Previous Page Next Page 
మహాశక్తి పేజి 5

    "పిచ్చివేషాలేస్తే కిందికి లాగిపడేస్తాను." అంటూనే అతనికి చేతిని అందించింది చిత్ర.

    అతను దిగి ఆమె వెనుక కదిలాడు.

    ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. అక్కడున్న చెరువుగట్టు దగ్గరికి ఆమె వయ్యారంగా నడుస్తోంది.

    అప్పటికే చీకటిపడింది. చెరువుగట్టుకు అవతలున్న పొలాల పైనుంచి చల్లని పైరగాలి హాయిగా వీస్తోంది.

    పౌర్ణమి రోజు కావడంతో చంద్రుడు వడివడిగా ఆకాశంలోకి ఎగబ్రాకుతున్నాడు.

    ఈశ్వర్ కొన్ని క్షణాలపాటు ఆ మనోహర వాతావరణాన్ని తిలకిస్తూ నిలబడిపోయాడు.

    ఒక్క అడుగు ముందుకేసి చిత్ర వంక చూశాడు.

    కేళాకూళిలో వికసించిన కుముదినిలా ఆమె ముఖంలో కాంతిరేఖలు కనబడుతున్నాయి.
   
    అసమాన సౌందర్యం చిత్రది. బ్రహ్మదేవుడు కఠోరమైన తపస్సుచేసి మలచిన అందం ఆమెది.

    ఆమె అడుగు తీసి అడుగు వేస్తోంటే అక్కడ ఒయ్యారం ఒలికిపోతోంది.

    పసిమిరంగు.

    కోలముఖం.

    చెందమ్మి రేకుల్లాంటి చెంపలు.

    చిన్న నవ్వుకి సైతం వంకర్లు తిరిగే అధరాలు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే బ్రౌన్ కలర్ కళ్ళు.
    కొనతేలిన ముక్కు. దిద్దిన కనుబొమలు. నున్నని మెడ, మెడ కిందుగా ఎత్తయిన గుండెలు.

    ఆమె కట్టుకున్న సిల్క్ చీర గాలికి ఆమె శరీరం నుంచి జారిపోయేలా ఉంది.

    పవిట జారుతుంటే చేత్తో పట్టుకొంటోంది.

    ఆమె అతని కేసి చూసింది. కనురెప్పలు రెపరెపలాడాయి.

    అడుగు ముందుకేశాడు ఈశ్వర్. ఆమె కూడా ఓ అడుగు వేసింది.

    ఇద్దరి మధ్యా దూరం తగ్గి దగ్గరవుతున్నారు. ఆమె అతని భుజాలపైన చేతులు వేసి అతని ముఖంలోకి చూసింది.

    ఆ తరశేక్షణని సందిట బంధించి, అధరాలని చుంబించాలని ఆమె చెంపలని చేతులతో స్పృశిస్తూ ముఖాన్ని దగ్గరగా తీసుకొన్నాడు ఈశ్వర్.   

    "ఇప్పుడు నీకేమనిపిస్తోంది?" మెల్లగా అడిగింది చిత్ర.

    "యీ అందమైన ప్రపంచంలో మనిద్దరమే ఉన్నామని?"

    ఆమె మెల్లగా తలని అతని గుండెపైన ఆనించింది.

    మెల్లగా  కదులుతున్న నీటిని చూస్తూ "మన ప్రేమగీతాన్ని యీ జలరాశిపైన రాయనా?" అన్నది చిత్ర.

    "జలాక్షరాలవుతాయి?" అతని మాటకి ఉలిక్కిపడింది చిత్ర. అంతలోనే సర్దుకొని తియ్యగా నవ్వింది చిత్ర. ఆమెలో క్షణంపాటు కలిగిన కలవరాన్ని గమనించిన ఈశ్వర్ పొరపాటుగా మాట్లాడానా అనుకున్నాడు.

    "ప్రతి నీటిబిందువూ ఏకమై మన ప్రేమగీతాన్ని గొంతు కలిపి ఆలపిస్తుంది ఈశ్వర్."

    "ఐ లవ్ యూ."

    "ఐ టూ."

    ఆమె పెదవుల్ని మృదువుగా అందుకున్నాడు ఈశ్వర్.

    "థాంక్యూ సోమచ్."

    "దేనికి?"

    "ఇంత తియ్యని ముద్దుని నా కీ వేళ బహుమతిగా ఇచ్చినందుకు."

    "విశేషం......"

    "మొద్దూ, నీ కేదీ గుర్తుండదు. యీ వేళ యీ అమ్మాయిగారు పుట్టారని మరచిపోయావా?"

    ఈశ్వర్ ముఖంలో రంగు మారింది.

    "ఓహ్. అవును కదూ? సారీ చిత్రా? యీ రోజు జరిగిన గొడవతో మరిచిపోయాను. నీకు కనీసం బహుమతి కూడా తేలేదు."

    "యూ ఫూల్! డబ్బుతోనూ, వస్తువులతోనూ ప్రేయసికి బహుమానాలివ్వరు ఎవ్వరూ?"

    "మరి ఏం ఇవ్వాలి?"

    "నాక్కావల్సింది నీకు తెలీకుండానే ఇచ్చేశావు. స్వీట్ కిస్. నాకా బహుమానం చాలు. నా పెదవులపైన నువ్వు వేసిన ముద్రని తొలిప్రేమ కానుకకి చిహ్నంగా ప్రతి క్షణమూ గుర్తుంచుకుంటాను."

    "ఓకే. ఓకే. మరి యీ వేళ పుట్టిన యీ బుజ్జిపాపాయిని ఎత్తుకోవచ్చా?"

    "ఎత్తుకోవచ్చు చేతనయితే ఆడుకోవచ్చు కూడా!" కొంటెగా నవ్వింది చిత్ర.

    "అప్పుడే ఆడుకోవచ్చా?"

    "ఆడుకొనే వయసొచ్చిన పాపాయితో ఆడుకుంటేనే అందం కదూ?"

    ఆమె నడుం చుట్టూ చేతులు వేసి పాల సముద్రపు అంచులాంటి పొట్టపైన ముద్దు పెట్టుకున్నాడు ఈశ్వర్.

    ఆమె క్షణంపాటు పులకింతతో మైమరచి కళ్ళు మూసుకుంది.

    అతని చేతులు కిందకి జారుతున్నాయి.

    ఆమె పొడుగాటి వేళ్ళని అతని జుత్తులోకి పోనిచ్చి తలని గట్టిగా పొట్టకేసి నొక్కుకొంది చిత్ర.

    "ఇక వెళదాం! చాలా ఆలస్యం అయింది" అన్నాడు ఈశ్వర్.

    "ఉహుఁ. నాకు రావాలని లేదు. ఇక్కడి నుంచి కదలాలనిపించడంలేదు."

    "మీ డాడీ కంగారుపడతారు?"

    "కాబోయే అల్లుడి దగ్గరకెళ్ళానని డాడీకి తెలుసు."

    "చిత్రా?"

    "ఊఁ!"

 Previous Page Next Page