Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 27

    "అందం చీరవల్ల మనిషికి రాదు. కట్టుకున్న మనిషివల్ల చీరకి అందమొస్తుంది. కొందరు ఎంత మంచి చీర కట్టుకున్నా. ఆ చీర అందం పోతుంది. కొందరికి ఎంత పిచ్చి చీరైనా, కొట్టొచ్చినట్టు ఎంతో అందంగా ఉంటుంది." వివరించాడు ఫణి.

    "అచ్చు ఆడవాళ్ళలా మాట్లాడుతున్నావు" అంది హర్షిత.

    "ఏం! మాటలు ఆడవాళ్ళకే వచ్చా?"

    "ఫణీ! నీకీపూట పనేంలేదా? తీరిగ్గా ఈవేళప్పుడొచ్చావ్? అయినా టైం ఈజ్ మనీ కదా నీకు?" చెప్పింది హర్షిత.

    "అదుగో ఆ మాటలే వద్దన్నాను. డబ్బెవరికి చేదు? ఆనంద్ కి వొద్దా? నీకొద్దా? అయినా ఏమిటో కొందరు నాలా ముద్రపడిపోతారు. అంత డబ్బే ముఖ్యమనుకొంటే, ఇప్పుడు నిన్ను చూడ్డానికెందుకొస్తాను?"

    "అదే నాకర్ధం కావడం లేదు" అంది దువ్వెనతో చిక్కులు తీసుకొనడం పూర్తిచేసి, వొదులుగా జడల్లుకుంటూ.

    "రాత్రి నువ్వు కల్లోకొచ్చావు"

    ఉలిక్కిపడింది హర్షిత. "నేనా?" అంది ఆశ్చర్యంగా. ఆమె కళ్లు అతడి మనస్సునూ, అతడి కళ్ళనూ చదవడానికి ప్రయత్నిస్తున్నాయి. రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. బాత్ రూం వెంటిలేటర్ లోంచి చూస్తున్న కళ్ళు ఆక్షణంలో ఫణి కళ్ళలాగే అనిపించాయ్. ఆనంద్ ఆ మాటలను కొట్టి పారేయడంతో ఆ అనుమానాన్ని తానూ తోసిపుచ్చినా, ఎందుకనో పూర్తిగా ఆనంద్ తో ఏకీభవించలేకపోతోంది. అలాగని అవి ఫణి కళ్ళేనని చెప్పలేకపోతోంది.

    "హర్షితా! ఏమిటలా కొత్తగా చూస్తున్నావ్ నాకేసి?" అడిగాడు ఫణి.

    అతని మాటలతో ఈ లోకానికొచ్చిపడింది హర్షిత.

    వెంటనే తమాయించుకుంది.  "ఏం లేదు ఫణీ....ఇంత ఖాళీగా ఉంటే లతికను కూడా వెంటబెట్టుకొనొస్తే బావుండేదిగా! ఇద్దరం హాయిగా షాపింగ్ కైనా పోయుండేవాళ్ళం"

    "ఓయమ్మో.........లతికతో షాపింగా? హైదరాబాద్ చార్మినార్ కెళ్ళి గాజులతో ప్రారంభించి, కోఠిలో ఉన్న పట్టుచీరెల దుకాణాలన్నీ చుట్టేసి, అబిడ్స్ లోని నగల దుకాణంలో వజ్రాల దగ్గర్నుంచీ అన్ని వస్తువులు చూసేసి, చివరికెవో పిచ్చివి కొనుక్కువస్తుంది. కొన్ని వేలు తగులబెట్టి సంతోషంగా ఇంటికొస్తుంది. డబ్బు విలువ అసలు తెలీదు. పోనీ మంచి టేస్టు ఉందా అంటే అదీలేదు. పిచ్చి టేస్టూ అదీనూ"

    ఫణీ! పెళ్లాం గురించి ఇతరులతో ఈవిధంగా మాట్లాడ్డానికి నీకు సిగ్గుగా లేదూ! ఆమెకి టేస్టు లేకపోతే నువ్వు కూడా వెళ్లి, నీకు నచ్చినవి కొనొచ్చుగా! కట్టుకున్న భార్య గురించి ఎంత దగ్గరివారైనా సరే హేళనగా మాట్లాడితే అవతలివాళ్ళు ఇంకా చులకన చేస్తారు . గుర్తుంచుకో! ఆమెను నీకు నచ్చినవిధంగా మలుచుకోవడం, నీ చేతిలో వుంది. నువ్వు అలా చేస్తే నీకు నచ్చిన విధంగా తృప్తి పొందడమే కాక ఆమెని కూడా సంతృప్తిపరచిన వాడివవుతావు. ప్రతీసారి ఆమె ఏం కొన్నా బాగులేదంటే ఆమె కూడా విసిగిపోయి మొండికెత్తుతుంది. నువ్వు ఆమెను గురించి మాట్లాడనట్లే, ఆమె కూడా నీ గురించి మాట్లాడుతుంది. అప్పుడు వినేవాళ్ళకు మీ గురించి చెడ్డ అభిప్రాయం కలుగుతుంది."

    పెద్దగా చప్పట్లు కొట్టాడు ఫణి.

    చెప్పడం ఆపి ఫణికేసి చూసింది.

    "చాలా బాగుంది నీ ఉపన్యాసం. ఈ మాటలన్నీ లతికని కూర్చోబెట్టుకుని చెప్పరాదూ! కాస్త బాగుపడుతుందేమో? అయినా తులసిచెట్టు తులసి చెట్టే, తుమ్మచెట్టు తుమ్మచెట్టే! పక్క పెక్కన పెట్టినంత మాత్రాన, తులసివాసన తుమ్మకొస్తుందా? నీ చదువూ, సంస్కారం, నీ ప్రవర్తనా లతికకి ఈ జన్మలో కాదు సరికదా, ఇంకొక జన్మ ఎత్తినా రాదు." అన్నాడు హర్షితకేసి చూసి నవ్వుతూ.

    "ఫణీ! పరాయి స్త్రీని నీ భార్యలేనప్పుడు పొగడడం, భార్యని చులకన చేసి మాట్లాడడం నీ సంస్కారమా?" నవ్వుతూనే చురకపెట్టింది హర్షిత.

    "ఒకప్పుడు నీ ప్రేమకోసం తపించిన ప్రేమ పూజారిని, ఇప్పటికీ మనందరం మంచి స్నేహితులం ఆమాత్రం చనువు తీసుకుని మాట్లాడడం నేరమా? ఒకప్పుడు నీ ప్రేమకోసం జపించి, తపించి నశించిన సామాన్య ప్రేమికుణ్ణి! నేను ప్రేమించిన వ్యక్తిని నా మిత్రుడు కొట్టేసినా ఏమాత్రం ఫీలవకుండా స్నేహాన్ని చెడగొట్టకోకుండా మెలుగుతూన్న వాణ్ణి. నాలో సంస్కారం లేకపోత్ నేను ప్రేమించిన నిన్ను నా మిత్రుడు కొట్టేస్తే, నేను మామూలుగా ఎలా ఉండగలిగాను?" క్రాపు సరిదిద్దుకుంటూ చెప్తున్న ఫణిని చూస్తే కాస్త భయం కూడా వేసింది హర్షితకి. ఎందుకనో మొట్టమొదటిసారిగా ఒక కొత్త మనిషిని చూసినప్పుడు కలిగే రకరకాల భయాలలా అనిపించింది. ఒకవేళ ఫణి ఏదైనా దుర్మార్గానికి తలపడితే? అందుకునేవచ్చాడేమో? రాత్రి బాత్ రూమ్ వెంటిలేటర్ నుంచి చూసింది ఫణి అయుండాలి. అతనిలో ఏదో పైశాచికత్వం తలెత్తినట్లుంది. ఆనంద్ కి ఫోన్ చేసి రమ్మంటే?......మెల్లగా వణుకును అదుపు చేసుకుని, "ఫణీ ఆనంద్ కి ఫోన్ చేసి, నువ్వొచ్చావని చెప్పి ఇంటికి రమ్మననా? కబుర్లు చెప్పుకుని భోంచేసి వెళ్లొచ్చు" అంది హర్షిత ధైర్యం తెచ్చుకుని, ఎలాగో ఒక్కొక్క మాటా నొక్కిపలుకుతూ.

    "నో.....నో......నాట్ నెససరీ హర్షితా.....నేనొచ్చింది ఆనంద్ కోసం కాదు, నీకోసం?"

    అతనికేసి తీక్షణంగా చూసింది హర్షిత.

    "అవును హర్షితా! రాత్రి నాకొక పీడకలొచ్చింది. నువ్వూ ఆనంద్ కార్లో ఎటో వెళుతున్నారట. కార్ కి ఆక్సిడెంట్ అయిందట బస్సుతో. కారు పెద్దగా చప్పుడు చేసుకుంటూ వెళ్ళి రోడ్డు ప్రక్కనున్న చెట్టుకి కొట్టుకుందిట. నువ్వు డోర్ నుంచి కిందపడిపోయి, బస్సుకింద నలిగిపోయావట. మీకారు వెనకాలే నేనూ, లతికా కూడా వొస్తున్నాంట. ఎక్కడికో అందరం కలిసి పిక్నిక్ లాగా వెళదామని బయలుదేరామట. నీ శవం మీద పడి లతికా నేను ఒకటే ఏడుస్తున్నాంట. బిగ్గరగా అరిచానట నిద్రలో. లతిక లేపి ఏం జరిగిందని అడిగింది. నాకొచ్చిన పీడకల చెపితే, తనూ చలించిపోయింది. 'అలాంటి కల మంచిదే! అంటే హర్షితకి ఆయుష్షెక్కువ!కాసిన్ని మంచినీళ్ళు తాగి పడుకోండి. రేపొకసారి వెళ్ళి మాట్లాడండి. ఆ పీడకల మర్చిపోయినట్టవుతుంది' అని చెప్పింది. అందుకే వొచ్చాను. వస్తామరి..... రేపో ఎల్లుండో వీలు చూసుకుని నేనూ లతికా ఈ కల విన్నాక లతిక కూడా నిన్ను చూడాలంటోంది" అంటూ లేచి నుంచున్నాడు.

 Previous Page Next Page