2
శనారం పొద్దుమీకి బువ్వలు గిట్టతిని అంత బయిలెల్లిన్రు. బండిబాట లేదుకాని, కాలిబాట పొంటె మంచిగ పోతున్రు. ముచ్చట్లాడుకుంట, పదాలు పాడుకుంట దొరల్లెక్క నడుస్తున్రు. హవ్ మల్ల! దొరల్లెక్కనే. బాద, బరువు అంట ఏందో తెలీని రోజుల్ల అందరట్లనే ఉంటరు. ఊర్ల కెల్లి పది పన్నెండు మంది పిలగాండ్లున్నరు. అందరు కలిసి యాటకు బోతున్రు.
యాటకు బోడమంటే పిలగాండ్లకు ముచ్చటయితది. సూడాలె, పోవాలంట ఉరుక్కొస్తరు. పెద్దోండ్లు రానియ్యరు. అందుకోసానికి అంతకలిసి గురువుకాడికి పోయిన్రు. గురువంటే ఎవరో ఎరికెనా? ఉస్కెగంపలు మోసెడి సాలాయన.
వీండ్లు అడగంగనెగురువు సరెనన్నడు. రేయి యాటయినంక పెద్దమైసరానికి బోతమంటనుకున్నరు. మరుసట్రోజు బువ్వ తినాలెకడ? అందుకోసానికి బియ్యం, పప్పు, ఉప్పు గిట్ట అని ముల్లె గట్టుకపోయిన్రు. జొన్న రొట్టెలు కూడా తెచ్చుకున్నారు. ఒకని సేతుల గాఁసు లైటున్నది. ఇద్దరు ముగ్గురు తన్న బరిసె లున్నయి గురువు సేతుల తుపాకిఉన్నది.
సీకటి జిమ్ముమంట ముసురుకున్నది. కండ్లల ఎలుగే దివ్వెలు సేసుకుని సూస్కుంట వడుస్తన్నరు. ఆమాస దగ్గిర పడుతున్నది. అందుకోసానికె సీకట్లట్లున్నయి.
"సీకట్ల బయిమయితున్నాదిర?" అంటడిగిండు గురువు. "ఏమిలే" దన్నరు పిలగాండ్లు.
"బయిమయితుంటే అనుమాన్లు దండకం సదుగుతం!" అన్నడు యోగయ్య.
"ఒకని సెయ్యి ఒకల్లు పట్టుకుంట నడండి!" అన్నడు గురువు.
వాండ్లు అట్లనే నడుస్తున్నరు.
కొంచెం దవ్వు పోయెతతికి పొలాలుగిట్ట ఎనక పడినయి. ముంగల జీబురుమంట సీకట్లు! యాదొకూత యినిపించింది.
యాదగిరి కొంచె మాగిండు.
యోగయ్య ఎనకడుగేసిండు.
నర్సిగాడు నక్కినక్కి సూస్తండు.
నాగయ్య కండ్లే మూసుకున్నడు.
గురువు యీండ్ల బయం కనిపెట్టిండు. ఎంతయిన సిన్నోండ్లు కద! గాఁసులైటు తీస్కని పుల్లేసి ఎలిగిచ్చిండు. దాంత యాడి బయమాడికి వోయింది. ఒక్కక్కల్లు స్పెంగుమంట ఉరుకుతున్నరు.
ఆడినిల కొచ్చిన్రు. బాట ఎనకటి లెక్క నక్కగ లేదు. లోపలికి పోత ఉంటే సెట్టు సెట్టుకీ మలుపు కనిపిస్తున్నది.
పుల్లు, సిట్టపుల్లు వస్తయంట బయమయింది ఒకనికి. జాగిరాలు పట్టుకుంటయేమొ అనుకున్న డింకోడు. మోకాలు ఏమిసేసినగాని, పాములు, జెర్లు పాకొస్తయంట వొనికిండు ఏరెవోడు.
అందరికి లోపల బయం జవజవలాడుతనే ఉన్నది. కాని పవురుసానికి ఒకని మొగం సూసి ఒకడు నోరు మూసుకున్నడు.
గూబల అరుపు వినిపిస్తున్నయి. కోతుల కిసకిస వినిపిస్తున్నయి.
ఈ సీకట్ల, యీ అడివిదాటి పానాల్తో యింటిముకం సూడగల్దుమా, అనుకున్నరు. గాలికీ ఆకులు గిన సప్పుడయితే సాలు, ఒక్కసారి ఉరికి పక్కోని కరిసి పట్టుకుంటున్రు.
వీండ్ల బయం సూసి నవుకున్నడు గురువు. ఉశారుగ ముచ్చట్లాడుకుంటవోతె పొద్దోతదను కున్నడు.
ముంగల నాగూరి సెట్లకు, సర్లెంగ సెట్లకు నడమ, మారపటాకు తీగల ఎనక ఎవలో మాటేసి నట్లున్నది. జరసేపు ఆడ నిలవడి, పిలగాండ్లకు మాటు సూపిచ్సిండు. మాటంటే ఏందీ, ఎట్లెట్ల ఏస్తరూ, మెకాలను పట్టెదెట్లా, కుందేళ్ళను కొట్టెదెట్లా అంత సెప్పిండు మంచిగ. సెప్తనే వాండ్లను నడిపిస్తుండు.
"ఇగ్గో సూసినవా, చంద్రం? గిదె నీలమారి సెట్టు. అది నెట్టారు సెట్టు. నీకు సెట్లంటే యిష్టమని నాకెరికనే కద! అందుకోసానికె సెప్తున్న" అన్నడు.
"మంచిగ కనిపియ్యటంలే!" అన్నడు చంద్రం.
"రేప్పొద్దుగాల సూబిస్తలే. ఇంక, నక్కెర సెట్లున్నయి; కలిని సెట్లున్నయి; సిలకేశ్రం సెట్లున్నయి; ముండ్లంత దంతె సెట్లున్నయి. రకరకాల సెట్లు యీడ లెస్సగున్నయి."
గురువు మాటాడత ఉండగనె, దివ్వెసూసి ఎలుగ్గొడ్డోటి దవ్వుకు పాతతం చూసిన్రు.
గా పిలగాండ్లల, ఎలగొడ్డును తొల్త అప్పుడే సూసినోండ్లు శానమందున్నరు.
ఒక్కోనికె యెన్నంటే సెవఁట్లు కారినయి.
గురువు పెద్దగ వగిండు.
మల్ల జెర ముంగలికి పోతుంటే తెల్లగ, పిల్లి లెక్క దుముక్కుంటపోత కనిపిచ్చింది.
అగ్గో అంటే అగ్గో అంట అందరు దాన్నె సూసిన్రు.
గురువు తుపాకి బుజానికి నెట్టి, గురిసూసి కొట్టిండు. ఆ సప్పుడికి అడినంత మారు పలికింది.
కుందేలు జాడ లేకుండే.
తుపాకి దెబ్బకు యింత సప్పుడయితదని చంద్రం కూడ ఎన్నడిన్లే! వానికి దానిమీద మనుసెక్కొచ్చింది.
"నేను పట్టుకొస్త. యియ్యి, మామా!" అన్నడు చంద్రం.
"నువ్వు మొయలేవుకద! ఊటముంటది!" అన్నడు గురువు.
"పరవలే! నేతెస్తకద?"
"అచ్చ! అట్లయితెతే. కిందకు వడగొట్ట కుండ మంచిగ బుజం మీద నెట్టుకొని మోస్క స్తవా?" అంటడిగిండు. అట్లనే తెస్తనన్నడు చంద్రం.
అందరు ముంగలికి నడుస్తున్రు.
తుపాకి బుజెం మీద నెట్టుకోని దొరలెక్కనే నడుస్తుండు చంద్రం. వాని దొరతనమంత అండ్లనే కనిపిస్తున్నది. దోస్తులంత వానికి యీ దిక్కు, ఆ దిక్కు నడుస్తున్నరు, చంద్రం తుపాకి పట్టుకొని నడుస్తుంటే, పిలగాండ్ల బయమంత పోయింది.
ఇంతల ఎడమ దిక్కుకు ఆకుల్ల గల్లుమంట సప్పుదయింది. పిలగాండ్ల ఎంట్రుకలు ముండ్ల లెక్కలేసి నిలిసినయి.
గురువు సప్పుడయిన దిక్కుకు సూసిండు. సూసి, చంద్రం సేతుల తుపాకి దొబ్బున లాక్కున్నడు.
గురిసూడా, దెబ్బకొట్టా-అన్నినిముసంలోనే అయినయి.
కుందేలు కీసుమంటం అందరిన్నరు.
గురువు నగిండు.
పిలగాండ్ల కప్పుడెరికెయింది, కుందేలు పడ్డ దంట.
"ఎవలు తెస్తర్రా?" అన్నడు గురువు.
ఎవలు ముంగలికి రాలే.
నే తెస్తనన్నడు చంద్రం.
గురువు నగిండు. "ఊకె అన్నగాని, నువ్వెందుకులె!" అన్నడు. తానె తేబోయిండు.
మల్ల తుపాకి గురువు సేతులకెల్లి అందుకొని చంద్రం ఎంబడె పోయిండు.
కుందేలు సచ్చి ఉన్నది.
చంద్రం సప్పట్లు సరిసిండు.
గురువు కుందేలు కాల్లు అందుకొని పట్టుకున్నడు. ఇద్దరు బాటమీ కొచ్చిన్రు.
పిలగాండ్లంత సుట్టుత మోగిన్రు. వాండ్లు సూస్తండగ కుందేలు వడతం తొల్తనే అది. వాండ్లల అరొక్కడు తానె సంపినట్ల ముచ్చట పడిండు.
"నేను పట్టుకొస్త. నాకియ్యి!" అన్నడు నాగయ్య. గురువు కుందేల్ను వానికిచ్చిండు.
యాటదండు పోతున్నది. మల్ల ఒకటి రొండు కుందేళ్ళు దొరికినయి. ఒకటి చంద్రంచేతనే గురువు కొట్టిసిచ్సిండు. అంటే, చంద్రంకొనాకు పట్టుకున్నడే కాని, కొట్టింది గురువునే అయిన, వానికది గొప్పనే.
పిలగాండ్లకు యింక ఉశారయింది. సిట్టపుల్ని కొడత నంటడోడు. ఏన్గను కొడ్తనంటు యింకోడు. లొట్టిపిట్ట ఏదంటడు ఏరెవోడు.
వాండ్లలో అంత యీరులెక్కునే నడిసిన్రు.
రేయి మూడో జాముల సందమామ సన్నగ మీదకొచ్చిండు. ఆకకు సందులకెల్లి ఎన్నెల పడ్తున్నది.
పిలగాండ్లు శానమందికి నిద్దరముగం పడినది.
గురువుకు మెరుపులెక్క ఊగతగిల్నది. సుట్టు సూసిండు అడివిల శానదవ్వు కొచ్చిన్రు. గాడికి దగ్గర్లనే కుర్వ ఉన్నదంట్ల యాదొచ్చినది వాండ్లల నిద్దరముగం నర్సిగాని సూసిండు.
"ఏమిర, నర్సిగ! కుర్వ మీకి పోదమొస్తవా?" అన్నడు.
ఆ మాటకు నర్సిగానికంటే ముందుగల చంద్రం అన్నడు-"పోదం, మామా! గాడ మంచి గుంటదిలే!" అంట.
చంద్రం పోదమనెతలికి నర్సిగాని నిదరకూడ పోయినది. పిలగాండ్లంత పోదమంట తొందర సేసిన్రు.
"అయితె, నా ఎన్కనె మంచిగ సూసుకుంట రాన్రి. బండలుంటయి; బాదులుంటయి. అడుగు సక్కగెయ్యాలె. లేకుంటే దొల్లిపడ్తరు!" అన్నడు.
గాఁసులైట్ల ఎల్తురు జర తగ్గుతుంటే అదేందో పట్టుకొని దబ్బ దబ్బ కొట్టిండు. ఎల్తురు ఎన్న లెక్కయింది. వాండ్ల ముగాలన్ని ఎన్నతిన్నట్లే ఎలిగినయి.
అడుగుల్ల అడుగులేసుకుంట కుర్వమీకి నడిసిన్రు.
పెద్ద మయేశ్రం కుర్వ లెస్స ఎత్తుగున్నది. ఒకలిద్దరు నడవలేకుంటే గురువన్నడు కద-"ఏం దిర, అట్ల నడుస్తరు, పెండ్లివాండ్లలెక్క? ఉశారుగ నడ్వాలె. దీపం లేకుండ రామంట్రి" అంట.
కిందమై సరంల నవలింగాల గుడ్లున్నయి. అనుమంతుని గుడి ఉన్నది. పంచలింగాల గుడ్లు న్నయి. జంటలింగాల గుడ్లున్నయి, లోతుగ కోనేరున్నది. ముత్తాలమ్మ గుడున్నది.
కిందమైసరం కెల్లి పెద్ద మైసరం కుర్వమీకి అయిదునూర్ల దన్క సీడీలున్నయి.
పైకి పోంగనే కుడిశేతి దిక్కుకు దూలిగుండమున్నది. పైకెల్లి నీలు దారగ పడతంటయి. ఆ సప్పుడడింటనే పిలగాండ్లు ఆడనె నిలుసున్రు.
"ఇప్పుడేమి సూస్తరు? గాడ సూడున్రి. పక్కకు సివుని గుడి ఉన్నది. అవతలి దిక్కుకు యీరబద్రుని ఆలయమున్నది. సెన్నకేశవులున్నడు. బసవ గుండమున్నది. రుద్రదారున్నది. పాపనాసుమంట మల్ల యింకో దారున్నది. గుడి పదెచ్చనం కోపాన్కి కుర్వమీకెల్లి బాటున్నది. బొయ్యారం తన్న జంగాల మటమున్నది. మల్లని యిగ్గిర మున్నది. గయి సూడాలె!" అన్నడు గురువు.
"యాష్టొస్తున్నది, మామా! జరసేపు యీడ కూసుంటం!" అన్నడు చంద్రం.
మంచిదన్నడు గురువు. అందరు కూసున్రు.
ఇంక జాము రేయున్నది.
ఆడ కొండమామిడి సెట్టున్నది. కింద కట్టెలున్నయి. అంత కలిసి కట్టెలు తెచ్చిన్రు. గురువు పుల్ల గీసి నెగడు నేసిండు. గుడిముంగల పెద్ద నెగడు లేఁగనె అందరు సుట్టు కూసున్రు.