"లేకపోతే మ్యాజిషియన్ చేశాడనుకున్నావా?" అంది హర్షిత.
"గుత్తొంకాయి, బ్రహ్మాండం, ఇంకొంచెం వెయ్యి" అంటూ ప్లేటు చాపాడు ఫణి
"నేను చేస్తే ఒక్క రోజన్నా ఇలా పొగిడారా?" మూతి ముడుచుకుంది లతిక.
"నువ్విలా చేస్తేగా!" బదులు చెప్పాడు ఫణి.
"లతికా! ఈ మగవాళ్ళకెప్పుడూ పొరుగింటి పుల్లకూరే రుచి!" అంది హర్షిత. నవ్వుతూ, వాతావరణం భోజనాలముందు సీరియస్ కాకుండా ప్రయత్నిస్తూ. ఆ తరువాత సంభాషణంతా సినిమాల గురించీ, పాత సినిమా యాక్టర్ల గురించి, పాత పాటలగురించీ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గళం గురించి, ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి గురించీ, బాలసుబ్రహ్మణ్యం పలికే రకరకాల రాగభావాల గురించీ హాయిగా జరిగింది.
టైము రెండు ఝాములు దాటింది.
"ఇక వెళ్లొస్తాం. చాలా రాత్రయిపోయింది." లేచాడు ఫణి.
"ఈ రాత్రికిక్కడ పడుకోండి. చాలా పొద్దుపోయింది. రేప్పొద్దుటే లేచి వెళ్దురు గాని" అన్నాడు ఆనందమూర్తి. "నో....నో... వెళ్లాలి పొద్దుటే బద్దకిస్తే ఆలస్యంగా లేస్తే రేపు లంచ్ కూడా ఇక్కడే అవుతుంది. హర్షిత బాబు వాళ్ళమ్మని ట్రబుల్ చేస్తున్నానని తిట్టుకుంటాడు . బై."... అంటూ బయటికి నడిచాడు ఫణి.
"విష్.....యు.....ఆల్ ది బెస్ట్..." అని ఫణి వెనకాలే వెళ్ళింది హర్షితకి బై చెబుతూ లతిక.
అలిసిపోయిన హర్షిత వాళ్లు వెళ్ళగానే తలుపులు వేసొచ్చి డ్రెస్సు మార్చుకోవడానికి బాత్ రూం వైపు వెళ్లింది. నైటీ తీసుకుని నైటీ మార్చుకుంటూన్న హర్షిత బాత్ రూం వెంటిలేటర్ లోంచి కనబడ్డ వ్యక్తిని చూసి కెవ్వుమంది!
ఆ కేకకి పరుగెత్తుకొచ్చాడు ఆనందమూర్తి. హర్షిత బాత్ రూం తలుపు ధబాల్న తెరిచి ఆనందమూర్తిని గట్టిగా పట్టుకొని వణికిపోతూంది.
"హర్షీ! ఏమయింది? ఏమయింది? అలా వొణికిపోతున్నావు" ఆమెను గట్టిగా కౌగిలించుకుని వీపుపై నిమురుతూ అడిగాడు ఆనందమూర్తి.
"ఎవరో .....ఎవరో బాత్ రూమ్ వెంటిలేటర్ ఎత్తి నాకేసి చూస్తున్నాడు"
"ఆ.!...!" అంటూ ఒక్క అంగలో బాత్ రూంలో కెళ్ళి స్టూలెక్కి వెంటిలేటర్ ఎత్తి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు .చుట్టు పక్కల.
"హర్షీ! ఎవరూ లేరోయ్, నీ నీడని చూసి నువ్వే భయపడుంటావు" నవ్వుతూ ఆమె బుగ్గలు నిమురుతూ అన్నాడు.
"కాదానంద్! ఎవరో వుండాలి........ నాకేదో......భయంగా వుంది" చెప్పడం ఆపింది.
గబుక్కున ఫణి మొహంలా అనిపించింది. "అంది భయంగా. ఆనంద్ పెద్దగా నవ్వేశాడు. "హర్షీ! అంతా నీ ఊహ! ఇమాజినేషన్. మనముందేకదా వాళ్ళిద్దరూ కార్లోవెళ్ళిపోయింది. నీకు వెంటిలేటర్ దగ్గర ఎలా కనిపిస్తాడు పైగా ఫమి ఎంత దుర్మార్గుడయినా అలాంటి పని చెయ్యడు. అతడొక డాక్టరు" అన్నాడు హర్షితని నవ్వించడానికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ. "అవును నిజమే! ఇంకెవరో దొంగ అయి వుంటాడు" అంది హర్షిత.
"నేను చుట్టు పక్కల చూశానుగా! ఎవ్వరూ లేరు. దొంగే అయినా పారిపోవడానికి టైము పట్టాలి కదా! నువ్వే ఏదో చూసి భయపడుంటావు. బాగా టైర్డ్ అయిపోయావు. పద నిద్రపోదాం" అంటూ ఆమెని మంచం దాకా నడిపిస్తూ తీసికెళ్ళాడు ఆనందమూర్తి. హర్షిత మనస్సులో మాత్రం వెంటిలేటర్ లోంచి కనిపించిన కళ్ళు తననే చూస్తున్నట్టనిపిస్తూ వుంటే, ఆనంద్" అంటూ అతడికి మరింత దగ్గరగా జరిగి పడుకుంది.
"ఎవరతను? ఎవరివా కళ్ళు? ఆనంద్ అన్నట్టు అది తన భ్రమా? కాదు..... తను స్పష్టంగా చూసింది! ఏమో! ఏమీ అర్ధం కావడం లేదు' అనుకుంటూ ఆనంద్ చెప్పే కబుర్లు వింటూ నిద్రలోకి జారుకుంది హర్షిత.
* * *
తలంటిపోసుకుని జుట్టుకు కట్టుకున్న ముడి విప్పి, టవల్ తీసి ఆరేసి జుట్టు దులుపుకుంటూ బాల్కనీలో పడుతూన్న నీరెండకి జుట్టారబెట్టుకుంటూ, వేళ్ళతో చిక్కులు తీసుకుంటూ కూర్చుంది హర్షిత. నిమ్మపండు రంగుకి మెరూన్ బార్డర్ కొట్టొచ్చినట్టుగా కనబడుతూన్న బెంగాల్ సిల్క్ చీర ఆమె శరీరానికి మరింత వన్నెతెచ్చింది. కుంకుడు గింజంత మెరూన్ కుంకంబొట్టు ఆమె విశాలమైన ఫాలభాగంలో చందమామలా మెరుస్తోంది. తీర్చి దిద్దుకున్న కాటుకరేఖలు కళ్ళకు మరింత అందాన్నిస్తున్నాయి. ఎడంచేతి మునివేళ్ళతో చిక్కులు తీసుకుంటూ కుడిచేతిలోని బిస్కట్టును మెల్లగా కొరుకుతూ, పూలకుండీలో ఉన్న గులాబీ మొక్కల సౌందర్యాన్ని చూస్తోంది హర్షిత.
సౌందర్యారాధనలో ఉన్న హర్షిత కాల్ బెల్ వినగానే ఉలిక్కిపడి లేచింది.
తలుపు తీసి ఆశ్చర్యంగా "నువ్వా" అంది.
"ఏం? నేను నేనుగా కనబడ్డం లేదా?" అన్నాడు.
"ఫణీ! ఎప్పుడూ నువ్విలాంటి పిచ్చిమాటలే మాట్లాడుతావు. ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా చెపుతావు తప్ప, సమాధానం తిన్నగా చెప్పవు. అంతా డొంక తిరుగుడే" అంది చిరుకోపంతో.
"హర్షితా! ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు" అన్నాడు ఆమె చెప్పే మాటలని పట్టించుకోకుండా ఫణి.
అప్పుడప్పుడు అతడామెని అలా పొగుడుతూనే ఉంటాడు. అది హర్షితకి అలవాటే. అయినా ఈ రోజెందుకో అతని పొగత్త అసహ్యంగా అనిపించింది. "ఇలాంటి చీరే ఒకటుంది ఆ షాపులో. లతికకి కొని పట్టుకెళ్ళు" అంది. ఫణి పెద్దగా నవ్వాడు.
"ఎందుకు నవ్వుతావు? కనీసం చీర కొనుక్కొచ్చావని లతిక సంతోషిస్తుంది" అంది హర్షిత.