Read more!
 Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 2

    కోడిగుడ్డును కూడా ఎన్నడూ ముట్టుకుని ఎరగని కుటుంబాన్నించి వచ్చిన శిరీష కి నాన్ వేజ్ లేకుండా ముద్ద దిగని లతీఫ్ తో నిత్యం గొడవ జరిగేది.....
    అంతేకాక శిరీష ని మతం తీసుకొమ్మని లతీఫ్ ఒత్తిడి చేయడం వాళ్ళ మధ్య అగాధం సృష్టించింది. ఏడాదిన్నర కల్లా ఆదిత్య పుట్టాడు. ఆదిత్య పుట్టగానే వాళ్ళ ఆచారం ప్రకారం కొన్ని తతంగాలు జరపడానికి వాళ్ళ మనవడి మీద సంపూర్ణ అధికారం సంపాదించడానికి లతీఫ్ తల్లి, తండ్రి రావడం గొడవలు ఎక్కువ అవడం శిరీష బాబుని తీసుకుని లతీఫ్ ని ,ఆ ఇంటిని వదిలి రావడం వాళ్ళ పెళ్ళి విడాకులతో ముగియడం అంతా మరి కొంత కాలానికి జరిగిపోయింది.
    పుట్టింటికి దూరమై , ఇటు భర్తకు దూరమైన శిరీష ఒంటరిగా మిగిలిపోయింది. కూతురు కాపురం కొల్లేరు అయిందని తెలుసుకున్న సుబ్రహ్మణ్యం , లలిత మనసుల్లో కూతురి పట్ల వాత్సల్యం పెల్లుబికి ఆమెని ఆదరించాబోయినా తనని ఇంటి నుంచి వెళ్ళగోట్టారన్న కోపంతో వాళ్ళతో శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంది శిరీష.
    ఆ తర్వాత కొంతకాలానికి తండ్రి చనిపోయినట్లు తెలిసింది శిరీష కి. కొడుకుని వెంట బెట్టుకుని చాలాకాలానికి తను పుట్టి పెరిగిన ఊరుకి వెళ్ళింది. అప్పుడు ఆదిత్యకి ఏడు సంవత్సరాలు... శోక సముద్రంలో ఉన్న లలిత కూతుర్ని మనసారా ఆహ్వానించ లేకపోయింది. పరాయిదానిలా గడిపింది శిరీష రెండు రోజులు. ఆ రెండు రోజులు ఆ ఊరి వాళ్ళంతా తనని తిడుతున్న తిట్లు, చేస్తున్న విమర్శలు భరించలేక కొడుకుని తీసుకుని వెంటనే హైదరాబాదు వచ్చేసింది. అదే ఆఖరు ఆమె తన ఊరికి వెళ్ళడం.
    ఆ తర్వాత ఆమెకి మళ్ళీ పెళ్ళి చేసుకునే అవకాశం వచ్చినా చేసుకోలేదు.... పెళ్ళి మీద నమ్మకం కోల్పోయిన శిరీష తన కొలీగ్ వివేక్ తో సహజీవనం ప్రారంభించి ఐదేళ్ళు అవుతోంది. వివేక్ ని ఒక అత్మీయుడిగా , ఒక బంధువుగా తప్ప ఇంకో విధంగా ఆదిత్య కి తెలియకుండా జాగ్రత్త పడింది. తన జీవితం ఎవరికీ తెలియకుండా తననెవరూ ఎలాంటి ప్రశ్నలు వేయకుండా తన చుట్టూ తానే గంబీరత అనే కంచే బిగించుకుని అందులోనే ఉంటూ ఆదిత్యను కూడా అందులోంచి బైటికి రానీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అటూ, ఇటూ కూడా బంధవులు ఎవరూ లేకపోవడంతో ఆ ఇంటికి ఎవరూ రారు.
    ఇదంతా తెలియని అదిత్య మాత్రం ఎప్పుడైనా ఈ ఇంటికి ఎవరన్నా రాకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. తల్లి తండ్రుల రంగు, ఆ అందం పుణికి పుచ్చుకున్న ఆదిత్య తెలివైన వాడు కూడా.... అతడు బాగా చదువుకుని మంచి పొజిషన్ లో ఉండాలని శిరీష కోరిక. 
    ఆదిత్య తండ్రి గురించి అడగకుండా ఉండాలని తండ్రి లేని లోటు రానివ్వకూడదని  ఎంతో ప్రయత్నించినా అప్పుడప్పుడూ ఆదిత్య తండ్రి గురించి అడుగుతుంటే శిరీష కి ఏం చెప్పలేక కోపం వచ్చేస్తుంది. సమయానికి ఏదో కుంటి సాకులు చెప్తుండేది. కానీ, తన సమాధానాలు తనకే సంతృప్తినివ్వక పోవడంతో ఈ మధ్యే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.... ఇంకోసారి ఆ ప్రశ్న వేస్తె తను కూడా ఎటన్నా వెళ్ళిపోతానని బెదిరించింది. దాంతో మనసులోనే అన్ని ప్రశ్నలు దాచుకుని మౌనంగా బాధపడటం మొదలు పెట్టాడు ఆదిత్య.
    గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టడంతో శిరీష తన పుస్తకాల్లోంచి బైటికి వచ్చి ఆదిత్య అంటూ కేకేసింది....సమాధానం రాలేదు.... ఆమె లేచి వంట గదిలోకి వెళ్ళి తయారు చేసిన వంటలు ప్లేట్లు డైనింగ్ టేబిల్ మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఓసారి పిలిచింది. "ఆదిత్యా....డిన్నర్ చేద్దాం రా.."
    ఆదిత్య పలకలేదు. అనుమానంగా ఆదిత్య గదిలోకి వెళ్ళిన శిరీష స్టడీ టేబిల్ మీద తల పెట్టుకుని నిద్రపోతున్న అదిత్యని చూసి గట్టిగా అరిచింది "ఆదిత్యా..."
    ఆదిత్య ఉలిక్కిపడి లేచాడు.
    "నీకసలు బుద్దుందా? టైం ఎంతో తెలుసా! డిన్నర్ చేయకుండా నిద్రేంటి? ఇలా నిద్రపోతూ ఉంటే నువ్వు డిగ్రీతో చదువాపేసి గుమస్తా గా బతకాలి చెప్తున్నా....లే, లేచి మొహం కడుక్కుని రా భోం చేద్దాం."
    ఆదిత్య కి కళ్ళు మూసుకు పోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో లేవాలని లేదు.. అన్నం కూడా తినాలనిలేదు...కాని ఆ మాట చెబితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు.... అందుకే మత్తుగా వాలిపోతున్నా బలవంతంగా లేచి వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కుని డైనింగ్ టేబిల్ దగ్గరకు వచ్చాడు.
    "కూర్చో...."
    కుర్చీ జరపుకుని కూర్చుని కంచం ముందుకు జరుపుకున్నాడు.
    ఆరోజు ఆదిత్య కాలేజీ నుంచి వచ్చేటప్పటికీ అపార్ట్ మెంట్ ముందు పెద్ద లారీ ఆగి ఉంది.... చాలా ఖరీదైన సోఫాలు, రిఫ్రిజిరేటర్ , వాషింగ్ మిషన్ లాంటి పెద్ద వస్తువులే కాక, అట్టపెట్టెలు కొన్ని బీరువాలు, డైనింగ్ టేబిల్ అవన్నీ లిప్టు లో పైకి తీసికెళ్ళడం జరుగుతోంది.... లిఫ్ట్ నిండా వాళ్ళ సామానే ఉంది. ఏదో ప్లాట్ ఖాళీ అయినట్టుంది. ఇంకెవరో వచ్చినట్టున్నారు అనుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు.
    అప్పటికి శిరీష ఇంకా రాలేదు. అప్పుడప్పుడు ఆమె ఇలా లేటుగా రావడం అలవాటే....ఉదయం వెళ్ళేటప్పుడే చెప్తుంది లేటుగా వస్తాను. "నువ్వు టి.వి. చూస్తూ కూర్చోక చదువుకో." అని, ఆరోజూ అలాగే చేసింది. చస్తే చదువుకోను అనుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కునిప్లాస్టిక్ డబ్బాలో ఉన్న స్వీటు, మిక్స్ చర్ ప్లేటులో పెట్టుకుని వచ్చి బాల్కనీ లో నిలబడ్డాడు.
    ఆ బాల్కనీ ఆదిత్యకి చాలా ఇష్టం. అక్కడి నుంచి చూస్తె బైట ఏం జరుగుతుందో తెలుస్తుంది. శిరీష వెహికిల్ కూడా సందు మలుపు తిరగ్గానే కనిపిస్తుంది.అది చూడగానే కామ్ గా వెళ్ళి చదువుకోవచ్చు. ఆ ధైర్యంతో నే అక్కడ నిలబడి కుతూహలంగా లారేలోంచి తీస్తున్న సామాను చూస్తున్నాడు.
    ఇంతలో దాదాపు తన వయసే ఉన్న అమ్మాయి పొడుగాటి స్కర్ట్ , టాప్ వేసుకుని వచ్చి లారీ లోంచి ఒక సూట్ కేసు చాలా అపురూపంగా తీసుకుని లోపలికి లాక్కుని వెళ్ళి పోయింది. సామాను మీద నుంచి ఆ అమ్మాయి మీదకి ఆదిత్య కాన్ సేన్ ట్రేషన్ పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కుతూహలంగా చూస్తూ కూర్చున్నాడు. ఆమె నాలుగైదు సార్లు అలా బైటకి రావడం, యేవో సామాను తీసుకుని లోపలికి పోడం చూస్తుంటే అవేవో ఆమెకి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. బహుశా ఆమె బుక్స్, బొమ్మలు అయి ఉంటాయి. అనుకున్నాడు. ఎందుకో ఆ క్షణంలో సగం సేపు ఈ అమ్మాయితో ఫ్రెండ్ షిప్ అయితే బాగుండు అనిపించింది ఆదిత్య కి . మళ్ళీ వెంటనే నిరశగా నిట్టూర్చాడు . అలాంటి అమ్మాయిలూ చాలామంది ఉన్నారు ప్లాట్స్ లో . తను ఎవరితో మాట్లాడడు తనతో వాళ్ళెవరూ మాట్లాడరు. అదేంటో అమ్మ మాట్లాడనంత మాత్రాన వాళ్ళు మాట్లాడ కూడదని లేదుగా.... ఈ ప్లాట్ కి వచ్చి రెండేళ్ళు అవుతోంది. అప్పటి నుంచీ కూడా ఎవరితో పరిచయం లేకపోవడం విచిత్రమే అనుకున్నాడు ఆదిత్య.
    అయితే, తమాషా జరిగింది.... జీవితంలో కొన్ని సంఘటనలు చాలా యాదృచ్చికంగా జరుగుతాయి. ... కొన్ని పరిచయాలు జరగడానికి పెద్ద ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు. మర్నాడు కాలేజీకి వెళ్ళడానికి లిప్ట్ లో దిగుతుంటే కనిపించింది ఆ అమ్మాయి. ఆదిత్యను చూడగానే పలకరింపుగా నవ్వి "హాయ్ " అంది. ఆదిత్య ముందు ఖంగారు పడ్డాడు. తరువాత తనూ 'హాయ్' అన్నాడు.
    "మీదే ప్లాటు' అడిగింది.
    'సెకెండ్ ఫ్లోర్ ...202...'
    'ఓ ....మాది ధర్డ్ ఫ్లోర్ ....301 ....నా పేరు ప్రఖ్య.
    "ఆయామ్ ఆదిత్య...."
    "గుడ్....ఏం చదువుతున్నావు?" వాళ్ళ సంభాషణ లిప్ట్ లోంచి దిగాక కూడా కొనసాగుతోంది. ఆ సంభాషణ అలా గేటు దాకా సాగింది. అప్పుడే ప్రఖ్య కూడా తనలాగే ఇంటర్ ఫైనల్ ఇయర్ అనీ విల్లామేరీ కాలేజీ లో చదువుతోందని ఆమె, వాళ్ళమ్మ ఇద్దరే ఉంటారని తెలిసింది. అంతేకాదు, ప్రఖ్య కి కైనెటిక్ హుండా ఉంది. బంజారాహిల్స్ నుంచి సోమాజిగూడా దాకా బండి మీద వెళ్తుంది. ఆదిత్య కి సిగ్గేసింది. ఛ తనకి బండి లేకపోవడం ఏంటి, అమ్మ ఎందుకు కొనలేదో ఇవాళే తనకి బండి కొనమని అడగాలి అని నిర్ణయించుకుని ప్రఖ్య కి బై చెప్పి బస్ స్టాప్ వైపు వెళ్ళిపోయాడు.
    అలా పరిచయమైనా ప్రఖ్య అతి త్వరలోనే అతని ఒంటరి జీవితంలోకి చల్లని స్నేహ పరిమళాలను వెదజల్లుతూ ఎంటర్ అయింది. ఇద్దరూ చదివేది ఒకటే, ఇద్దరి సబ్ జేక్టు ఒకటే.... ఇద్దరూ వారి, వారి కుటుంబాల్లో ఒంటరివాళ్ళే.... కాకపొతే ప్రఖ్య తల్లి పూర్తిగా అల్ట్రా మోడరన్..... జీన్స్ ప్యాంటు, పొడుగాటి టాప్స్ వేసుకుని జుట్టు భుజాల దాకా కత్తిరించుకుని ఎప్పుడూ లూజుగా వదిలేసి, ఉంటుంది. ఆమె సాప్ట్ వేర్ ఇంజనీరు.... బోలెడు డబ్బు సంపాదిస్తుంది. చాలా ఫ్రీగా , హాయిగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరినీ లక్ష్య పెట్టనట్టు చాలా నిర్లక్ష్యంగా , డైనమిక్ గా ఉంటుంది.
    అంతేకాక ఆదిత్యా, ప్రఖ్యా కాలేజీ నుంచి వచ్చే టైం కూడా ఒకటే అవడం మూలాన సాయంకాలాలు కూడా రెండు మూడు సార్లు అప్రయత్నంగానే ప్రఖ్య ఆదిత్య తటస్థ పడ్డారు. వాళ్ళు ఇంటి కొచ్చే టైం కి అటు ప్రఖ్య తల్లి భానుప్రియ కానీ, శిరీష కానీ ఇంటికి రారు. అంచేత ఇద్దరూ కలిసి ప్రఖ్య ప్లాట్ కి వెళ్ళి  కాస్సెపు కబుర్లు చెప్పుకుని, ఏవో చిరుతిళ్ళు తినడం , శిరీష ఇంటికి వచ్చే సమయానికి తానూ ఇంటికి వెళ్ళిపోవడం అలవాటు అయింది ఆదిత్య కి.
    ఆ పరంపర లోనే ఆదిత్య భానుప్రియ కంట పడ్డాడు. అతని నెమ్మదితనం, ముచ్చటైన రూపం చూసి, భాను చాలా మురిసి పోయింది. "నీ పేరు ఆదిత్యా.....గుడ్ మా ప్రఖ్య కి మంచి ఫ్రెండ్ దొరికాడన్నమాట బాగా చదువుకోండి." అంటూ ప్రోత్సహించింది ప్రఖ్య  అదిత్యని పరిచయం చేసిన రోజు.... 

 Previous Page Next Page