Read more!
 Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 3


    అయితే శిరీష కింకా ప్రఖ్య సంగతి , వాళ్ళ స్నేహం సంగతి తెలియదు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడని శిరీష తను ప్రఖ్యతో మాట్లాడడం తెలిస్తే ఏం గొడవ చేస్తుందో నని ఆ విషయం ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఆదిత్య.
    ఆరోజు ఆదివారం .శిరీష ఇల్లు క్లీన్ చేసుకుని, బట్టలు వాషింగ్ మిషిన్ లో వేసి, వంటపని పూర్తీ చేసుకుని అప్పుడే హాల్లోకి వచ్చింది. టి.వి అన్ చేయబోతుండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన శిరీష ప్రఖ్య ను చూసి ఆశ్చర్యపోయింది. "ఎవరు కావాలమ్మా?" అడిగింది మృదువుగా.
    "నమస్తే అంటీ ... నా పేరు ప్రఖ్య. మేము రీసెంట్ గా ధర్డ్ ప్లోర్ లోకి షిప్ట్ అయ్యాము. నేనూ ఆదిత్యా ఫ్రెండ్స్ కూడా అయాం. ఆదిత్యా వున్నాడా"...గబగబా మాట్లాడింది.
    "అలాగా" తనకి తెలియకుండానే ఇదంతా ఎలా జరిగింది అనే ఆశ్చర్యంతో చూస్తూ నెమ్మదిగా అంది "లోపలికి రా...."
    ప్రఖ్య లోపలికి వచ్చింది. తన గదిలో కూర్చుని ఉన్న ఆదిత్య కి ప్రఖ్య గొంతు వినిపించింది. చటుక్కున లేచాడు కుర్చీలోంచి. అతను బయటకి నడుస్తుండగా శిరీష స్వరం వినిపించింది "ఆదిత్యా ....నీ ఫ్రెండు వచ్చింది...."
    ఆదిత్య కొంచెం బెదురుగా అక్కడికి వచ్చాడు.
    ప్రఖ్య నవ్వుతూ "హాయ్ ఆదిత్యా...." అంది.
    "హలో...." నవ్వుతూ అన్నాడే కానీ, అతని స్వరంలో , శీరిష వైపు చూసిన చూపులో జంకు స్పష్టంగా గమనించిన ప్రఖ్య ఆశ్చర్యంగా చూసింది.
    "ఆదిత్యా ....నాతొ వస్తావా?" మా ఫ్రెండ్ దగ్గర నోట్స్ తెచ్చుకోవాలి....."
    "ఎ ఎక్కడ?" అడిగాడు ఆదిత్య.
    "సికింద్రాబాద్ నా స్కూటి మీద వెడదాం ఒన్ అవర్ లో వచ్చేద్దాం..."
    ఆదిత్య శిరీష వైపు చూశాడు.... ఆడపిల్ల అంత ధైర్యంగా ఉన్నప్పుడు తన కొడుకు అలా చూడడం శిరీష కి నచ్చలేదు.
    "లంచ్ అయాక వెళ్ళచ్చు కదా." అంది ప్రఖ్యని ఉద్దేశించి.
    "వెళ్ళచ్చు....అయితే నేను కూడా లంచ్ చేసి వస్తాను." లేవబోయింది ప్రఖ్య.
    "మా ఇంట్లో చేయకూడదా...." నవ్వింది శిరీష.
    "వై నాట్" భుజాలు ఎగరేస్తూ తన అంగీకారం తెలిపింది ప్రఖ్య.
    తల్లి, ప్రఖ్య ని అంత ఆప్యాయంగా , పాజిటివ్ గా రిసీవ్ చేసుకోడం ఆదిత్యకి చాలా సంతోషాన్ని కలిగించింది. హమ్మయ్య అమ్మకి ఒక్కళ్ళన్నా నచ్చారు అనుకున్నాడు.
    భోజనాలు చేస్తూ అవీ, ఇవీ మాట్లాడుతోంటే ప్రఖ్య తల్లీ డైవోర్సీ అని తెలిసింది. ప్రఖ్య కూడా ఆదిత్య లాగా ఒక్కతే ఆమె తల్లికి.
    శిరీష కి ఆ కుటుంబంతో స్నేహం చేసుకోవాలన్న చిన్న కోరిక అప్పుడే కలిగింది. ఇద్దరూ ఒకటే పడవ లో ప్రయాణం చేస్తున్నారు.... కాబట్టి ఆమె తనని అర్ధం చేసుకోగలదు.... మిగతా వాళ్ళలా మీ ఆయనేం చేస్తాడు? మీఅత్తగారు వాళ్ళు రారా? మీకెంత మంది పిల్లలు? లాంటి టిపికల్ క్వశ్చన్ అడగదు అలా అడిగి తనని ఇబ్బంది పెట్టదు అని ఖచ్చితంగా అనిపించింది. అందుకే అంది ప్రజ్ఞతో "ఓసారి మీ అమ్మగారిని కూడా ఇంటికి తీసుకురా."
    "ఓ ష్యూర్ ..." గుండ్రంగా తల తిప్పింది ప్రఖ్య.
    అరగంటలో భోజనం కానిచ్చి ఆదిత్యా, ప్రఖ్యా కైనిటిక్ హోండా మీద బయల్దేరారు.
    తక్కువ వ్యవధిలోనే ఆదిత్యా, ప్రఖ్యల స్నేహం పరిమళం భాను, శిరీషల దాకా వ్యాపించింది. త్వరలోనే ఇద్దరూ మంచి స్నేహితులై పోయారు. వీకెండ్స్ ఇద్దరిలో ఒకళ్ళ ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేసుకుని నలుగురూ కలిసి డిన్నర్ చేయడం, ఆ తరవాత ఆదిత్యా, ప్రఖ్యా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయి చదువుకోడం, శిరీష- భాను కూర్చుని కష్టసుఖాలు కలబోసుకోవడం మామూలైంది.
    భాను ప్రియది కూడా లవ్ మ్యారేజ్....ఆమె తండ్రి పెద్ద బిజినెస్ మాన్.... బోలెడు ఆస్తి ఉన్న కుటుంబం.చిన్నప్పటి నుంచీ భానుప్రియ పూర్తిగా స్వతంత్యంగా, స్వేచ్చగా బతకడంతో ఆమె స్వేచ్చా జీవితం స్పేడ్ బ్రేకర్స్ లేని హైవే లా మారింది. తను చేసేది తప్పైనా, ఒప్పుగా భావించడం , అందరి చేతా అది ఒప్పని ఒప్పించేలా చేయడం భానుప్రియ ప్రత్యేకత.  
    వివాహం అయిన కొద్ది రోజులకే అతనికి ఆమెలోని విశ్రుంఖల స్వభావం నచ్చలేదు. అత్తగారి మాటలకి గడ్డి పోచ విలువ ఇవ్వకుండా , ఒద్దన్న డ్రెస్ వేసుకోడం, ఒద్దన్న చోటికి వెళ్ళడం, శివప్రసాద్ తట్టుకోలేకపోయాడు. ఫలితంగా రోజూ దెబ్బలాటలు, వాగ్వివాదాలు . అలాగే వాళ్ళ సంసారం సాగుతూ ఒక పిల్లకి తల్లి అయింది భానుప్రియ.
    శివప్రసాద్ తల్లి, తండ్రులు పూర్తిగా అర్ధడాక్స్ , భాను వేషధారణ, ఆమె జుట్టు అలా వెళ్ళాడేసుకొడం , ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళతో మాటా, పలుకూ లేకుండా కూర్చోడం వాళ్లకి చిరాగ్గా ఉండేది. ఆమె చక్కగా చీర కట్టుకుని, జడ వేసుకుని జడలో మూరెడు పూలమాల పెట్టుకుని అసలు, సిసలైన తెలుగింటి ఆడపడుచులా ఉండాలని కోరిక.
    కానీ అందుకు పూర్తీగా విరుద్దం భాను.... ఫలితంగా గొడవలు, మాటల యుద్దాలూ...
    కనీసం కూతురి కోసం అయినా తన పద్దతులు మార్చు కుంటుందేమో అని ఆశించిన అత్తగారు, మావగారు ఆమె మారదని నిర్ణయించేసుకున్నారు. శివప్రసాద్ కూడా ఆమె ప్రవర్తనకి విసిగిపోయాడు. ఒకరోజు ఖచ్చితమైన అల్టి మేటమ్ ఇచ్చాడు. "ఆడదానివి .... ఆడదానిలా ఉండు ప్రియా! మాది పూర్తిగా సాంప్రదాయ కుటుంబం ...నీ పద్దతులు మార్చుకోకపోతే పరిస్థితులు వికతిస్తాయి.."
    మండిపడింది "ఏం జరుగుతుంది?" అడిగింది కోపంగా.
    "మనం విదిపోతాం." ఖచ్చితంగా అన్నాడు శివప్రసాద్.
    భానుప్రియ విసిగిపోయింది. అసలే ఓర్పు, సహనం తక్కువగా ఉన్న అమ్మాయి. ఇన్నాళ్ళూ శివప్రసాద్ , అతని కుటుంబ సభ్యులు తరచూ తన పట్ల చేస్తున్న కామెంట్స్, తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆమెకి నచ్చకపోయినా తను ఉండడం లేదా? ఇలా మాట్లాడతాడా?" యెంత ధైర్యం అనుకుంది.
    ఆఖరికి తన స్వేచ్చా ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది... వెంటనే కూతుర్ని కూడా తనతో తీసుకుని బైటకు వస్తూ శివప్రసాద్ కి అల్టి మేటం ఇచ్చింది...."నీ తల్లి, తండ్రులను కుటుంబాన్ని వదిలి వస్తేనే నా దగ్గరకు రా... లేకపోతె రానవసరం లేదు" అని. శివప్రసాద్ అహాన్ని దెబ్బ తీసిన ఆ అల్టి మేటమ్ పని చేయలేదు.... రెండేళ్ళ లో విడాకులు తీసుకుని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుని అమ్మా, నాన్నలకి నచ్చినట్లు బతుకుతున్నాడు శివప్రసాద్.
    అంతా విన్న శీరిష అంది. "బొత్ ఆర్ సెయిలింగ్ ఇన్ ది సేమ బొట్.... ఇంతకాలం నీలాంటి మంచి స్నేహితురాలు లేక నా చుట్టూ నేనొక గిరి గీసుకున్నా....అదే గిరి ఆదిత్య, చుట్టూ కూడా గీశాను....నా జీవితం వాడి మౌత్ పబ్లిసిటీ కాకూడదని.... నౌ అయామ్ హ్యాపీ భానూ...."
    భాను కూడాశీరిష స్నేహ హస్తాన్ని అపురూపంగా అందుకుంది.
    వాళ్ళ స్నేహంతో పాటే ఆదిత్యా, ప్రఖ్యాల స్నేహం కూడా చిగుళ్ళు తోడిగి పూలు పూయసాగింది... కలిసి చదువుకోడం, కలిసే టైము గడపడం, ప్రఖ్య స్వభావం లో వాళ్ళమ్మే .... పూర్తీ ఇండివిడ్యువాలిటీ ఉన్న అమ్మాయి... ముక్కుకు సూటిగా వెళ్తుంది. మనసులో ఏ భావం దాచుకోదు. మోహన ఫేడీమని కొట్టినట్లు సమాధానం చెబుతుంది. అలా అని చెడ్డది కాదు. ఆమెకి భవిష్యత్తు మీద అప్పటికే ఎన్నో ఆశలు, ప్రణాళికలు... ఆదిత్య కి అవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇంతవరకూ నాకో లక్ష్యం అంటూ ఎందుకు లేదు? నేను భవిష్యత్తు లో ఏం అవాలో ఇంకా నిర్ణయించు కోలేదేందుకు? అని ఆలోచిస్తుంటాడు.
    అప్పుడప్పుడు ప్రఖ్య అడుగుతుంటుంది. "నీకసలు ఒక ఎయిమ్ లేదా" అని.
    "ఉంది లేకేం....నేను ఒక మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకుని బోలెడు మంది పిల్లల్ని కంటాను. ఇల్లంతా కళకళ్ళాడుతూ ఉండాలి నాకీ ఒంటరితనం బోర్ కొట్టేసింది....ఎంచక్కా ఇంటి నిండా మనుషులుంటే ఎంత బాగుంటుంది?"
    ఆమె చిత్రంగా చూస్తూ అంది "అంతమంది ఇంట్లో ఉంటె చిరాగ్గా ఉండదూ! చదువెలా సాగుతుంది?"
    "ఏం? గంపెడు పిల్లలున్న ఇళ్ళలో పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు లేరా?" అని అడిగాడు ఆదిత్య.
    "ఏమో బాబూ ....నాకు చాలా బోర్ అంతమంది ఉంటె.... హాయిగా ఎంచక్కా ఒక్కళ్ళమే ఉంటె హాయిగా వితవుట్ డిస్టర్బెన్స్ చదువుకోవచ్చు. రాసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు."
    ప్రఖ్య మాట్లాడుతుంటే ఆదిత్యకి చాలా ఆశ్చర్యంగా అబ్బురంగా కూడా ఉంటుంది. తన అభిప్రాయాలు అలా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. ఎంతైనా ప్రఖ్య కి చాలా ధైర్యం అనుకుంటుంటాడు.

 Previous Page Next Page