శ్రీరామ్ అక్కడకు వచ్చాడు వనజ, అతడు చాలా స్వేచ్చగా తిరుగుతూండేవారు.
"నేను నీకు చాలా ఋణపడి వున్నాను" అన్నాడు శ్రీరామ్ ఓ రోజున వనజతో.
"భార్యాభర్తల మధ్య ఋణాలుండవు" అన్నది వనజ.
"మనమింకా భార్యాభర్తలం కాలేదు" అన్నాడు శ్రీరామ్.
"ఏ క్షణంలో నువ్వు నన్ను ఆ రిక్షావాడి నుండి రక్షించావో అప్పుడే నా మనసులో భర్తగా స్థానం సంపాదించుకున్నావు. ఆ క్షణం నుంచీ మనం భార్యాభర్తలం. మిగతా వన్నీ పెద్దవాళ్ళ ఫార్మాలిటీస్" అన్నది వనజ.
"ఈ సంగతి ముందే చెబితే నేను నీ కింత దూరంగా వుండేవాణ్ణి కాదు గదా" అంటూ కాస్త దగ్గరయ్యాడు శ్రీరామ్.
వనజ అభ్యంతర పెట్టలేదు.
ఆ విధంగా ఇద్దరూ ఒకటి కూడా అయ్యారు.
శ్రీరామ్ కు జీవితంపై చాలా ఆశలున్నాయి. అతడు చాలా పెద్ద ఎత్తులో వున్నాడు. అతడి అభిరుచులకు అనుగుణంగా వనజ చేతనైనంతలో ఆర్ధికంగా అతడికి సాయపడుతున్నది.
అలా ఓ సంవత్సరం గడిచింది.
ఒకరోజున శ్రీరామ్ ఆమెతో "సారీ వనజా!" అన్నాడు.
"నాకో మంచి పెళ్ళిసంబంధం వచ్చింది. వధువుతో ఇరవై వేల కట్నం. ఆపైన మంచి హోదాగల ఉద్యోగం. నా తల్లిదండ్రులీ పెళ్ళి చేసుకోమని బలవంతపెడుతున్నారు...."
"మరి నువ్వు నా సంగతి చెప్పలేదా!" అన్నది వనజ.
"చెప్పాను. వాళ్ళకు నువ్వు నచ్చలేదు...."
"నువ్వూ మా వాళ్ళకు నచ్చవు. మనవాళ్ళ సంగతి వద్దు. నీ సంగతి చెప్పు...." అన్నది వనజ.
"ముందు నీ సంగతి చెప్పు!" అన్నాడు శ్రీరామ్.
"నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నా నంటే-నీవులేక పోతే నేను బ్రతుకలేను. నాకు నువ్వుకావాలి" అన్నది వనజ.
"అందుకే సారీ చెప్పాను" అన్నాడు శ్రీరామ్
"అంటే?"
"నీమీద చాలా కథలున్నాయి. ఉద్యోగంలో చేరిన అతిస్వల్పవ్యవధిలో నీ బాస్ నా కోసం ఉద్యోగం వేయించాడు. ఆయనకంత అవసరమేమిటి? నేను నిన్ను నమ్ముతాను. కానీ లోకం నమ్మదు. నేను నీతో జీవించాలను కుంటున్నాను. కానీ నీతోపాటు ఈ లోకంలోనే జీవించాలి. లోకాన్ని నేను విస్మరించలేను" అన్నాడు శ్రీరామ్.
వనజ అతణ్ణి బ్రతిమలాడింది. అతడి ముందు ఏడ్చింది. శ్రీరామ్ చలించలేదు.
"నువ్వు వేరే పెళ్ళి చేసుకునేమాటైతే నన్ను చంపేసేయ్" అంది వనజ.
"హత్యలుచేయడం నా వల్లకాదు" అన్నాడు శ్రీరామ్.
అతడు దృఢ నిశ్చయంతో వున్నాడు.
"నీ కోసం నన్ను ప్రేమించి పెళ్ళాడాలనుకున్న నా బాస్ ను వదులుకున్నాను" అంది వనజ.
"అతడి ప్రేమను నువ్వు నమ్మావా వనజా? కొన్నాళ్ళ పాటు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆ పైన తనే నిన్ను వదిలించుకుందుకు చూసేవాడు" అన్నాడు శ్రీరామ్.
శ్రీరామ్ పచ్చకామెర్ల రోగి కూడా అయ్యాడని వనజ గ్రహించింది.
"శ్రీరామ్! అయితే యిక నువ్వు నాకు దక్కనట్లే.....బహుశా నేను ఆత్మహత్య చేసుకుంటాను."
"ఇప్పుడలా అనిపిస్తుంది. తర్వాత అంతా మామూలైపోతుంది."
"పోనీ నా ఆఖరి కోరిక తీరుస్తావా?"
"ఏమిటది?"
ఆ కోరిక శ్రీరాం కిష్టమయినదే. ఒక్కసారి అతడామెతో గడపాలి.
శ్రీరామ్ సంతోషంగా అంగీకరించాడు.
అప్పుడు వనజ అతణ్ణి కౌగలించుకుంది. అది ఎంతో బలమైన కౌగిలి. తను మనసారా ప్రేమించిన మగవాడు తనకు దక్కకుండా పారిపోతూంటే ఆపడం కోసం సర్వశక్తులూ క్రోడీకరించిన ఒక మగువ కౌగిలి అది.
ఆ కౌగిలిలో ఉక్కిరిబిక్కిరావుతూనే ఆనందిస్తున్నాడు శ్రీరామ్. అయితే ఆ కౌగిలి వెన్నుపోటు పొడవడానికని అతడికి తెలియదు. తెలిసే సరికి బలంగా కత్తి అతడి వెన్నులో దిగబడింది.
"దుర్మార్గుడా! స్త్రీలను వంచించే నీ వంటి వారిని నేను బ్రతకనిస్తా ననుకున్నావా?" అన్నది వనజ.
వనజ చేతిలో శ్రీరామ్ చచ్చిపోయాడు.
* * *
"ఆఖరికి నీ అదృష్టం యిలా తగలడిందేమిటే?" అంది వనజతో సుమిత్ర.
వనజ జైల్లో కటకటాల వెనుక వున్నది.
సుమిత్రకు వనజ అప్పుడు శ్రీరామ్ తనకేవిధంగా పరిచయమయినదీ చెప్పి, "ఆ రోజు ఆ రిక్షావాడి చేతిలో మానభంగం పొందినా నా కీ దశ పట్టేది కాదు. ఎందుకంటే ఆ ఒక్క క్షణంలో వాడిమీద ద్వేషమే కలిగేది. తరువాత మనసు సరిపెట్టుకునేదాన్ని. కానీ ఈ శ్రీరామ్ నన్ను పూర్తిగా వశపర్చుకున్నాడు. వాడు లేనిదే నేను బ్రతకలేననే స్థితికి నన్ను తీసుకుని వచ్చాడు ఆ రోజు నన్నలా రక్షించి, ఇప్పుడీ స్థితిని కల్పించాడు. ఆ రిక్షా వాడు తలపెట్టిన మానభంగంకంటే వీడు తలపెట్టిన మానభంగం క్రూరమయినదీ, ఘోరమయినదీ" అన్నది.
అప్పుడామె ఏడ్వడం లేదు.
ఆమె చూపులు, మాటలు అమాయకురాలయిన ఆడపిల్లలను మాయమాటలతో వశపర్చుకోవాలనుకునే దొంగ ప్రేమికులకు తిరుగులేని హెచ్చరికల్లా ఉన్నాయి.
-:అయిపోయింది:-