేస్తారా?" అంది.
    అతడు ఉత్సాహంగా "అవును. భరతనాట్యం కాదు. వెస్ట్రన్ డాన్స్ - మానాన్న కిష్టంలేదు__నాన్నకి తెలియకుండా చేస్తాను. అందరికి తెలుసు, మా నాన్నకి తప్ప, పబ్లిక్ సీక్రెట్...."
    ఆ అమ్మాయిలో కుతూహలం పెరిగింది. "ఎక్కడ చేస్తారు మీరు డాన్స్?"
    "హోటల్ గంధర్వలో. చాలా పోష్ హోటల్ అది...."
    "ఇలాంటివి కథల్లో చదవటమూ, సినిమాలలో చూడటమూతప్ప ఎప్పుడూ నిజంగా చూడలేదు."
    "మీరు వస్తానంటే హోటల్ గంధర్వకి నేను తీసికెళతాను." 
    గుమ్మంలో ఏదో చప్పుడయ్యేసరికి ఇద్దరూ తలెత్తి చూసారు. గుమ్మంలో చేతిలో ప్లాస్టిక్ బుట్టతో నిలబడి ఉంది వేద. కొన్నిక్షణాలు ముగ్గురూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ముందుగా వేదే కదిలింది.
    "ఇవాళ మీ నాన్నగారు ఇక్కడికి రాలేదు" అంది ఆ యువకుడిని చూస్తూ. అతడు అకారణంగా సిగ్గుపడి, బెదురుగా గీతనూ, వింతగా వేదనూ చూస్తూ "నాకు తెలుసు, అందుకే వచ్చాను" అన్నాడు. వేద కనుబొమలు ముడిచి తీక్షణంగా "అంటే?" అంది. ఆ కంఠస్వరానికి అతడి గొంతు పొడారిపోయింది. గుండెలు దడదడలాడాయి.
    "మీ నాన్నగారు లేని సమయం చూసుకుని ఇక్కడ ఏం చేద్దామని వచ్చారు?" మళ్ళీ కర్కశంగా అడిగింది వేద.
    "అదికాదు, అదికాదు...." తడబడ్డాడు ఆ యువకుడు. ఎంతో దూకుడుగా వచ్చిన అతడికి విచిత్రంగా మాటలే రావటం లేదు.
    "అదికాదండీ! మీరేం చేసినా అది మీకు తప్పుకాదు. లోకానికీ తప్పుకాదు. అన్ని నిందలనూ భరించటానికి మేము మిగిలాం. తక్షణం ఇక్కడినుంచి వెళ్ళండి. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి!"
    "నేను మీ దగ్గరకి దురుద్దేశంతో రాలేదు" ఇంతసేపటికి రోషంగా అన్నాడు.
    "మరి, ఆ సదుద్దేశమేమిటో!"
    "మీస్వార్ధం, మీసుఖం, మీ సంతోషమే మీరు చూసుకుంటున్నారు. ఇంటిలో మా అమ్మ ఎంత క్షోభ అనుభవిస్తోందో మీకు అర్ధంకాదు. మీ స్వార్ధం కోసం ఒక ఇల్లాలికి ఇంత అన్యాయం చేయటం న్యాయమేనా?"
    వేద ఈ మాటలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. ముఖంలో వేదనా చిహ్నాలు కనిపించాయి. ఒక కుర్చీ అతనికి దగ్గరగా లాక్కుని కూచుంది.
    "నీ పేరు నీరద్ కదూ?"
    "అవును."
    "చదువు అశ్రద్ధచేసి డాన్స్ లంటు తిరుగుతుంటావుట కదూ?"
    నీరద్ ముఖం ఎర్రబడింది. "మీకెలా తెలుసు?" అప్పుడప్పుడు మీనాన్నగారు త్రాగిన మైకంలో నిన్ను తలచుకుని బాధపడుతుంటారు నా దగ్గరున్నప్పుడు. మైకంలోనూ కూడా ఆయనదృష్టి తన పిల్లలూ, తన కుటుంబమూ- వీటిమీదే!"
    "నాకు డాన్స్ లో ఇంటరెస్టు. నేను అది నేర్చుకుంటున్నాను. అందరూ డిగ్రీ చదువులే చదవాలా! అదొక్కటేనా చదువు?"
    "వద్దన్నకొద్దీ వాడు మరింత మొండిగా పట్టుదల సాగిస్తాడు." అని జయపాల్ మాటలు గుర్తుకొచ్చి సన్నగా నవ్వుకుంది వేద.
    "సరే? ఇంతకూ నువ్వు మా ఇంటికి వచ్చింది ఏంచెప్పాలని?"
    "చెప్పానుగా! అమ్మ స్థితి.... ...."   
    "నన్నేం చెయ్యమంటావు?"
    "అది కూడా నేనే చెప్పాలా? మా నాన్నగారిని వదిలెయ్యండి. మీ స్వార్ధంకోసం ఆయనను మీ చుట్టు తిప్పుకోకండి...."
    "మీ నాన్నగారిని నేను నాదగ్గరకు రాకుండా చేస్తే మీ అమ్మగారి కష్టాలు గట్టెక్కుతాయా? ఆయన మరొకరి దగ్గరకు వెళ్ళరని నిశ్చయంగా చెప్పగలవా నువ్వు?"
    నీరద్ మాట్లాడలేదు.
    "నా దగ్గరికి రాకముందు మరెవరి దగ్గరికి వెళ్ళేవారు కాదా, మీ నాన్నగారు?"
    "అప్పుడూ నీరద్ మాట్లాడలేదు.
    "పోనీ, ఇది చెప్పు. మీనాన్నగారు లేని సమయం చూసుకొని ఎందుకొచ్చావు నాదగ్గరకి? ఆయన ఉండగానే వచ్చి, నన్నూ ఆయననూ అడగదలచుకున్నవి అడగచ్చుగా!"
    "ఆయనకి నామీద కోపం వస్తుంది. నన్ను బ్రతకనివ్వరు."
    "కలలో కూడా నీ సౌఖ్యమే కలవరించే నిన్నే కోపం వచ్చినప్పుడు మీ నాన్నగారు బ్రతకనియ్యకపోతే, ఆయన దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి బ్రతుకుతున్నవాళ్ళం - మమ్మల్ని బ్రతకనిస్తారా?"
    నీరద్ మాట్లాడలేదు. 
    "నీరద్! నిన్నేమని పిలవాలో నాకు అర్ధంకావటంలేదు. ఒకసారి నిన్ను ఉద్దేశించి "మన అబ్బాయి...." అని ఏదో చెప్పబోతే. "మనకు వాని వరసలక్కర్లేదు" అని కసిరారు మీ నాన్నగారు - అంచేత నిన్ను పేరుపెట్టే పిలుస్తున్నాను. పరాయివాడన్నట్లే పిలుస్తున్నాను - మీ నాన్నగారి దగ్గర నా స్థితి అంత మాత్రమే! ఆయన అధికారానికి అడుగులకు మడుగులొత్తవలసిన దానినే తప్ప ఆయనపై నాకే అధికారములేదు. నా దగ్గరకు రావద్దని చెప్పే శక్తి నాకు లేదు. చెప్పి ఆయన కోపానికి తట్టుకోగలిగే శక్తి అసలులేదు. నువ్వు ఎలాగైనా ఆయనను రాకుండా చెయ్యగలిగితే చెయ్యి - నేనేమీ బాధపడను."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS