"ఇగ్గో, అక్క! నువ్వేమన్న అనుకో, ఒక్క మాటమాత్రం యిను. సెందిరిగాని తరీక ఏమి మంచిగ లేదు. ఊర్ల వీండ్లత, వాండ్లత తిరిగి ఆడు పాడయితున్నడు; ఏరె పిల్లగాండ్లను కూడ పాడు సేస్తండు. అందుకోపానికి వాన్ని జర సక్కగ సేస్తరని చెప్పెల్లేందు కొచ్చిన తర్వాత మీ యిష్టం!" అని ఊకున్నడు లక్ష్మయ్య.
"ఆమె మాటకేందిలే, లచ్మయ్యా! ఆడొచ్చి నన్క నేను సూస్తలే!" అని సుట్ట తాగెతందుకు మొగ్గం గుంతలకెల్లి లేసిండు రుశి.
బావ గింత మెల్లగ మాటాడంగ లక్ష్మయ్య ఎన్నడు యిన్లే. కాని, అండ్ల కిటుకు సుంకులమ్మకే ఎరికె.
లచ్మయ్య వచ్చిన పని అయినద. "వస్త నక్కా!" అంట సెప్పిండు.
"మంచిది!" అన్నది సుంకులమ్మ.
"ఎల్తను, బావా!" అన్నడు. అంటుండగనె చంద్రం ఆడికొచ్చిండురుక్కుంట.
బావనారుశి సూసిండు వాన్ని, సూస్తనె, గాడ మూల్లకెల్లి లాకదబ్బ తీసుకున్నడు.
బారపాడుగు లాకదబ్బ గీడనించి గాడకిసిరి కొట్టీతల్లికి, కాల్లుటక్కరయి దబ్బుమంట పడ్డడు చంద్రం.
గ్గా యిసురు సూస్తనే ఉరికింది సుంకులమ్మ. పిలగాన్ని పాదూకొని కాపెట్టింది.
బావనారుశి ముంగలి కొచ్చిండు.
"నా బిడ్డను కొట్టొద్దు! నీకాల్మొక్కుత!" అంట కాళ్ళ మీద పడిందామె.
రుశి యిన్లే అట్లనే వాని కాల్లు సూసి మల్ల మల్ల కొట్టిండు.
చంద్రం నాయనకు మొక్కుతనే ఉన్నడు. ఎక్కెక్కి ఏడుస్తనే ఉన్నడు.
"వాని మాటందుకోని, బిడ్డను ఏందిట్ల సంపుతవ్?" అన్నది సుంకులమ్మ.
ఆమాట లక్ష్మయ్య గుండెల గుచ్చుకుంది.
"ఊకో, బావా! పిలగాని నట్లెందుక్కొడ్తవ్?" అంట అడ్డ మొచ్చిండు. రుశి ఆడిత ఆగిండు.
"ఓరి సెంద్రిగ! రేపటిసంది యిల్లు దా టెల్లినవంటే బొక్క పలగ్గొడత! యా దుంచుకొ!" అంట ఉరిమిండు.
చంద్రం ఏడుస్తనే ఉన్నడు.
సుంకులమ్మ, తమ్ముని నోట్ల తిట్టుకుంటనే ఉన్నది.
బావనారుశికి మల్ల మొగ్గం జొర్రెతందుకు మనుసు కుదరలే. పిలగాన్ని గొడ్డును బాదినట్ల బాత్తనే ఉన్నడుకాని, మనసుల ఎంతనో పస్త యించిండు. గదంత వానిమీద కోపంకాదు-బామ్మర్ది అట్లన్నందుకు.
తనకొడుకు తనకంటే మంచిగనే బతకాలంట అనుకున్నడు రుశి. సాలెపన్ల సుకపడినోడు లేడంట వానికెరికెనే. అనబమే. 'అయిన కాని పెద్దోండ్లకు పిలగాండ్లు సాయం సెయకుంటే నడిసెడిది లేదుకద! అందుకోసానికే కష్టమంట తెలిసికూడ, అట్ల సెయక తప్పదు మల్ల. దునియ తరీకెట్లుంటే అట్లనే పోవాలె. ఇయ్యాల ఒక్కసారి మారిపోదమంటే నిలవ గలుగుదుమా? మందిత బాటే మనం కూడ!' అనుకున్నడు.
పొద్దు సర్రన పాకుత ఉంది. బావనారుశి మొగ్గం మీన ఎంటెంత అట్లనే ఉన్నది. సనుగు జల్ది కోయాలంట యాదొచ్చింది. మల్ల మొగ్గం జొరిండు. కుడిపాకోడు తొక్కుతడు. అని తెరుసు కుంటది. కుడిశేత్త నుంచుబట్టి లాగుతడు. నాడె, కుడెంపు తొట్లకెల్లి ఎడమ దిక్కుకు పారతది. అప్పుడు ఎడంశేత్త పలగ్గొడతడు. పోగు దగ్గిర పడతది. మల్ల అని మూస్తడు. ఎడమ పాకోడు తొక్కుతడు. ఎడమ అని లేస్తది. సుంచు లాగుతడు. ఎడమనించి కుడికి నాడె పారతది. మల్ల పలగ్గొట్టి అని మూస్తడు. అట్లా సేతులు, కాల్లు, కండ్లు అన్ని దానిమీదనెట్టి పని సేస్తనే నేసకమయితది. బావనారుశి అట్లనే నేస్తండు. నేస్త నేస్త, దానికే అలవాటు పడిండు. అండ్ల కెల్తే మల్ల, పక్కకు తల తిప్పెతందుకు కూడ పుర్సతుండదు. అట్ల!
"మామ మంచోడు కాదు, అమ్మా!" అన్నడు చంద్రం.
"తప్పు, బిడ్డా! మన మామనె కద? అట్లెట్ల మంచోడు కాడు?" అన్నది సుంకులమ్మ.
"నాయనత సెప్పి నన్ను కొట్టిపిచ్సిండుకద?"
"లే, బిడ్డా! మామ కొట్టమన్లే! నువ్వు యింట్ల ఉండడం లేదంట సెప్పి మీ నాయననె కోప మయి కొట్టిండు."
"అమ్మా! సదుకుంటం తప్పునా, అమ్మా?"
"లేదు, బిడ్డా! నువ్వు బయపడకు. నిన్ను బడికి నేను పంపుత కద!మంచిగ సదూకో! నువ్వు మీ మామకంటె పెద్ద సవుకారు కావాలె, నూర్ల మొగ్గాలు నేసిచ్చాలే! యిన్నవా?" అన్నది సుంకులమ్మ.
ఈమాట, ఆమాట సెప్తనే, కొడుకుకు గురిగెల గెంజి పోసి తాగిసిచ్చింది.
తాగుతనే మల్ల ఉరికిండు చంద్రం.
'ఎర్రి పిలగాడు!' అనుకున్నది.
"ఈడెట్ల దార్ల బడతడో, ఏమి కతనో?" అనుకున్నడు బావనారుశి.
బావ, మల్ల యింట్లకెల్లి సారొచ్చినందుకు ముత్తాలుకు సంతోషమయింది.
"బడికి పోతనన్నవు కద? మల్ల ఏమిటి కొర కొచ్చినవ్?" అంటడిగింది ముత్తాలు.
"నీకోసానికె?" అన్నడు చంద్రం.
"నన్ను గూడ గొంత్సుబోతవా?"
"మల్ల? నువ్వు రాకుంటే నేనెట్లబోత?" ముత్తాలు సాగునుగ నవుకున్నది.
"అట్లయితే నడు, బావ! పోదం!" అన్నది.
"నాష్ట గిట్ట తిన్నవా?"
"లే!"
"మల్ల, మా యింట్లకు రా గెంజి తాగిపిస్త!"
"ఒద్దు, బావా! మల్ల ఎందుకొచ్చినవంట అత్త తిడ్తది."
"అచ్చ! అట్లయితే పోదంలే! పా!"
ఇద్దరు పోతున్రు.
గాడ, కుమ్మరిగూడెంకాడ ఒగ్గోల్లు కత సెప్తున్రు. ముత్తాలు సూసింది.
"ఏంది, బావ? కతనా?"
"హవ్!" అన్నడు చంద్రం.
"ఏమి కత?"
"ఏమి కతనో ఏందో? ఎల్లమ్మ కతనో, మల్లమ్మ కతనో! ఒగ్గోల్లు సెప్తున్రు. ఇంటవా?"
"కత మంచిగుంటదా?"
"ఇంటె తెలుస్తది కద?"
"మల్ల, బడికి పోబన్లే?"
"ఈయాలకు కత యిందం. రేపు కత కావాల్నంటే వొస్తదా? బడికి రేపు పోదంలే, నడువ్!' అన్నడు చంద్రం.
ఇద్దరిద్దరు సేతుల్ల సేతులు కలుపుకోని దుమ్కుకుంటగాడికి పోయిన్రు.
ఒగ్గోల్లల్ల ముగ్గురు నిలుసున్రు. నడవాఁయిన కత సెప్తుండు.
అది బీరప్ప కత. బీరప్ప కురమోళ్ళ దేమ్డు. అందుకోసానికి, ఒగ్గోల్లు కురమో ళ్ళిండ్లకు బోయి యిట్ల కతలు సెప్పుకుంట అడుక్కుంటరు వాండ్లు బతి కెడిదే అట్ల.
ముత్తాలు, బావగాడకు బోయి మందిల కూసున్రు. ఒగ్గాయిన కవ సెప్తుండు.
"బీరప్ప అసలు బామ్మడు. నారింగశెట్లకు నీలు పోయంగ నమ్మి నారజవుఁడు జలమెత్తిండట. సూరినికి నమస్కారం సెయ్యంగ అలుగుల సూరమ్మ జలమెత్తిందట.
"ఈడేరి సూరమ్మ యిల్లెల్ల లేదు. కడతేరి సూరమ్మ కడప దాటలేదు. నమ్మి నారజవుఁడు పెండ్లి సేసుకున్నడు. సూరమ్మ కింక కాలే.
"సూరమ్మకు దగ్గ బాలున్ని అడివికెల్లి బర్మయ్యని దేవులాడుకొస్తడు. సెల్లిని యిమానం చేస్తడు! పెండ్లిచేసి, నెత్తిల యిత్తులు దలపక ముందే అక్కడ అడివికి తోలుకపోలేడు. తోలుకపోయి సూరమ్మని, బరమయ్యని సివుని గుళ్ళకాడికి తీసుకపోయి, ఆడ పండనెట్టి, వాండ్లు నిదరపోను జూసి ఎల్లొస్తడు. ఆఁవె అక్కడ వలపోత పోతది. ఆ బగమంతుడు ముచ్చాల వాన, వొజ్రాల వాన కురిపిస్తడు. కురిపించిన తరవాత, యీ వజ్రాలు, ముచ్చాల ముడితే ఏమి దోసమో, పడితే ఏమి దండగనో అని ముట్టుకోదు.
"అప్పుడు సెంకరుడు వొచ్చి, 'యిక్కడ సుసిగన్నట్టు సూరమ్మ పట్నం పొందాలె. అక్కడ సుట్టూ గొల్లలు, కురమలు పాలు అమ్మ, పెరుగు అమ్మ పట్నంలోపలికి పోవాలె' అన్నడు. అట్లనే అయింది.
"గొల్లలు, కురమలు పట్నంలోపలికి వస్తున్రు; పోతున్రు. వాండ్లకు పాలు, పెరుగు మంచిగ అమ్ముడు పోతున్నయి. అప్పుడు వాండ్లు, 'సూరమ్మ పట్నం మంచిదమ్మ, నారజవుఁడు పట్నంగ ఒస్తుంటరు. ఒస్తుండంగ, అక్కడ నారజవుఁడు యింటడు. ఇని, 'ఎక్కడి సూరమ్మ? యాడి సూరమ్మ?' అనుకుంటడు.
"అక్కడ, ఆమె కడుపుల బీరప్ప జల్మ మెత్తుతడు. తరువాత అమ్మకు తల్లిగా రింటిమీద బుద్దులు పుడతయి. అన్నను రమ్మని సెప్పంపు తది.
"అప్పుడు నారజవుఁడు యిసపన్నాలు వొండుకోని, బారియ బట్టల సల్ది కట్టుకోని, గోనె టెద్దు మీదేసుకోని, ఆ ఎద్దుకు ఆయ గట్టకుండ గంత కట్టుకోని, తూరపు గాలొస్తే తూరుపుగ ఎల్తడు.
"అక్కడకు కొట్టకపోయి గోనె టెద్దుని సద్ది దించ్సతడు. 'అగ్గో, మాయన్న వొచ్చిం'డని సెప్పి నీల్లు తీసుకోని వస్తది సూరమ్మ, ఆ నీల్లు అన్న సేతి కియ్యగానె, కడుపులో బీరప్ప ఆ నీల్ల సెంబును బోర్ల నూకుతడు. ఆ బురద తీసుకోని నారజవుఁడు కాళ్ళ కద్దుకుంటడు. ఆ సద్ది గొనబోయి అక్కడ సీల కొయ్యకు యాస్తడు. "అక్కడ ఏం చేస్తరంటి-అన్నం తయారు చేసి రమ్మంటే-నారజవుఁడు, "ఏమన్నం కాని, యీడ తాపం చేసెతందుకు ఉతకాలు దొరకయి, పురుగు ముట్టని పువ్వు కావాలె, కప్ప ముట్టని గాతం కావాలె' అన్నడు. 'సరె, సరె అన్న! నేను తెస్తగాని, యిక్కడే నిలుసుండు' అని సెప్పి ఆయనన్నిలవెట్టి సూరమ్మ ఆటికోసం పోద్ది.
"అడివిలోపల ఉతకాలు దొరకవు. కడుపుల ఉన్న కలిమాత్ముడు బీరప్ప, అక్కడ యాడ కూడ ఉతకాలు దొరకనివ్వడు. అక్కడ ఒక భాయి; కచ్చ్లలు, కోరెందలు సెట్లున్నయి. ఆ భాయిల నీల్లున్నయి. నీల్లకోసం సూరమ్మ, ఒక్కొక్క మెట్టు దిగుతా ఉంటే, ఉసికె మీదికయితుంది; నీల్లు కిందకయితున్నాయి.
"హా! దిగలేక సూరమ్మ ఆష్టకొన్నది. బయిలెల్లింది. కట్టుకొన్న కొంగు సెంబుక్కట్టి భాయిల ఏసింది. అక్కడ సెంబునిండ నీల్లయి నాయి. దానికి, బీరప్ప కడుపుల ఉండి ఏడు సిల్లులు వెట్టిండు. ఆ నీల్లు ఎంతకు దొరకనివ్వలేదు.
"సూరమ్మ ఎనక్కు మల్లి వొచ్చినాది. వొచ్చె వరకల్ల-యీ సూరమ్మ పట్నంల, 'నార జవుఁడు యిసపన్నం బట్ట తగిలి, ఏడుగురు దాసిల్ల ఒక దాసి సచ్చింది. ఎలకలు, పిల్లులు సచ్చినయి నీల్లల్ల మచ్చెలు సచ్చినయి.
"బీరప్ప సచ్చిన్నోళ్ళను మొత్తం లేపిండు. బీరప్ప పుట్టు, బుఝారం నాడు పుట్టిండు. సుక్కురారం మైలలు. పుట్టి అందర్ని లేపుకున్నడు. పట్నం పొందిచ్చుకొని ఉన్నడు.
"బీరప్ప పుట్టిన్నాడు నారజవుఁనికి తలపాగ కింద పడ్డది. తలనొప్పిలేసి పండిండు.
"బీరప్ప పుట్టిన మతలాబు నారజవుఁనికి తెలిసింది. ఖట్కిల తోలిచ్చిండు, పల్లాగ్గట్టిచ్చి సెల్లెతానికి పోతడు. 'పిల్లగాన్ని ఉంచొద్దు! మేనమామ కీడు, తల్లిదండ్రుల కీడు, ఎక్కడన్న పదసర్ల జెయ్యాలి, సెల్లె! చండాలే పిల్లవా'డని సెప్పి మూడు మాట్లు మీద కెగేసిండు.
"పల్లకీలో కెత్తుకున్నడు పిలవాన్ని. పోతుండంగ, కాంచాలమ్మ మర్రి ఉండది. మర్రిఊడ పట్టుకోని పిల్లగాడు చెట్టుమీకీ పాకిండు!"
కత యింటున్న ముత్తాలు సంతోసమయి, దబ్బ దబ్బ సేతులు సరిసింది. చంద్రం ముత్తాలును నూసి నగిండు.
"ఇన్నవా, నారజవుఁడెసొంటోడో?" అంటడిగిండు.
"బీరప్ప మంచిగ సేసిండులే!" అన్నది ముత్తాలు.
"ఆడు నా అసొంటోడు" అన్నడు చంద్రం.
"అంటే, మా నాయన నారజవుఁడునా?" అన్నది కండ్లు తిప్పతా.
"గ్గదీ మాట!" అంట ఆమె ముక్కు అందుకోని ఒక్కటే నలుపుడు.
ఒగ్గాయన సెప్పుకుపోతుండు.
"బొక్కల బోగన్న, బోలాయి బయ్యన్న, రెబ్బకి రేవన్న, ఎరకాటి సిద్ధన్న, కాసిల కడవన్న, ఉండ్రాల్ల ఉబ్బుకొండ, కత్తెర బయ్యన్న-ఏడుగురు బోయీలు గొల్రుకాడ ఆడివిలకాపున్రు.
"పెండ్లి కాని బోయవాడు గొల్రు కాస్తే యీనేది యీనబోదు; కట్టేది కట్టబోదు.
"ఆడ, నారజవుఁనికి ఏడుగురు బిడ్డలున్నరు. చిన్న రేగులమ్మ, పెద్ద రేగులమ్మ, నీలికాని, మోవిలంగి, అలుగుల సూరమ్మ, అక్క నాగమ్మ, కడగొట్టిది కామర్తమ్మ"
కత యిననీకుండ బావ ఒక్కటే ముక్కు నలుపుడు.
"ఇగ నే పోత!" నన్నది ముత్తాలు.
"అయితే నేను కూడొస్త. పా!" అంట లేసిండు చంద్రం.
"మా యింటి కొస్తవా?" అంటడిగింది.
"ఎందుకు?"
"ఉడుకుడుకన్నం మీద గింత మొసరు ఏసి పెడ్తది, మాయమ్మ!" అన్నది.
"మీ నాయన మంచోడు కాదు. నాను రాను. పో!" అంట ఉరికిండు చంద్రం. ముత్తాలు ఎనకాల సూస్తనే ఉన్నది.